అధికారుల నిర్లక్ష్యం.. ప్రమాదంలో యువత ప్రాణం
- మెడికల్ మాఫియా మత్తుకు చిత్తవుతున్న యువత!
- పసిగట్టి 8 నెలల క్రితమే ప్రజల ముందు ఉంచిన స్వేచ్ఛ
- అయినా అప్రమత్తం కాని డ్రగ్స్ కంట్రోల్
- తూతూ మంత్రంగా మెడ్ ప్లస్‌పై చర్యలు!
- ఇప్పుడేం సమాధానం చెబుతారు కమలాసన్ గారూ!
- ఇంకా ఎంతమంది మత్తుతో చావాలి?
- ప్రాణాలు పోయినా పట్టించుకోరా? ఇకనైనా మేల్కోండి!
– పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల కలకలం
– మైనర్ మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
– నగరంలో విచ్చలవిడిగా మత్తు దందా
– అలవాటు పడుతున్న యువత
– ముందే చెప్పిన స్వేచ్ఛ
– మెడికల్ షాపుల్లో అమ్మకాలు.. అధికారుల తీరును ప్రశ్నిస్తూ ఆగస్టులోనే కథనాలు
– తాజాగా మత్తు ఇంజక్షన్‌కు మైనర్ బలి
– ఇంకా ఎన్నాళ్లీ నిర్లక్ష్యం?
Hyderabad: మెడికల్ షాపుల్లో రూల్స్‌కు విరుద్ధంతా ఇష్టం వచ్చినట్టు అమ్మకాలు సాగుతుండడంపై గత ఆగస్టులోనే ‘స్వేచ్ఛ’ కథనాలు ప్రచురించింది. అధికారుల నిర్లక్ష్యాన్ని సైతం ఎత్తిచూపుతూ ప్రజల ప్రాణాలే పెట్టుబడిగా జరుగుతున్న దందా గుట్టంతా బయటపెట్టింది. తాజాగా మత్తు ఇంజక్షన్‌కు ఓ మైనర్ బలవ్వడంతో మరోసారి మెడికల్ షాపుల్లో, బయట ఇష్టారాజ్యంగా సాగుతున్న దందా చర్చనీయాంశమైంది.
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మహా నగరంలో యువత మత్తుకు అలవాటుపడుతూ జీవితాలను నాశనం చేస్తున్నది. దీన్ని గుర్తించిన స్వేచ్ఛ 8 నెలల క్రితమే కథనాలు ఇచ్చింది. మెడ్ ప్లస్ సహా ఇతర మెడికల్ షాపుల్లో జోరుగా సాగుతున్న మత్తు దందాను స్టింగ్ ఆపరేషన్‌తో బయటపెట్టింది. అయినా, అధికారుల్లో అదే నిర్లక్ష్యం. మత్తు ఇంజక్షన్ల దందాపై నిఘా లోపించడంతో తాజాగా పాతబస్తీలో ఓ మైనర్ బలయ్యాడు. డబ్బు సంపాదించటమే ధ్యేయంగా కొన్ని గ్యాంగులు ప్రమాదకరమైన ఇంజక్షన్లు, మాత్రలు తెప్పించి విక్రయిస్తున్నాయి. వీటికి వందల సంఖ్యలో యువకులు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు క్రమంగా మృత్యు ఒడికి చేరుతున్నారు. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే ఈ మత్తుకు బానిసవుతున్న వారిలో అధికంగా మైనర్లే ఉన్నారు.
పాతబస్తీలో నిఘా ఏది?
పాతబస్తీలో మత్తు దందా కొత్తేం కాదు. గతంలో పదుల సంఖ్యలో గ్యాంగులు గంజాయి విక్రయాలు సాగించేవి. కొంతకాలంగా పోలీసులు వరుసగా దాడులు చేస్తూ గంజాయి విక్రేతలను అరెస్టులు చేస్తుండటంతో మత్తు వ్యాపారం చేస్తున్న వారు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెఫెంటిమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు, ఆల్ఫాజోలెం టాబ్లెట్లు తెప్పించి అమ్ముతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసి వీటిని తెప్పించుకుంటుండటం. దీనికి నిదర్శనంగా ఇటీవల సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సయ్యద్ అసద్ ఉదంతాన్ని పేర్కొనవచ్చు. శాలిబండ ప్రాంతానికి చెందిన సయ్యద్ అసద్ న్యూ ఢిల్లీలోని ఇండియా మార్ట్ నుంచి ఆన్ లైన్ ద్వారా పెద్ద సంఖ్యలో ఇంజక్షన్లను తెప్పించి ఇక్కడ విక్రయిస్తూ పట్టుబడ్డాడు. నిజానికి ఈ మెఫెంటిమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను బ్లడ్ ప్రెషర్ సమస్య ఎదుర్కొంటున్న వారికి ఇస్తారని సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఈ ఇంజక్షన్లను అమ్మడానికి వీల్లేదు. ఇది ఓవర్ డోస్ అయితే గుండె, కాలేయం, కిడ్నీలపై తీవ్ర దుష్ప్రభావాన్ని కనబరుస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ పెడితే ఆయా వెబ్ సైట్లు ఈ ఇంజక్షన్లను ఎలా సరఫరా చేస్తున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దీంతోపాటు మెడికల్ షాపులు నడుపుతున్న కొంతమంది డబ్బు సంపాదించటమే ధ్యేయంగా ఇంజక్షన్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా అమ్ముతున్నట్టు సమాచారం. మార్కెట్‌లో 10 ఎంఎల్ ఇంజక్షన్ ఒక్కటి 70 నుంచి 80 రూపాయలకు అందుబాటులో ఉంది. అయితే, కొన్ని మెడికల్‌షాపుల యాజమాన్యాలు 150 నుంచి 200 రూపాయలు తీసుకుంటూ ఎన్ని ఇంజక్షన్లు కావాలంటే అన్ని విక్రయిస్తున్నాయి. వీటితోపాటు మత్తు దందా చేస్తున్న వారు ఆల్ఫాజోలెం మాత్రలు కూడా తెప్పిస్తూ వాటిని అమ్ముతున్నారు. వీటికి అలవాటు పడుతున్న యువకులు ఆ తరువాత వాటిని మానుకోలేక క్రమంగా మృత్యు ఒడికి చేరుతున్నారు. కొందరు చనిపోతున్నారు. తాజాగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుల్తాన్ పూర్ నివాసి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అయిన మహ్మద్ అబ్దుల్ నాజర్ మత్తు ఇంజక్షన్ తీసుకుని తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలాడు. షాబాజ్ అనే మరో యువకుడితోపాటు ఇంకో మైనర్ ఆస్పత్రిపాలై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మహ్మద్ అబ్దుల్ నాజర్ మరణానికి మెఫెంటిమైన్ సల్ఫేట్ ఇంజక్షనే కారణమని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.
అరెస్టులు చేస్తున్నా…
పాతబస్తీలో జోరందుకున్న ఈ మత్తు దందాకు అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఇటీవల దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురికి పైగా నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 3 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే మెఫెంటిమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు, ఆల్ఫాజోలెం టాబ్లెట్లు, గంజాయిని సీజ్ చేశారు. అయితే, కొత్తగా పుట్టుకొస్తున్న గ్యాంగులు ఈ దందాను కొనసాగిస్తున్నాయి. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ దందా జోరుగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.