– లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాట్లు
– ఏకంగా 12 సీట్లు వస్తాయంటూ కార్యకర్తలకు భరోసా
– అధికారంలో ఉన్నప్పుడు సాధ్యం కానిది
– ప్రతిపక్షంలో ఉండి అయ్యే పనేనా?
– ఫేక్ సర్వేలతో కేసీఆర్ మభ్యపెడుతున్నారా?
– కొన్ని సంస్థలతో లోపాయికారి ఒప్పందాలు జరిగాయా?
– సోషల్ మీడియాలో ట్రోల్
Kcr fake survey reports to secure 12 seats in lok sabha: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నేతల ప్రసంగాలు హోరెత్తుతున్నాయి. అగ్ర నేతలంతా తెలంగాణను టార్గెట్ చేశారు. అయితే, ఎన్నికలు దగ్గరపడేకొద్దీ బీఆర్ఎస్ నేతల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. దానికి కారణం, గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం రెండు శాతం ఓట్లతోనే ఓడిపోయామని.. ఈ నాలుగు నెలలలో కాంగ్రెస్ పాలనపై జనం విసిగెత్తి ఉన్నారని, రేవంత్ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని, 12 సీట్లు ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని అటు జనానికి, ఇటు కార్యకర్తలకు కేసీఆర్ నూరిపోస్తున్నారు. ఇదే నిజమని నమ్మేలా ఫేక్ సర్వే రిపోర్టులు చూపిస్తూ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారని, గత అసెంబ్లీ ఎన్నికలలోనూ ఈ తరహా ఫేక్ సర్వే రిపోర్టులను చూపించి బొక్క బోర్లా పడ్డారని అంటున్నాయి ప్రత్యర్ధి పార్టీలు.
ప్రీపోల్ సర్వే రిపోర్టులు
కీలక నేతలు జంప్ కావడంతో కారు ఖాళీ అయింది. బయటకొచ్చిన వాళ్లలో అధిక శాతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు బలహీనపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే, పార్టీ నాయకత్వం మాత్రం అలాంటిదేమీ లేదు. ఒకరిద్దరు నేతలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ బలహీనపడదని, తమది నాయకుల తయారీ కర్మాగారమని, అందరూ వెళ్లిపోయినా కొత్త తరం నాయకులను తయారు చేయగల సత్తా ఉందంటూ చెప్పుకొస్తోంది. అయితే, ఈ కాన్ఫిడెన్స్ సంగతి ఎలా ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కారు పార్టీ, లోక్ సభ ఎన్నికల్లో అయినా గౌరవప్రదమైన సీట్ల సంఖ్య సాధించి ఉనికి కాపాడుకోవటమే కాదు. వీలైతే ఎక్కువ సీట్లు గెలుచుకుని సత్తా చాటాలని అనుకుంటోంది. ఈ క్రమంలోనే, లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ప్రీ పోల్ సర్వేల రిపోర్టులను గులాబీ బాస్ కేసీఆర్ తెప్పించుకుని విశ్లేషించుకుంటున్నారని సమాచారం.
లోపాయికారీ ఒప్పందాలు
కొన్ని సర్వే సంస్థలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని తమకు అనుకూలంగా రిపోర్టులు చేయించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇవన్నీ ప్రజలను, పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టేందుకు చేస్తున్న సర్వేలంటూ ఇతర పార్టీలు అంటున్నాయి. ప్రచార పర్వంలోనూ బీఆర్ఎస్ మిగిలిన పార్టీలకన్నా వెనకంజలో ఉంది. తాము చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుందామంటే అన్నింటా అవినీతి, అక్రమాలు కనిపిస్తున్నాయి. పోనీ తెలంగాణ సెంటిమెంటును నమ్ముకుందామనుకుంటే అసెంబ్లీ ఎన్నికలలో ఆ మంత్రం పనిచేయలేదు. అందుకనే కేసీఆర్ ప్రసంగాలలో ఎక్కువ శాతం వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అది కూడా కేసీఆర్ భాష తీరుతో రివర్స్ అయింది. ఈడీ 48 గంటలపాటు ప్రచారం చేయకూడదని ఆదేశం ఇవ్వడంతో ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక కేసీఆర్ హంగ్ పార్లమెంట్ అంశాన్ని తలకెక్కించుకున్నారు. హంగ్ వస్తే కింగ్ తామే అవుతామని కలలు కంటున్నారని ఇతర పార్టీల నేతలు అంటున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో గెలుచుకుంది 9 సీట్లు మాత్రమే. ఇప్పుడు విపక్షంలో ఉంది. మరి, 12 సీట్లు గెలవడం అంటే జరిగే పనేనా? ఇలా అనేక ప్రశ్నలతో కేసీఆర్ సర్వే రిపోర్టుల ఆధారంగా సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతోంది.