Siddipet district assigned lands issue
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Dubbaka Lands: పేదోళ్ల భూముల్లో దొరల పాగా! భూ భారతి వచ్చినా మారని తీరు!

అసైన్డ్ ఆగడాలు పార్ట్ 1


  • సిద్దిపేట జిల్లాలో నాయకుల భూ బాగోతం
  • పార్టీలే వేరు.. భూములు గుంజుకోవడంలో ఒక్కటే
  • నిత్యం నీతులు వల్లించే ఎంపీ ఫ్యామిలీ పేర వందల ఎకరాలు
  • 80 ఎకరాల అసైన్డ్ భూమి పట్టా భూమిగా ఎలా మారింది?
  • దుబ్బాక కేంద్రంగా సాగిన భూ దందా లెక్కలేంటి?
  • భూ భారతి వచ్చినా పనులు ఎలా చక్కబెట్టుకుంటున్నారు?
  • దుబ్బాకలో దొరల పాలైన పేదల భూములపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం:


Dubbaka Lands: రాజకీయాల్లో నీతి, నిజాయితీ అంటే ఇప్పుడు బూతద్దంలో చూసినా దొరికే పరిస్థితి లేదు. పైకి పెద్ద మనుషుల్లా కలరింగ్ ఇస్తూ, తెర వెనుక చేయాల్సినదంతా చేస్తున్న వారు ఎందరో. మీడియా ముందేమో నీతులు వల్లిస్తూ సుద్దపూస కబుర్లు చెబుతారు. కానీ, ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. రాష్ట్రంలో ఓ ఎంపీ (MP) తీరు అలాగే ఉంది. తన వాక్ చాతుర్యంతో తిమ్మిని బిమ్మి చేయగలిగిన ఆయన, గతంలో ఎమ్మెల్యే (MLA) గా ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీ నాయకుడిని కలుపుకుని పేదోడి పొట్టకొట్టి అసైన్డ్ భూములను చెరబట్టారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వచ్చాక తన కుటుంబ సభ్యుల పేర్ల మీద పట్టా భూములుగా మార్చుకున్నారు. అసైన్డ్ భూమి కొనుగోలు చేస్తే 6 నెలల జైలే కదా అనుకున్నారో ఏమో కూతురు, భార్య పేరు మీదకి రికార్డులు మార్చేసుకున్నారు.

సిద్ధమౌతున్న రిపోర్ట్

పేదోడి భూములను కొట్టేసేందుకు కట్టు కథలు చెప్పి, పూలింగ్ పేరుతో మసి పూసి మారేడుకాయ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గడిచిన 5 ఏండ్లలో ఆ ఏరియాలో చేసిన దందాపై ప్రజలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి భూములు ఎంపీ కుటుంబం చేతిలోకి వెళ్లడంతో చట్ట ప్రకారం శిక్షించి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. అసైన్డ్ భూములను గుర్తించిన రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు రిపోర్ట్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే, దీనిపై ప్రశ్నించిన వారిపై సదరు ఎంపీ చిందులు తొక్కుతూ ఫైర్ అవుతున్నారట.

అసలీ అసైన్డ్ భూముల కథేంటి?

దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి మండలం చౌదర్ పల్లిలో సర్వే నెంబర్ 294లో ఖారీజ్ ఖాత పేరుతో ప్రభుత్వ భూమి ఉంది. సేత్వార్, కాస్రాలో 176 ఎకరాల్లో విస్తరణ ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. ఈ భూమిలో వివిధ కులస్తులు సాగు చేసుకునే వారు. 294/1 నుంచి 294/10 వరకు వివిధ బై నెంబర్స్ వేసి 30 ఏండ్ల క్రితం అసైన్డ్ పట్టాలుగా ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. వీటిపై క్రయవిక్రయాలు చేయకూడదు. పీఓటీ యాక్ట్ ప్రకారం విక్రయిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ఉన్నది. అయితే, వందల ఎకరాల భూమి ఒకే దగ్గర ఉండడంతో సాగునీటి ప్రాజెక్ట్స్ పేరుతో ల్యాండ్ పూలింగ్ చేశారు. ప్రభుత్వానికి భూమి వెళితే మీకు పెద్దగా ఏమీ ముట్టదని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అప్పటికి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల నేతలు ఒక్కటై వ్యవహారాన్ని చక్కబెట్టారు. కొంతమంది బినామీ పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. పక్కనే ఉన్న ఎనగుర్తి గ్రామంలో సర్వే నెంబర్స్ 41, 65, 66, 104లోని అసైన్డ్ భూములను సైతం బినామీ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకుని వందల ఎకరాలు పొగు చేసుకున్నారు. అది లావాణి పట్టా అని పాత రైతులకు వచ్చినా కొత్తగా ఎంపీ కుటుంబం పేరు మీదకు 80 ఎకరాలు పట్టా భూమిగా మారడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంపీ భార్య మంజుల, కూతురు సింధూ పేర్లపై 40 ఎకరాల చొప్పున పేర్లు రికార్డుల్లోకి ఎక్కాయి.

భార్య పేరు మీద భారీగా పెరిగిన ఆస్తులు?

గతంలో దుబ్బాక బై ఎలక్షన్స్‌లో గెలిచిన ఈయన(ఎంపీ) ఎన్నికల అఫిడవిట్స్‌లో కుటుంబం పేరు మీద చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయి. అప్పటికి అసైన్డ్ భూమి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ట్విస్ట్ ఏంటంటే, ఒక్క ఏడాదిలోనే ఎంపీ ఎన్నికల సమయంలో మాత్రం తన భార్య పేరు మీద అసైన్డ్ భూమిని ప్రకటించారు. 44.29 గుంటలకు రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు చూపించారు. అయితే, ఇదంతా బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలతో చేతులు కలిపి అసైన్డ్ భూముల దందా కొనసాగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక గులాబీ నేత భూ సెటిల్మెంట్స్‌లో అసైన్డ్ భూములను ఎంపీకి వదిలేసినట్లు వినికిడి. ఇలా సిద్దిపేట జిల్లాలో పేదల పొట్టకొట్టి సాగు చేసుకోవడానికి గుంట భూమి లేకుండా చేసిన ఈ నాయకుల తీరుపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ చేసింది. ప్రతి సర్వే నెంబర్‌లో పాత రికార్డులు ఏంటి? కొత్తగా ఎలా మార్చుకున్నారు. పేదలకు ఓ చట్టం, రాజకీయ నాయకులకు మరో చట్టమా? వందల ఎకరాలను ఎలా పోగేసుకున్నారో ఆధారాలు సంపాదించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ ఉంది. అయినా కూడా దర్జాగా పనులు చక్కబెట్టుకోవడం చూస్తుంటే, తెర వెనుక అంతా ఒక్కటే అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తున్నది. అప్పుడు ధరణిలో ఇప్పుడు భూ భారతిలో అదే తంతు కొనసాగుతున్నదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కారు చౌకగా కొట్టేసిన అసైన్డ్ భూములను లీడర్ల చేతిలో నుంచి మళ్లీ తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

Read Also: Telangana Rising Team: హిరోషిమాలో తెలంగాణ రైజింగ్ బృందం.. కొత్త పెట్టుబడుల కోసం ఫోకస్!

Sunitha On Pravasthi: సారీ.. సారీ.. ప్రాధేయపడుతున్న సింగర్ సునీత?

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?