BJP Chief | కౌన్‌ బనేగా కమల దళపతి?
BJP Chief
Telangana News, హైదరాబాద్

BJP Chief | కౌన్‌ బనేగా కమల దళపతి? కిషన్‌ రెడ్డి ఇలాకాలో రసవత్తర రాజకీయం!

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ : రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల బీజేపీ రథసారథి (Districts BJP Chief) ఎవరనే విషయంపై ఉత్కంఠత కొనసాగుతున్నది. ఇటీవల 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను ప్రకటించారు. మేడ్చల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడిగా సెంట్రల్‌ ఫిలిం బోర్డు అడ్వయిజరీ ప్యానెల్‌ సభ్యుడు బుద్ది శ్రీనివాస్‌ను బీజేపీ అధిష్ఠానం నియమించింది. అయితే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల అధ్యక్షుల నియామకంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్టీ హైకమాండ్‌ పెండింగ్‌లో పెట్టింది. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సొంత ఇలాకాలో పార్టీ అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపి జిల్లా పీఠాన్ని అప్పగిస్తుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

ఎవరి ప్రయత్నాలు వారివే ..

ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడి (Rangareddy BJP Chief)గా బొక్క నర్సింహారెడ్డి, వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎ.మాధవరెడ్డిలు కొనసాగుతున్నారు. అయితే ఈసారి రెండు జిల్లాలకు కొత్త వారిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తున్నది. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సొంతూరు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తిమ్మాపూర్‌. ఈ నేపథ్యంలోనే మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బొక్క నర్సింహారెడ్డి అనేక పర్యాయాలు అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం వచ్చింది. ఈసారి ఇదే నియోజకవర్గానికి చెందిన పాపయ్య గౌడ్‌, మిద్దె సుదర్శన్‌ రెడ్డిలతోపాటు తోకల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు.

వీరిలో తోకల శ్రీనివాస్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈయన గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. యువకుడు కావడంతో అధిష్ఠానం ఇటువైపుగానే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. వికారాబాద్‌ జిల్లాలో రమేశ్ కుమార్‌, శివరాజ్‌, కేపీ రాజుల మధ్యే త్రిముఖ పోటీ ఉంది. అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ స్థాయిలో ఎవరికి వారుగా లాబీయింగ్‌ చేస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిలు సూచించిన నేతలకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం బట్టి తెలుస్తున్నది. సిఫార్సులకు ప్రాధాన్యం ఇస్తారా? లేక పార్టీ నియమావళి ప్రకారం ముందుకు వెళతారా! అన్నది వేచి చూడాల్సిందే.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని..

బీజేపీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పార్టీ సభ్యత్వాలను పూర్తి చేసుకున్నది. ఒకప్పటి కంటే బీజేపీ సంస్థాగతంగా ఆదరణ పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీజేపీ ఖాతా తెరవనప్పటికీ రెండు ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకున్నది. చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీగా ఈటల రాజేందర్‌లు ఘన విజయం సాధించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో జిల్లా అధ్యక్షుల ఎంపికలో అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నది.

మున్సిపాలిటీలతోపాటు జిల్లా, మండల పరిషత్‌, సర్పంచ్‌ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో పార్టీ నాయకత్వం ముందుకు వెళ్తున్నది. పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించే వ్యక్తినే అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తున్నది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఒక జిల్లాకు జనరల్‌ అభ్యర్థిని, మరో జిల్లాకు బీసీ అభ్యర్థిని అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన తర్వాత జిల్లా అధ్యక్షుడిని నియమిస్తారా? లేక ముందే ప్రకటిస్తారా! అని పార్టీ శ్రేణులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..