Water Cut Govt Precautionary Measure
సూపర్ ఎక్స్‌క్లూజివ్

TS Government :నీటి కటకట, సర్కారు ముందస్తు జాగ్రత్త

Water Cut, Govt Precautionary Measure: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి. రాష్ట్రంలో నిరుడు అక్టోబర్​నుంచి 54% లోటు వర్షపాతం నమోదు కావడం, ఈ ఏడాది సూపర్​ఎల్‌నినో ప్రభావంతో మార్చిలోనే ఎండలు మండిపోతుండటంతో 2023 మార్చితో పోల్చితే కృష్ణా బెల్ట్‌లో జూరాల నుంచి నాగార్జునసాగర్​దాకా, గోదావరి బెల్ట్‌లో ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ దాకా అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా ఆవిరైపోతున్నాయి.


తెలంగాణ సగటు వర్షపాతం 906.3 మి.మీ కాగా, నిరుడు (2022-23) 1387.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే సగటు కంటే 53 శాతం ఎక్కువ. దీంతో నిరుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కరువు వాతావరణం లేదు. అయితే, 2023 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మొత్తం 113.20 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 52.70 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో కలిపి 12 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా, ఒక్క మి.మీ వర్షపాతమూ నమోదు కాని పరిస్థితి. పసిఫిక్ మహా సముద్రంలో నవంబర్ – జనవరి మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువ నమోదు కావడంతో భారత్​ సహా వివిధ దేశాల్లో సూపర్​ ఎల్​నినో ప్రభావం ఉంటుందని నేషనల్​ఓషియానిక్​ అట్మాస్పియరిక్​అడ్మినిస్ట్రేషన్ (ఎన్​వోఏఏ) గత అక్టోబర్​లోనే అంచనా వేసింది. దీనికి తగ్గట్టే నేడు దక్షిణ భారతమంతా కరువు ఛాయలు అలముకుంటున్నాయి.

గతంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు పడితే ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండిన వెంటనే, జూరాల ప్రాజెక్టుకు వరద నీరు చేరేది. కానీ, నిరుడు వరద ప్రభావం లేకపోవటంతో కృష్ణానదిలో తగినంత ఇన్‌ఫ్లో లేదు. దీంతో జూరాల మీద ఆధారపడిన కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల్లోనూ తగినంత నీరు చేరలేదు. 9.657 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 2.084 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం గల కల్వకుర్తి ప్రాజెక్టు పరిస్థితీ ఇలాగే ఉండగా, డెడ్ స్టోరేజీ పోను శ్రీశైలంలో 36 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో 140 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నిరుడు మార్చిలో కృష్ణా పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు 8.62 మీటర్ల లోతుకు వెళ్లగా, ప్రస్తుతం 13 మీటర్ల దిగువకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వేసవి త్వరగా ప్రారంభం కావటంతో తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.


అటు గోదావరి ప్రాజెక్టుల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 26 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 10 టీఎంసీలు, మిడ్​మానేరులో 12, ఎల్ఎండీలో కేవలం7 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఎల్లంపల్లిలో నీరు తగ్గటంతో హైదరాబాద్‌కు నీటి సరఫరాకూ సమస్యలు వచ్చేలా ఉంది. ఈ ప్రాజెక్టులో గత మార్చి7న 17.51 టీఎంసీల నీరుండగా, తాజాగా 10 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. కాగా ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి రోజుకు 320 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు తరలిస్తున్నారు. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా ఆయా ప్రాజెక్టుల కింద సాగునీటి సరఫరాకు సర్కారు కోత పెట్టక తప్పని పరిస్థితి తలెత్తింది.

మిషన్ భగీరథ పథకం నిర్వహణ లోపాలు, కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయలేకపోవటంతో అందుబాటులో ఉన్న నీటిని జులై నెల వరకు పొదుపుగా వాడాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించి, అక్కడ నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు కార్యాచరణను అధికారులు సిద్ధం చేశారు. దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల కోసం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కి కోటి రూపాయలు నిధులు కేటాయించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టాన్ని కొనసాగించడానికి కడెం ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకునే దిశగానూ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక.. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే విషయంలో ఎలాంటి సమస్యలూ రానివ్వబోమని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సి సుదర్శన్ చెప్పారు. అదనపు డిమాండ్‌కు తగినట్లుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు బోర్టు ప్రకటించింది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం