Colonel Sophia Qureshi: కల్నల్ సోఫియా ఖురేషి.. ఇప్పుడీ పేరు యావత్ ప్రపంచ వ్యా్ప్తంగా మార్మోగుతోంది. ఎవరి నోట విన్నా, ఏ నలుగురు కలిసినా ఖురేషి గురించే చర్చ. ఇక గూగుల్, సోషల్ మీడియాలో అయితే తెగ వెతుకుతున్నారు. ఇంతకీ ఎవరీ సోఫియా ఖురేషి? ఈమె గురించి తెలుసుకోవడానికి జనాలు ఎందుకంతలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? బ్యాగ్రౌండ్ ఏంటి? కెరీర్‌లోని ముఖ్య ఘట్టాలేంటి? ప్రత్యేకించి మరీ ఆపరేషన్ సింధూర్ గురించి సోఫియాతోనే కేంద్రం మీడియాకు ఎందుకు వివరాలు చెప్పించింది? ఎవరీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్? అనే ఆసక్తికర, సంచలన విషయాలను ఈ ఎక్స్‌క్లూజివ్ కథనంలో తెలుసుకుందాం..
సోఫియా బ్యాగ్రౌండ్..
1981లో గుజరాత్‌లోని వడోదరలో కల్నల్ ఖురేషి జన్మించారు. 1997లో ఎంఎస్‌యూ బరోడాలోని సైన్స్ ఫ్యాకల్టీ నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ చదివారు. బయోకెమిస్ట్రీలో ఎమ్మె్స్సీ కూడా పూర్తి చేశారు. కేవలం 17 ఏళ్ల వయస్సులోనే 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA) ద్వారా భారత సైన్యంలోకి కమిషన్డ్ అయ్యారు. అలా అనతికాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన మొదటి భారతీయ మహిళా అధికారిణిగా ఆమె గుర్తింపు పొందారు. ఖురేషి నాన్న కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో చేశారు. అంతకుమునుపు ఆమె తాత భారత సైన్యంలో సేవలు అందించారు. కల్నల్ సోఫియా ఒక మెకానైజ్డ్ ఇన్‌ఫాంట్రీ అధికారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు.

అరుదైన రికార్డు..
2016లో పూణేలో జరిగిన ‘ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18’ అనే బహుళజాతి సైనిక విన్యాసాల్లో 40 మంది సభ్యుల భారత ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిణిగా కల్నల్ సోఫియా ఖురేషి గుర్తింపు పొందారు. ఆ విన్యాసాల్లో చైనా, అమెరికా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా సహా 18 ఆసియాన్ ప్లస్ దేశాలు పాల్గొన్నాయి. అన్ని ఆసియాన్ ప్లస్ బృందాల్లో ఏకైక మహిళా కంటింజెంట్ కమాండర్ సోఫియా కావడం విశేషం. అంతేకాకుండా, ఆమె ఆరేళ్లపాటు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. 2006లో కాంగోలోని యూఎన్ మిషన్‌లో కూడా సేవలు అందించారు. యుద్ధ ప్రాంతాల్లో కాల్పుల విరమణను పర్యవేక్షించడం, అక్కడి ప్రజలకు సహాయం చేయడం గర్వంగా ఉందని సోఫియా ఓసారి మీడియాతో పంచుకున్నారు. 2010 నుంచి శాంతి భద్రతా కార్యక్రమాల్లో చురుకుగా ఉన్నారు. పంజాబ్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్‌లో చురుగ్గా పాల్గొన్నారు. ఇందుకు గాను ఆమెకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (GOC-in-C) ప్రశంసాపత్రం లభించింది. అలానే ఈశాన్య ప్రాంతంలో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్‌లో ఆమె చేసిన కృషికి ఆమెకు సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ (SO-in-C) ప్రశంసాపత్రం లభించింది. ప్రస్తుతం కల్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్‌లో పనిచేస్తున్న ప్రతిష్టాత్మకమైన అధికారి. యువతులు ‘సైన్యంలో చేరండి’ అని ప్రేరణాత్మక సందేశాలు ఇస్తుంటారు. ఇది యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న యువతులను దేశ సేవకు ప్రోత్సహించాలన్నది ఆమె ఉద్దేశం. యూనిఫాంలో ఉన్న మహిళలు దేశానికి అంకితభావంతో సేవ చేయాలని ఎందరినో ప్రోత్సహించారు. ఖురేషీ భారత సైన్యంలో మహిళా అధికారులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

సోఫియా ఖురేషీ భారత సైన్యంలో మహిళా అధికారులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఆమె నాయకత్వం, శాంతి దళాల్లో సేవ, కుటుంబ నేపథ్యం ఆమెను దేశానికి గర్వించదగిన వ్యక్తిగా నిలిపింది. కాగా, ఆపరేషన్ సింధూర్ తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించింది కూడా ఖురేషినే. ఇవన్నీ ఒకెత్తయితే ఆపరేషన్ సింధూర్‌లో కూడా సోఫియా పాల్గొన్నారు.‘ జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో అశువులు బాసిన భారతీయులకు న్యాయం చేసేందుకే క్షిపణి దాడులు చేశాం. కేవలం కాల్పులు ఆపించడమే కాదు, అక్కడి ప్రజలకు మానవతా సహాయం చేయడం కూడా మా బాధ్యతే. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించాం. ఉగ్రవాద శిబిరాలను కచ్ఛితంగా గుర్తించి, వాటిని ధ్వంసం చేశాం. ఈ దాడుల్లో పాకిస్థాన్ పౌరులు చనిపోలేదు. మూడు దశాబ్దాలుగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోనూ విస్తరించి ఉన్న ఉగ్రవాద నియామకాలు, శిక్షణ కేంద్రాలు, లాంచ్ ప్యాడ్‌లు వంటి గత పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. వాటన్నింటినీ ద్వంసం చేయడమే మా లక్ష్యం’ అని మీడియాకు ఖురేషీ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పాక్‌లో ఎక్కడెక్కడ దాడులు జరిపారో పూర్తి వివరాలను మ్యాప్‌లో వివరించారు. అనంతరం పాక్‌లోని మురిడ్కేలో టెర్రరిస్టు క్యాంపును ధ్వంసం చేసిన వీడియోను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. 2008 ముంబై దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు ఈ మురిడ్కే ప్రాంతంలోనే శిక్షణ పొందారని కల్నల్ సోఫియా ఖురేషి వివరించారు. అలాగే బహవల్‌పూర్‌లో ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మమహ్మద్ ప్రధాన కార్యాలయం ఉండేదని అక్కడ ఉగ్రవాదులను రిక్రూట్ చేయడంతో పాటు వారికి శిక్షణ కూడా ఇచ్చారని కల్నల్ పేర్కొన్నారు.

బుధవారం అర్ధరాత్రి పాక్‌పై భారత్ చేసిన మెరుపు దాడులపై భారత రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ గురించి మీడియాకు వివరించారు. కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుంచే పైలట్ కావాలని ఎన్నో కలలు కన్నారు. చదువుకునే రోజుల్లోనే ఎన్‌సీసీలో చేరారు. ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించారు. 2019 డిసెంబర్ 18న ఆమె ఫ్లయింగ్ బ్యాచ్‌లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో ఆమె చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపారు. ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో వ్యోమికా పాల్గొని ‘ఔరా అబలా’ అనిపించారు.

కాగా, భారత నారీ శక్తి ప్రతిరూపాలు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆపరేషన్ సింధూర్ గురించి దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి వివరించిన తీరు భారత నారీ శక్తి గొప్పతనానికి నిదర్శనం. భారత స్త్రీ ధైర్యానికి వీరత్వానికి, సామర్ధ్యానికి నిలువెత్తు ప్రతీక ఇది. కాగా, పహాల్గం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల వితంతువులకు ఉగ్రవాదులు ‘వెళ్లి మీ మోడీకి చెప్పండి’ అన్నారు. భారతదేశం యొక్క నారి శక్తిని చూపించడానికి ప్రతీకార చర్యను వివరించడానికి భారతదేశం కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ను పంపడం, మీడియాకు కూడా వివరాలు వారితోనే చెప్పించడంతో ఆడపడుచులకు భరోసా ఇచ్చినట్లుగా ఉంటుందని ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా చేసినట్లుగా తెలుస్తున్నది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం తీసుకున్న చర్యల పట్ల జాతికి భరోసా కలిగించడమే కాకుండా, మహిళల దౌడ్యంలో వాళ్ల పాత్రను ఎలివేట్ చేయడమే లక్ష్యమని చెప్పుకోవచ్చు.