❄️ యూట్యూబ్ ఛానల్స్ పేరుతో బెదిరింపులు
❄️ అదికూడా దళిత, బహుజన ఎమ్మెల్యేలపైనే..
❄️ కొన్నాళ్ల క్రితం మీనం శ్యామ్ వ్యవహారం వెలుగులోకి..
❄️ తెర వెనుక కథంతా నడిపింది మల్లన్నేనన్న ఆరోపణలు
❄️ ఇప్పుడు సామెల్ వీడియో కలకలం
❄️ అంతా మల్లన్న కుట్రేనని స్వయంగా చెప్పిన ఎమ్మెల్యే
❄️ యూట్యూబ్ ఛానళ్ల పేరుతో సాగిస్తున్న దందాలెన్ని?
❄️ అనుచరుల దగ్గర వందల వీడియోలు ఉన్నట్లు అనుమానం
❄️ సామెల్ వ్యాఖ్యలతో రంగంలోకి నిఘా వర్గాలు
❄️ తన సామాజిక వర్గం వారితో నియోజకవర్గానికో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నట్టు ఆరోపణలు
❄️ మీడియా ముసుగులో దందాలు.. బ్లాక్ మెయిల్ వ్యవహారాలంటూ విమర్శలు
❄️ తుంగతుర్తి నియోజకవర్గంపై మల్లన్నకు అంత ప్రేమ ఎందుకు?
Teenmaar Mallanna: నల్లగొండ, స్వేచ్ఛ: బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్‌ను టార్గెట్ చేసుకునే జర్నలిస్ట్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ దాకా ఎదిగిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. అలియాస్ చింతపండు నవీన్ కుమార్. తన కంటూ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకుని యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయి, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో జర్నలిస్ట్ కాస్త ఎర్నలిస్ట్‌గా మారాడన్న ఆరోపణలు అనేకం. ఆఖరికి అతనితో పని చేసిన వారే మల్లన్న తీరు నచ్చక బయటకు వచ్చి నానా తిట్లు తిట్టారు. అయితే, రాజకీయాల్లోకి వచ్చాక కూడా దందాల్లో తీన్మార్ వేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తనపై కుట్ర చేస్తున్నది బ్లాక్ మెయిలర్ మల్లన్న అని అన్నారు. దీంతో పాత విషయాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
సామెల్ కోపానికి కారణమేంటి?
ఈ మధ్య నియోజకవర్గంలోని వైన్స్ యజమానులతో సామెల్ సమావేశమయ్యారు. ఆ సమయంలో వారితో మాట్లాడుతుండగా డబ్బులు డిమాండ్ చేసినట్టుగా వీడియో ఒకటి బయటకొచ్చింది. దీంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా తీన్మార్ మల్లన్న కుట్ర అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వీడియోలు తీయడం బ్లాక్ మెయిల్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టన విద్య అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మల్లన్న పెద్ద బ్లాక్ మెయిలర్ అని కాస్త గట్టిగానే మాట్లాడారు.
గతంలో మీనం శ్యామ్ ద్వారా..
కొన్నాళ్ల క్రితం ప్రజా వాయిస్ న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న మీనం శ్యామ్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతారావును బెదిరించాడు. దీనిపై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజేంద్రనగర్ పోలీసులు శ్యామ్‌ను అరెస్ట్ చేశారు. లక్ష్మికాంతారావుతో తనను మోసం చేశారంటూ ఓ మహిళ తన దగ్గరకు వచ్చిందని శ్యామ్ చెబుతుండగా, సదరు మహిళతో కలిసి అతను బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్టు ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్టు చెప్పారు. ఈ శ్యామ్ ఎవరో కాదు. గతంలో తీన్మార్ మల్లన్న దగ్గర పని చేసిన వ్యక్తి. ఒకే కులం. నమ్మిన బంటుగా చాలాకాలం పని చేశాడు. కానీ, కొన్నాళ్ల క్రితం ప్రజా వాయిస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. అయితే, దీని వెనుక మల్లన్న ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. తన దగ్గర పని చేసిన వారి చేత యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లు ప్రారంభించి బ్లాక్ మెయిల్ దందాకు పాల్పడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. శ్యామ్ బ్లాక్ మెయిల్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక తనకేం సంబంధం లేదన్నట్టు తన ఛానల్‌లో శ్యామ్ సపరేట్‌గా వెళ్లిపోయాని మల్లన్న పేర్కొన్నాడు. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నది.
దళిత బహుజన ఎమ్మెల్యేలే ఎందుకు?
జర్నలిస్టుగా ఉన్న సమయంలో, రాజకీయాల్లోకి వచ్చాక తీన్మార్ మల్లన్న వల్లె వేస్తూ వస్తున్నది ఒకటే మాట. దళిత, బహుజనులకు న్యాయం. ఈ ఒక్క మాటను అడ్డు పెట్టుకుని ఎదుగుతూ, అదే దళిత, బహుజన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం ఏంటనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పైకి మాత్రం ఆయా వర్గాలపై ప్రేమ కురిపిస్తూ, తెర వెనుక దందాలకు తెగబడుతున్న మల్లన్న లాంటి వాళ్ల బండారం అంతా బయటకు రావాలని సామెల్ వ్యాఖ్యల తర్వాత రాష్ట్రమంతా చర్చ జరుగుతున్నది.
Also Read: Folk Singer: ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం!
తుంగతుర్తికి మల్లన్నకు లింక్!
2007లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సమయంలో తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. 2009లో మోత్కుపల్లి నర్సిహులు టీడీపీ తరఫున గెలిచారు. 2014, 2018లో బీఆర్ఎస్ తరఫున గాదరి కిషోర్ కుమార్ విజయం సాధించారు. కానీ, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మందుల సామెల్ పోటీ చేసి గెలిచారు. అయితే, అప్పటికే కాంగ్రెస్ పంచన చేరిన తీన్మార్ మల్లన్న తుంగతుర్తి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసినట్టు ప్రచారం ఉన్నది. నిజానికి అతను మున్నూరు కాపు. తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్‌డ్. అయితే, మల్లన్న భార్య ఎస్సీ. ఆమెను తుంగతుర్తి నుంచి పోటీ చేయించాలని ఎప్పటినుంచో ప్లాన్ వేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే సామెల్‌ను టార్గెట్ చేశాడని ఆయన అభిమానులు అంటున్నారు. దళిత, బహుజన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలన్నదే మల్లన్న కుట్రగా కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, తన సామాజికవర్గం వారితో నియోజకవర్గానికో యూట్యూబ్ ఛానల్ పెట్టి దందాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అనుచరుల దగ్గర వందల వీడియోలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.