– సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు
– గాంధీ ఆస్పత్రి వద్ద నిరవధిక సమ్మె
– స్టైఫండ్ చెల్లింపులతో పాటు 8 డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన
– ఓపీ అత్యవసర సేవలకు మినహాయింపు
– జూడాలతో మంత్రి రాజనర్సింహా చర్చలు
– అసంపూర్తి వ్యక్తం చేసిన జూనియర్ డాక్టర్లు
– పూర్తి స్థాయిలో డిమాండ్లకు పట్టు
Telangana junior Doctors Strikes about their Demands:
రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. స్టైఫండ్ చెల్లింపులతో పాటు 8 డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా తలపెట్టిన సమ్మె కొనసాగుతోంది. ఓపీ అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సమ్మె బాట పట్టామని చెప్పారు. గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ప్రతినెల స్టైఫండ్ చెల్లించాలని, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, మెడికల్ కాలేజీల్లో మౌళిక వసతులతో కూడిన హాస్టల్స్ ఏర్పాటు చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 18న సమ్మె నోటీసులు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు.. సోమవారం నుంచి విధులకు దూరంగా ఉంటున్నారు. నల్ల బ్యాడ్జీల నిరసనకు కొనసాగింపుగా రాష్ట్రవ్యాప్తంగా పలు ఆస్పత్రుల వద్ద జూనియర్ డాక్టర్లు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
మరో దారి లేక సమ్మెకు!
ప్రభుత్వ ఆస్పత్రులలో కనీస వసతులు లేవని, ప్రతీ నెలా తమకు స్టైఫండ్ అందక నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు జూనియర్ డాక్టర్లు. అందుకే తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు మరో దారి లేక సమ్మెకు దిగినట్లు చెప్పారు. సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన పీజీలకు ప్రభుత్వ సర్వీస్ కింద నెలకు రూ.2.5 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.92 వేలు ఇస్తామనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే సుమారు వెయ్యి మంది జూనియర్ డాక్టర్లుండగా తెలంగాణ వ్యాప్తంగా 60 వేల మంది సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది.
రాజనర్సింహతో చర్చలు
సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంత్రి దామోదర రాజ నర్సింహాతో జూడాలు భేటీ అయ్యారు. అయితే, చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఇంకా చాలా అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో సమ్మె కొనసాగిస్తామంటూ ప్రకటించారు. కొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించినా, సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో తమ డిమాండ్లపై స్పందించి ఉత్తర్వులు ఇచ్చే వరకు తగ్గేదే లేదని స్పష్టం చేశారు.