Sand Scam
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Sand Scam: ఖమ్మం గుమ్మంలో సాండ్ స్కాం.. స్వేచ్ఛ ఎక్స్‌ప్లోజివ్ కథనం

  • సీతమ్మ సాగర్ సాక్షిగా అంతటా అక్రమాలే?
  • సొసైటీల మాటున కోట్ల రూపాయలు పక్కదారి
  • సిండికేట్‌గా మార్చి మాఫియాలో చక్రం తిప్పుతున్న శ్రీకర్?
  • బీఆర్ఎస్ హయాంలో అడ్డుకున్న ఐపీఎస్ శభరీష్‌ బదిలీ
  • ఇప్పుడు ఎలాంటి టెండర్స్ లేకుండా 20 రీచ్‌లు కైవసం
  • నామినేషన్ పద్దతిలో 300 కోట్ల నిర్వహణ పనులు
  • ఓవర్ లోడ్, అక్రమ రవాణాతో వేల కోట్ల వ్యాపారం
  • సీఎం హెచ్చరించినా జిల్లా మంత్రుల కనుసన్నల్లో..
  • ఇసుకాసురుల ఆగడాలపై కళ్లు మూసుకున్న టీజీఎండీసీ?
  • ఆదాయం తీసుకురావాల్సిన చోట వందల కోట్లు ఎదురిచ్చిన తీరుపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం

Sand Scam: తెలంగాణ ఇసుక మాఫియా కొంతమంది మంత్రులతో సిండికేట్ అయినట్టు అనిపిస్తున్నది. ఏటా వెయ్యి కోట్ల ఆదాయం రాబట్టాల్సిన చోట, టెండర్స్ లేకుండా అక్షరాలా రూ.200 కోట్లు బినామీలకు ఎదురిచ్చి జేబులు నింపుకోవడం చూస్తుంటే దందా పెద్దదిగా అనిపిస్తున్నది. అందుకు ఆంధ్రాకు చెందిన సెటిలర్ శ్రీకర్‌ చక్రం తిప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావును పట్టుకొని తన అక్రమ రవాణాకు అడ్డు పడ్డారని ఆనాటి ఐపీఎస్ శభరీష్‌ను రాత్రికి రాత్రి బదిలీ చేయించిన ఘనుడు ఇతను. ఇదెక్కడి అన్యాయం అని ఒక దశలో రాజీనామాకు సిద్ధమయ్యారంటే మాఫియా ఆగడాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇసుకాసురుల మాఫియా కింగ్ పిన్ శ్రీకర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ శాశిస్తున్నాడు. అధికార పార్టీ కీలక నాయకులను తన కనుసన్నల్లో పెట్టుకుని టెండర్స్ లేకుండానే నామినేషన్ పద్దతిలో ఇసుక తవ్వకాలను కోట్టేశాడు. పేరుకే గిరిజనుల సొసైటీలకు ఇచ్చినట్లు కనిపించినా ఎక్కడా అకౌంటబిలిటీ కనిపించదు.


అప్పుడు కాళేశ్వరం బ్యారేజీలు.. ఇప్పుడు సీతమ్మ బ్యారేజ్

బీఆర్ఎస్ హయాంలో పూడిక తీత పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మూడు బ్యారేజీల్లో 5 కోట్ల 70 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేశారు. 2015 ఇసుక పాలసీతో ఏటా రూ.1,000 కోట్ల ఆదాయం చూపించినా తెర చాటున రెండింతల దందా చేసుకున్నారు. ఇప్పుడు ఆ బ్యారేజీల్లో ఇసుక తీయరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మానేరుపై సుప్రీంకోర్టులో స్టే ఉన్నది. దీంతో ఇసుక మాఫియా కళ్లు సీతమ్మ సాగర్‌పై పడ్డాయి. నాలుగేళ్ల క్రితం అనుమతులు లేవని ఎన్జీటీ ప్రాజెక్ట్‌పై స్టే విధించింది. ఇంకా వెకెట్ కాలేదు. నీళ్లు గ్రామాల మీదకు రాకుండా కరకట్టలు ఉన్నాయి. ఇలాంటి చోట ప్రభుత్వం రూ.1,400 కోట్ల ఆదాయం రాబట్టేలా 2 కోట్ల 50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసేందుకు ఇరిగేషన్ సర్వే చేసి ఇచ్చింది. పూడికతీత పేరుతో ఇసుక తవ్వితే పర్యావరణ అనుమతులు అవసరం లేదు. దీంతో ఇసుకాసురుల కళ్లు సీతమ్మ సాగర్‌పై పడ్డాయి. భద్రాచలంలో 11 రీచ్‌లు, పినపాకలో 9 రీచ్‌లు ఇచ్చారు. పిసా చట్టం ప్రకారం ట్రైబల్ సొసైటీలకే ఈ రీచ్‌లు నిర్వహించాలి. కానీ, స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్‌లో అలాంటిది ఎక్కడా జరగడం లేదని తేలింది. మాఫియా, బినామీల చేతిలో చిక్కిన గిరిజనుల పేర్లు చెప్పుకుని తీరని ఆర్థిక నష్టం చేస్తున్నారు.

Read Also- Maharashtra: క్షమించు తల్లి.. తండ్రి కాదు కాలయముడు!

హ్యాడిలింగ్ చార్జెస్ స్కాం?

నదిలో నుంచి ఇసుకను స్టాక్ యార్డ్‌లోకి తెచ్చేందుకు గతంలో సోసైటీలు టెండర్స్ ద్వారా క్యూబిక్ మీటర్‌కు రూ.50 నుంచి రూ.80 దక్కించుకునేవి. మేడిగడ్డ పైభాగంలో గతంలో క్యూబిక్ మీటర్‌కు రూ.72 చొప్పున టెండర్లలో దక్కించుకున్నారు. దిగువ భాగంలో పిసా చట్టం ప్రకారం నిర్వహించాల్సి ఉండడంతో రూట్ మార్చి దందాలు చేస్తున్నారు రాజకీయ నేతల బినామీలు. గూడాల్లో కనీసం గ్రామ సభ కూడా ఏర్పాటు చేయకుండానే నిర్ణయాలు తీసుకున్నారు. నామినేషన్ పద్దతిలో వందల కోట్లు ఎదురు అంటగట్టేశారు. రూ.116 హ్యాండిలింగ్ ఛార్జెస్ అంటూ ఫిక్స్ చేశారు. రూ.30 సొసైటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో 20 రీచ్‌ల్లో 2 కోట్ల 50 లక్షల క్యూబిక్ మీటర్లకు ఇసుక తీస్తే మొత్తం రూ.360 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. కానీ, టెండర్స్ రూపంలో చేస్తే కనీసం రూ.44 తగ్గేది. అంటే రూ.110 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యేది. ఇక, రూల్స్‌కు విరుద్ధంగా స్టాక్ యార్డుల దగ్గర స్టోర్ చేయకుండా ఏకంగా గోదావరి నదిలోనే పెద్ద పెద్ద మెషిన్లతో లారీల్లో నింపేస్తున్నారు. దీంతో నామినేషన్ పద్దతిలో ప్రభుత్వం హ్యాడిలింగ్ ఛార్జెస్ రూ.300 కోట్లు ఇస్తే వారికి అయ్యే ఖర్చు రూ.60 కోట్లు మాత్రమే అవుతుంది. రూ.1,400 కోట్లు ఇసుక నుంచి ఆదాయం రాబట్టాలని చూసిన ప్రయత్నంలో ప్రభుత్వం సిండికేట్ మాఫియాకు నామినేషన్ పద్దతిలో వందల కోట్లు దారపోయాల్సి వస్తున్నది.

ఇప్పటికే 20 శాతం అమ్మేసుకున్న శ్రీకర్?

సొంత లారీలు, మెషినరీతో గోదావరి నదిపై విచ్చలవిడిగా శ్రీకర్ విరుచుకుపడుతున్నాడు. పిసా యాక్ట్ అమల్లో ఉన్నా ఇతని రూటే వేరు. నామినేషన్ పద్దతిలో దక్కించుకున్న బినామీల దగ్గర నుంచి గుడ్ విల్ కింద అంటూ ఆంధ్రా కాంట్రాక్టర్స్‌కు 20 శాతం అమ్మేశాడు. దీంతో రూ.50 కోట్లు ముందుగానే కొట్టేశాడని తెలుస్తున్నది. ఒక్కొక్క లారీకి వారం రోజుల తర్వాత ఈ – బిల్ జనరేట్ అవుతుంది. కానీ, అదే బిల్‌తో వరంగల్, కరీంనగర్, ఖమ్మం టౌన్స్‌కు రెండు మూడు ట్రిప్స్ అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్‌కు రూ.600 కంటే ఎక్కువగా నష్టం వాటిల్లుతున్నది. ఏటా రూ.100 కోట్ల ఇసుక అక్రమంగా తరలించేస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఓవర్ లోడ్‌లు కామన్‌గా మారిపోయాయి. ములుగు, భద్రాది కొత్తగూడెం జిల్లాలో అధికారులు చూసీచూడనట్లుగా ఉంటున్నారు. 600 లారీలను ఇటీవల పట్టుకున్న పోలీసులు కేవలం డ్రైవర్స్‌పైనే కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. రీచ్‌ల దగ్గర ఇసుక నింపే వారిపై చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లడం లేదు. దీనికి తోడుగా ఆనాడు ఈ మాఫియాలో భాగస్వామి అయిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అనుచరుడు వాసు, ఓ మంత్రి అనుచరుడు శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు నాయకుల బినామీలు, ఇసుకను సిండికేట్‌గా మార్చి దోచుకుంటున్నారని గోదావరి పరివాహక ప్రాంతం కోడై కూస్తున్నది.

ఆంధ్రా పెత్తందారుల దందాలు

సహజ వనరు అయిన ఇసుకపై వందల కోట్ల బిజినెస్ చేస్తున్న వారంతా 10 ఏండ్లుగా ఎంత జీఎస్టీ ఎగ్గొట్టారు. ట్రైబల్ సొసైటీ అకౌంట్స్ నుంచి ఎంతెంత డ్రా అయ్యాయి. తెలంగాణ సొసైటీలపై ఆంధ్రాకు చెందిన వారు చేస్తున్న ఇసుక దందా ఎలా ఉంటుందో కళ్లకు కట్టేలా మరో ఇన్వెస్టిగేషన్ స్టోరీలో చూద్దాం.

Read Also- Marriage: ఏంటిది భయ్యా.. మగాళ్లను బతకనివ్వరా?

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు