- ఊరు, పేరు లేని లెటర్‌తో రీజాయిండర్
- పీఆర్ఓ గ్రూపే ప్రామాణికమా?
- డైరెక్టర్ కమ్ కమిషనర్‌కు రీజాయిండర్ ఎలా ఇవ్వాలో తెలియదా?
- టెండర్లు రద్దు చేసేంత తప్పిదం జరిగిందా?
- సంచలనంగా ‘స్వేచ్ఛ’ అంగన్వాడీ టెండర్ల కథనం
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం
Anganwadi tenders: ‘‘అంగన్వాడీ టెండర్లలో ఆగమాగం’’ అని ‘స్వేచ్ఛ’ (Swetcha) ప్రచురించిన కథనంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ స్పందించారు. అదంతా నిరాధారం అంటూ ఊరు, పేరు లేకుండా ఆ శాఖ మీడియా గ్రూప్‌లో ఓ నోట్ సర్క్యులేట్ చేశారు. నిజానికి రీజాయిండర్ ఎవరు ఆధారాలు లేకుండా రాస్తారో వారి అడ్రస్‌కు పంపుతారు. అలాగే, సంబంధిత శాఖ డైరెక్టర్ లేదా కమిషనర్ సంతకం చేస్తారు. ఆ శాఖకు చెందిన వివరాలు వారి అడ్రస్ ఉంటాయి. కానీ, అవేమీ లేకుండా ఉన్నతాధికారులు స్పందించినట్లు ఓ నోట్‌లా ఇచ్చేశారు. ‘స్వేచ్ఛ’ కథనం నిరాధారమే అయితే ఈ అనుమానాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. టెండర్లు రద్దు చేసి చేతులు దులుపుకునేంత ఈజీగా నిజాలు అబద్ధాలు కావని బిడ్డర్స్ పలు ప్రశ్నలు వేస్తున్నారు.
Read Also- Gold Rate Today : భారీ గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్..
వీటికి సమాధానం చెబుతారా?
1. ఇన్నోవేటివ్ కంపెనీ ఓనర్స్ స్థానికత ఏంటి? తెలంగాణకు చెందిన వారా? గుజరాత్ వాళ్లా?
2. ఇన్నోవేటివ్, హల్లాదా ఇంజినీర్స్ కంపెనీలు ఒక్కటే అని మీకు తెలియదా?
3. శాంపిల్స్ తెచ్చిన రోజే ఈ నెల 8న నాణ్యత లేవని శృతికేష్, ఏటీఎఫ్ ఇండస్ట్రీలకు ఎందుకు చెప్పలేదు?
4. టెండర్ పత్రాల్లో లేని ఆ బిడ్డింగ్ నాణ్యత సెస్పిఫికేషన్‌ను ఏ నిర్ధారిత సంస్థతో పరీక్షలు చేసి నిర్ధారించుకుని రద్దు చేశారో చెప్పగలరా?
5. కార్పొరేట్ కంపెనీల కంటే వెయ్యి రూపాయలు తక్కువ కోట్ చేయగానే శుక్రవారం 9న సాయంత్రం టెండర్ రద్దు అయ్యేలా వ్యుహాత్మక లీకులు ఇచ్చింది ఎవరు? రద్దు కుట్రలు ఆ శాఖకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఎంఎస్ఎంఈలకు ఏం అవసరం?
6. ఒక్కో బెంచ్ రూ.2,600 చేస్తే రూ.10 కోట్లు ఆదా అవుతుందని తెలిశాక కూడా రద్దు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది. దానికి టెక్నికల్ వర్డ్స్‌తో కప్పిపుచ్చుకునేంత అవసరం ఉందా?
7. ఆరోపణలు వచ్చిన రోజే ఇలాంటి రీజాయిండర్ ఎందుకు ఇవ్వలేదు. రద్దుతో ఎవరికి లాభం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే నిరాధార వార్తలని మీరు అనలేరు.
8. రూ.30 కోట్ల చిన్న టెండర్‌కే సిండికేట్ వ్యవహారం నడిపించే ప్రయత్నం ఎవరు చేశారో మీ శాఖలో అధికారులకు తెలియదా? టెండర్స్‌తో ప్రజా సొమ్ము ఆదా కావాలి కాని కమిషన్స్ కక్కుర్తితో కార్పొరేట్ కంపెనీలకు అంటగట్టి కోట్లాది రూపాయలు ఖర్చు అయ్యేలా వ్యవహరించినందుకే ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం ఈ టెండర్స్‌పై ఉన్నది ఉన్నట్లు, కుండ బద్దలుకొట్టేలా రాయాల్సి వచ్చింది. ఇంకా నిరాధారమని ఓ నోట్ రాసి అదే రీజాయిండర్ అంటే ఎలా?
Read Also- Sravan Rao: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు మామూలోడు కాదు.. బాధితుడి ఆవేదన