slbc
సూపర్ ఎక్స్‌క్లూజివ్

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ ఇంకెంత కాలం.. మొదలైంది ఎప్పుడు.. ఆపింది ఎవరు?

  • 17 ఏండ్లుగా ఎస్‌ఎల్‌బీసీ అసంపూర్ణం!
  • టన్నెల్ పనుల్లో కనిపించని పురోగతి
  • టార్గెట్ 43.5 కి.మీ.. పూర్తయింది 33 కి.మీ.
  • ‘జలయజ్ఞం’లో రూ.2,813 కోట్ల అంచనాలు
  • అటవీ, పర్యావరణ, వైల్డ్ లైఫ్ పర్మిషన్లు
  • 2009లో లాంఛనంగా సొరంగం పనులు ప్రారంభం
  • జేపీ అసోసియేట్స్ కంపెనీకి దక్కిన కాంట్రాక్టు
  • 2009 వరదలతో కొంతకాలం పనులకు బ్రేక్
  • నెలకు 300 మీటర్లకంటే ముందుకు సాగని వర్క్స్
  • ప్రాజెక్టును పక్కన పెట్టిన బీఆర్ఎస్ స‌ర్కార్‌
  • మూడేండ్లలో పూర్తయ్యేలా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్

SLBC Tunnel: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కెనాల్ పనులు ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి తరహాలో నత్తనడకన సాగుతున్నాయి. తొలుత ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎస్సెల్బీసీ ఆలోచన మొదలైంది. రూ.480 కోట్లతో ప్రాజెక్టు రిపోర్టు తయారుకాగా నాగార్జున‌సాగ‌ర్‌ నుంచి లిఫ్ట్ స్కీమ్ ద్వారా నీటిని తరలించేలా 1995లో నిర్ణయం (జీవో 55, 17.4.1995) జరిగింది. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 43.5 కి.మీ. మేర టన్నెల్‌ను రెండు భాగాల్లో పూర్తి చేయాలని భావించి రూ. 2,813 కోట్ల అంచనా వ్యయంతో 2005 ఆగస్టు 11న ప్రభుత్వం విధాన నిర్ణయం (జీవో 147) తీసుకున్నది. జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు దక్కింది. విదేశాల నుంచి టన్నెల్ బోరింగ్ మెషిన్లను తెప్పించి, కొండలను తొలుస్తూ సొరంగాన్ని నిర్మించే ప్రక్రియ మొదలైంది. మొదటిసారిగా సైట్‌లోనే యంత్రాల అసెంబ్లింగ్ జరిగింది. లాంఛనంగా 2008 మార్చి నెలలో తొలి యంత్రం సిద్ధమైంది.


బ్రాహ్మణ‌గిరి ద‌గ్గ‌ర ఇన్‌లెట్‌గా మొద‌లై..

ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం దోమలపెంట మండలం బ్రాహ్మణగిరి దగ్గర ఇన్‌లెట్‌గా మొదలై అచ్చంపేట మండలం మన్నేవారి పల్లె దగ్గర సొరంగం ముగిసేలా డిజైన్ ఖరారైంది. సొరంగం తవ్వకం పనులు నెలకు 300-330 మీటర్ల మేర జరుగుతాయని జేఏఎల్ కంపెనీ భావించింది. కానీ వివిధ ప్రతికూల పరిస్థితుల్లో అది సగటున 27% ఫలితాలను మాత్రమే సాధించింది. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా మొదలైన ఎస్సెల్బీసీ టన్నెల్ పనులు 2009లో వచ్చిన వరదలతో ఆగిపోయాయి. కాఫర్ డ్యామ్ గోడ వరద నీటిని నివారించలేకపోవడం, ఫ్లడ్ కంట్రోల్ డోర్‌లు తెరుచుకోకపోవడంతో దాదాపు 66 అడుగుల మేర నీరు టన్నెల్‌లోకి చేరింది. బోరింగ్ యంత్రం 33 అడుగుల నీటిలో మునిగిపోయింది. తిరిగి పనిలో పెట్టడానికి ఏడాది సమయం పట్టింది. పనులు ఆశించినంత వేగంగా జరగకపోవడానికి ప్రకృతి వైపరీత్యాలు, గట్టిదనంతో కూడిన రాతి నేలలు కారణాలనే కాంట్రాక్టు సంస్థ పేర్కొన్నది. 1995లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు 7-8 ఏండ్లలో పూర్తవుతుందని పేర్కొనగా, వైఎస్సార్ ప్రభుత్వం ఐదేండ్లలో పూర్తవుతుందని పేర్కొన్నది. ప్రాజెక్టు వ్యయంలో వైఎస్సార్ ప్రభుత్వం రూ. 1300 కోట్లను విడుదల చేసింది కూడా. 2020 నవంబర్‌ నాటికి 70% పనులే పూర్తయ్యాయి. మొత్తం లక్ష్యం 43.5 కి.మీ. కాగా 33 కి.మీ. మేర పూర్తయింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ ఏడాది ఏప్రిల్ 14న కేసీఆర్ ఆ ప్రాంతంలో నిర్వహించిన ప్రచారంలో మాట్లాడుతూ.. ‘కుర్చీ వేసుకుని కట్టిస్తా.. ఏడేండ్లలో పూర్తి చేయిస్తా’ అని హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలకులకు తెలంగాణ పట్ల వివక్షతో పట్టించుకోలేదని విమర్శించారు. కానీ.. గడచిన పదేండ్ల కాలంలో ఈ టన్నెల్ పనులను నాటి బీఆర్​ఎస్​ సర్కార్​ పట్టించుకోలేదు.


రివ్యూ చేసి.. వదిలేశారు

ముఖ్యమంత్రిగా కేసీఆర్​ బాధ్యతలు తీసుకున్న తర్వాత నల్లగొండ జిల్లా నేతలతో అసెంబ్లీ కమిటీ హాల్‌లో (11.11.2014) టన్నెల్ పనులను ప్రారంభించడంపై సమావేశం నిర్వహించారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో మాట్లాడారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 4,776 కోట్లకు పెరిగింది. హామీ ఇచ్చినట్లుగా ఈ పనులను అప్పటి ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో అసెంబ్లీ సమావేశాల్లో భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రస్తావించారు. ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు సైతం వివరణ ఇచ్చారు. తిరిగి 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దేవరకొండలో (21.11.2018) జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ… జిల్లా నేతలైన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైఎస్సార్ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉండి వీరు ఏం సాధించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎస్సెల్బీసీ టన్నెల్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నది.

అర్ధంతరంగా ఆగిన పనులు

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-15 బడ్జెట్‌లో రూ. 325 కోట్లను అప్పటి ప్రభుత్వం టన్నెల్ నిర్మాణానికి కేటాయించింది. కానీ అంచనా వ్యయం పెరిగినందున అదనంగా రూ. 725 కోట్లు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నిర్మాణ సంస్థ ప్రతిపాదన పంపింది. విదేశాల నుంచి కొన్ని ఉపకరణాలను దిగుమతి చేసుకోవాల్సి ఉన్నందున రూ.150 కోట్లకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని కోరింది. కానీ ఇవేవీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇదే విషయాన్ని నల్లగొండ కాంగ్రెస్ నేతలు పలుమార్లు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఇందుకు వివిధ రకాల కారణాలున్నాయంటూ సీఎంగా కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు వివరణలు ఇచ్చారు. కానీ పదేండ్ల పాటు పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.

నాలుగు రోజుల క్రితం పనులు మొదలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై లోతైన సమీక్ష నిర్వహించారు. 2027కల్లా పూర్తి చేస్తామన్నారు. పది కి.మీ. మేర సొరంగం తవ్వకం జరిగితే ప్రాజెక్టు వినియోగంలోకి వస్తుందని, దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు 500కు పైగా గ్రామాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. ప్రాధాన్యంగా భావించి నిధులనూ విడుదల చేస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతేడాది (సెప్టెంబరు 21న) టన్నెల్‌ లోపలికి వెళ్ళి పనులు ఎక్కడ ఆగిపోయాయో పరిశీలించారు. అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించారు. నాలుగు రోజుల క్రితం పనులు మొదలయ్యాయి. కానీ అనుకోని కారణాలతో టన్నెల్‌లోని పైకప్పు కూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కకుపోయారు. పరిస్థితిని లోతుగా విశ్లేషించి మళ్ళీ ప్రారంభించడానికి కొంత సమయం పట్టే అవకాశమున్నది.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు