రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు నో పర్మిషన్!
సొంత చొరవతో పార్టీ ప్రోగ్రామ్స్
టన్నెల్ పరిశీలన ప్రోగ్రాం తప్ప జిల్లా టూర్లకు దూరం
కవిత, కేటీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటనలు
పార్టీలో హాట్ టాపిక్..
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మాజీ మంత్రి, సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao)కు గులాబీ పార్టీ (BRS) సంకేళ్లు వేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తే ఎక్కడ మేలేజ్ పెరుగుతుందోనని అడ్డుకట్ట వేసినట్లు ప్రచారం కూడా జరుగుతున్నది. అందుకే ఆయనను కేవలం ఉమ్మడి మెదక్ (Old Medak District) కే పరిమితం చేసిందని సమాచారం. ట్రబుల్ షూటరే (Trouble shooter) కొన్ని కార్యక్రమాలను సృష్టించుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని టాక్. ఈ మధ్యకాలంలో ఆయన వెళ్లింది ఒక్క ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన (SLBC Tunnel Accident)కు తప్ప ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదని సొంత పార్టీ నేతలే పేర్కొంటున్నారు. కేవలం కవిత (MLC Kavitha), కేటీఆర్ (KTR) మాత్రమే జిల్లాల పర్యటనల (District tour)కు వెళ్తుండటంతో ఇప్పుడు ఆ పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి హరీశ్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనకు యువతతో పాటు ప్రజల్లో ఫాలోయింగ్ (Following) ఉంది. మాస్ లీడర్ (Mass Leader)గా కూడా పేరున్నది. అయితే ఆయనకు పార్టీ కొన్ని నిబంధనలు (Rules) విధించినట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. అయినప్పటికీ హరీశ్ రావుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు, పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు అధినేత కేసీఆర్ (KCR) అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఆయన ఎక్కడ పర్యటనకు వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీలో ఆదరణ ఎక్కువైతే నష్టమని భావిస్తున్నట్లు ప్రచారం. రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ సంపాదించుకుంటే రాబోయే కాలంలో రాజకీయ సమీకరణాలు మారితే ఏదైనా జరుగొచ్చని ముందస్తుగా కట్టడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో హరీశ్ రావును కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేశారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి మెదక్‌లో అన్ని నియోజకవర్గాల్లోనూ ట్రబుల్ షూటర్‌కు పార్టీ కేడర్ కాకుండా సొంత కేడర్ సైతం ఉన్నది. దీంతో ఆయనను ఆ జిల్లాకే అంకితం చేశారని సమాచారం. అందుకే ఆయన కూడా ఆ జిల్లాలోనే పర్యటనలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకున్నది.
కేటీఆర్‌కు గండిపడుతుందనే…
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President)గా కేటీఆర్ కొనసాగుతున్నారు. కేసీఆర్ తర్వాత పార్టీలో సెకండ్ నేతగా కేటీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తే పార్టీ కేడర్ (Cadre)తో పాటు సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా ఆయన వెనకే ఉండే పరిస్థితి ఉన్నది. దీంతో కేటీఆర్‌కు డ్యామేజ్ అవుతుందనే ట్రబుల్ షూటర్‌కు అడ్డుకట్ట వేశారనే ప్రచారం జరుగుతున్నది. అంతేగాకుండా ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి హరీశ్ రావుకు అభిమానులు ఉన్నారు. యువత ఫాలోయింగ్ కూడా ఉండటంతో ఆయన రాష్ట్ర పర్యటనలు ప్రస్తుతం చేస్తే ఇంకా బలోపేతమయ్యే అవకాశం ఉన్నది. ఇది గమనించే హరీశ్ రావుకు అనుమతి ఇవ్వడం లేదని సమాచారం. కేటీఆర్‌ను పార్టీలో కీలకం చేయాలంటే హరీశ్ రావుకు కళ్లెం వేయాలని భావించి, అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని, ఆయన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారని పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా హరీశ్ రావు పార్టీ మారుతున్నారని వినబడింది. ఈ ప్రచారంతో ట్రబుల్ షూటర్‌కు పార్టీ అధిష్ఠానం కళ్లెం వేసిందనే ప్రచారం జరుగుతున్నది.
ఆయనే కల్పించుకొని కొన్ని పార్టీ యాక్టీవిటీస్..
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం, మంత్రులు చేసే విమర్శలకు కౌంటర్లు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం చెప్పకున్నా హరీశ్ రావు మాత్రం కౌంటర్లు ఇస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కొన్నింటిని ఆయనే కల్పించుకొని నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొన్నింటిని మాత్రం అధినేత కేసీఆర్‌కు చెబుతున్నట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ట్రబుల్ షూటర్ నిత్యం ప్రజల్లో ఉండేలా ఏదో ఒక అంశంలో ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌కు వెళ్లి ప్రైవేటు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడి మీడియా అడిగితే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
టన్నెల్ పరిశీలన ప్రోగ్రాం తప్ప..
ఈ మధ్యకాలంలో హరీశ్ రావు ఏ జిల్లా పర్యటనకు వెళ్లలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన వద్దకు వెళ్లింది ఒకటే చెప్పుకోదగిన కార్యక్రమం. దానికి సైతం ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నేతలు ఆయనతో కలిసి వెళ్లారు. తప్పా మిగిలిన జిల్లాలకు చెందిన నేతలు వెళ్లలేదు. గతేడాది ఖమ్మంలో వచ్చిన వర్షాలకు నష్టపోయిన రైతుల పరామర్శకు వెళ్లారు. ఆ తర్వాత ఏ జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు వెళ్లలేదు. కేవలం ఎమ్మెల్సీ కవిత పార్టీ కార్యక్రమాలు, జాగృతి పేరుతో జిల్లా పర్యటనలకు వెళ్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల నిరసన, ధర్నా కార్యక్రమాల పేరుతో జిల్లాలకు వెళ్తున్నారు. ఈ ఇద్దరు నేతలు యాక్టీవ్‌గావెళ్తుండటం ఇప్పుడు పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ పరిణామాలతో హరీశ్ రావును పార్టీలో కట్టడి చేశారని పార్టీ నేతల్లోనే చర్చకు దారి తీసింది. మరోవైపు రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ఆయనకు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నది. అక్కడ ఆయన ప్రభావం చూపకపోయినా, ఆశించిన మేర పార్టీ అభ్యర్థులను గెలిపించుకోకపోయినా ఆయన ఫెయిల్యూర్‌ను కేడర్‌లోకి పరోక్షంగా తీసుకెళ్తుందనే ప్రచారం జరుగుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో హరీశ్ రావుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు అడ్డుకట్ట వేసేందుకే ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేసినట్లు ప్రచారం జోరుగా సాగుతున్నది.