Illegal GM
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Seed Scam: ఏజెన్సీల్లో సీడ్ బాంబ్! అనుమతులు లేని విత్తనాలు… వేల ఎకరాల్లో సాగు?

తెలంగాణపై అంతర్జాతీయ విత్తన కంపెనీల కుట్ర?
ఏజెన్సీ ప్రాంతాలను ప్రయోగశాలగా మార్చుకున్నాయా?
అనుమతులు లేని మొక్కజొన్న విత్తనాలపై ప్రయోగాలు
ములుగు జిల్లాలో 6వేల ఎకరాల్లో పంట
ఒప్పందాలు లేకుండానే కొత్తరకం మొక్కజొన్న సాగు
బీటీ మొక్కజొన్న కావొచ్చని పర్యావరణ వేత్తల అనుమానాలు
ప్రత్యేక నెట్‌వర్క్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దందా
స్వేచ్ఛ ప్రత్యేక కథనం


సీడ్స్ కోసం పత్తి అయినా మరొకటైనా రైతులతో ఒప్పందాలు చేసుకుని పండించడం ఒకెత్తు. కానీ, కొన్ని చోట్ల అంతా టాప్ సీక్రెట్. సీడ్స్ తేవడం, స్థానిక రైతులకు పండించాలని చెప్పడం, పంట మొత్తం కొంటామని నమ్మించడం జరుగుతుంటుంది. చివరకు దిగుబడి రాక సీడ్ ఆర్గనైజర్ అడ్రస్ లేక రైతులు రోడ్డునపడే పరిస్థితి. వారి శ్రమ అంతా వృధా. ఈ కార్న్ సీడ్స్ చుట్టూ డార్క్ సీక్రెట్స్ అన్నీ ఇన్నీ కావు. ములుగు జిల్లాలో జరుగుతున్న మిస్టరీ పంట సాగుపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం.

ములుగు, స్వేచ్ఛ: గద్వాల్, ఉమ్మడి మహబూబ్ నగర్ ఏరియాల్లో అక్కడక్కడ కాటన్ సీడ్స్(Cotton Seeds) కోసం పంట పండిస్తుంటారు. కానీ, ములుగు(Mulugu) జిల్లాలో మాత్రం మొక్కజొన్న సీడ్స్(Corn Seeds) కోసం ప్రయోగాలు చేస్తున్నారా? లేక జన్యుమార్పిడి(GM) మొక్కజొన్న పంటా అన్నది చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లోని గిరిజన (కోయ) రైతులను ఆసరా చేసుకుని ఊరు, పేరు లేని ఇంటర్నేషనల్ విత్తన కంపెనీ(Multi National Companies)ల దందా గత 10 ఏళ్లుగా కొనసాగుతున్నది. సదరు విత్తన కంపెనీలను నమ్మి నిరక్షరాశ్యులైన గిరిజన రైతులు(Farmers) తరచూ మోసపోతున్నారు. చట్ట విరుద్ధమైన ఇంటర్నేషనల్ విత్తన కంపెనీలు అమాయకులైన గిరిజన రైతులను మండలానికో ఆర్గనైజర్‌ను నియమించుకొని దందాను సాగిస్తున్నారు. అలా ఈసారి కూడా చాలామంది నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే ఇవి మొక్కజొన్న సీడ్స్ కోసం ప్రయోగాలా? జన్యుమార్పిడి పంటా అన్నది హాట్ టాపిక్ అయింది. జన్యుమార్పిడి ఆహార పంటలు పండించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే జీన్ మోడిఫైడ్ సీడ్స్‌(Genetically Modified seeds)తో బయో డైవర్సిటీ(Bio diversity)కి ముప్పు ఉంటుంది. మనం తినే ఫుడ్స్‌లో జన్యువులు మారిపోయి అది ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అంచనా వేయడం కష్టం. అందుకే వీటి అనుమతుల(Permissions) విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.


అంతా మిస్టరీ

ములుగు ఏరియాలో పండిస్తున్న మొక్కజొన్న క్రాప్ జెనెటికల్లీ మోడిఫైడా కాదా అన్నది ఒకటి. సీడ్స్ కోసమే పండిస్తున్నారా అన్నది ఇంకొకకటి. ఒకవేళ సీడ్స్ కోసమే పండిస్తే అనుమతులు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఎక్కడ? ఒకవేళ జన్యుమార్పిడి విత్తనాలను నేరుగా తీసుకొచ్చి సాగు చేయిస్తుంటే ఆ అనుమతులు ఏవి? అన్నది కీలకంగా మారాయి. ములుగు ఏరియాలో సాగవుతున్న మొక్క జొన్న క్రాప్ చుట్టూ సవాలక్ష డౌట్లు పెరుగుతున్నాయి. రైతులు చెబుతున్నదాని ప్రకారం ఈ సీడ్స్ అన్నీ విదేశాల నుంచే వస్తున్నాయంటున్నారు. అదే జరిగితే క్వారంటైన్ ఎటు వెళ్లింది, చెకింగ్స్ ఏం చేశారు? ఇక్కడిదాకా ఎలా వచ్చాయి అన్నది కీలకంగా మారుతున్నాయి. అడ్రస్ లేకుండా వెళ్లిన సీడ్ ఆర్గనైజర్స్‌ను పట్టుకుంటేనే అసలు నిజాలు తెలుస్తాయంటున్నారు. నిజానికి బీటీ కాటన్ చాలా మందికి తెలుసు. గతంలో పత్తి దిగుబడులు రాక చీడపీడల కారణంగా రైతులు చాలా నష్టపోయే వారు. కానీ బీటీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో పత్తి దిగుబడులు పెరిగాయి. చీడపీడల బాధలు తప్పాయి. బీటీ అంటే బాసిల్లస్ థురెంజియెన్సిస్. ఇందులో సీఆర్‌వై 1 ఏసీ అనే జన్యువు కీలకంగా ఉంటుంది. ఇది పత్తిని ఆశించే పురుగు పత్తి ఆకును తినగానే చనిపోయేలా చేస్తుంది. విషపూరితం అన్న మాట. ఇది వాణిజ్య పంట అయిన పత్తికి వర్కవుట్ అయింది. అదే ఆహార పంటల్లో ఇలా జన్యుమార్పిడి చేస్తే అది తినే జనాలు, పశు పక్ష్యాదులపై ఎలాంటి డేంజర్ ఎఫెక్ట్ చూపుతుందన్నది క్వశ్చన్ మార్క్. అందుకే వీటి అనుమతులు అంత సులువుగా రావు. కానీ మొక్కజొన్నపై చాలానే కుట్రలు జరుగుతున్నాయనడానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే.

ఏజెంట్ల ఉచ్చులో రైతులు

గతేడాది తమిళనాడులో కూడా ఈ జన్యుమార్పిడి మొక్కజొన్న క్రాప్ చుట్టూ పెద్ద రగడే నడిచింది. 2021 మార్చిలో ఎఫ్ఎస్ఎస్ఏఐ(Fssai) మొక్కజొన్న సహా 24 ఆహార పంటలను దిగుమతి చేసుకోవడానికి జీఎం – ఫ్రీ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. ఒక పంట జన్యుమార్పిడా కాదా అన్నది పాలిమరేజ్ చైన్ రియాక్షన్ పద్ధతిలో తెలుస్తుంది. ఇటీవలే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ సైంటిస్టులు సమర్పించిన జర్నల్‌లో భారత్‌లో మొక్కజొన్న ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్‌లో జన్యుమార్పిడి చేసిన ఆనవాళ్లను గుర్తించారు. జీఎం పాజిటివ్ వచ్చింది. ఇది ఆందోళనపరిచే విషయం. ఇదే సీన్ ములుగు జిల్లా ఏజెన్సీలో రిపీట్ అయిందా అన్నది శాంపిల్స్ టెస్ట్ చేస్తేనే బయటకు వస్తుందంటున్నారు. జిల్లాలో బీటీ మొక్కజొన్న సాగు చేస్తున్నామన్న విషయం అక్కడి గిరిజన రైతులకు కూడా తెలియదు. కొన్ని విత్తన కంపెనీల పేర్లతో కొంతమంది ఆర్గనైజర్లు, ఏజెంట్లు వేసిన ఉచ్చులో పడ్డారు అక్కడి అమాయక రైతులు. మొక్కజొన్న విత్తనాలను సాగు చేస్తే ఎకరాకు 4 టన్నుల పంట దిగుబడి వస్తుందని, భారీగా ఆదాయం వస్తుందని ఆశ చూపించడంతో దాదాపు 5 నుంచి 6 వేల ఎకరాల్లో విత్తనాల కోసమే మొక్కజొన్న సాగు చేశారు. కానీ పంట కోసే సమయానికి చూస్తే, కనీసం ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాదు, ఇక్కడ బీటీ సాగు చేస్తున్నారేమో అన్న అనుమానాలను బలపరచడానికి మరికొన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి.

బీటీ విత్తనాల సాగు జరుగుతున్నదా?

విత్తన కంపెనీల(Seed Company)కు చెందిన ఆర్గనైజర్లు(Organigers), ఏజెంట్లు(Agents) రైతులతో మాట్లాడి ఇదిగో విత్తనాలను నాటించారు. కానీ అధికారికంగా ఎలాంటి అగ్రిమెంట్లు(Agriments) చేసుకోలేదు. రాతపూర్వకంగా ఏ కంపెనీ విత్తనాలను ఇస్తున్నారు, ఎలా సాగు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతకు పంటను కొంటారన్నది లేదు. పైగా రైతులకు విత్తనాలను సరఫరా చేసిన ప్యాకెట్లపై ఏ కంపెనీ పేరు గానీ, సింబల్‌ గానీ లేదు. కేవలం కొన్ని కోడ్‌ నెంబర్లు వేసిన తెల్ల సంచుల్లో విత్తనాలను ప్యాక్ చేసి ఇచ్చారు. ఏజెంట్ల మాటలు నమ్మి సాగు మొదలుపెట్టేశారు. కంపెనీ పేర్లను చెప్పి, పొలాల్లో బోర్డులు కూడా పెట్టలేదు. గిరిజన ప్రాంతాల్లో అదీ చదువు అసలే రాని రైతుల పొలాల్లోనే ఎందుకు వీటిని సాగు చేస్తున్నారు. దిగుబడి రాలేదని తెలిశాక విత్తనాలు సరఫరా చేసిన ఏజెంట్లు, ఆర్గనైజర్లు ఎందుకు పరారయ్యారని పెద్ద డౌట్. ఇక్కడ బీటీ మొక్కజొన్న సాగు జరుగుతోందనడానికి మరికొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. సాధారణంగా సాగు చేస్తున్న మొక్క జొన్నను రైతులు కానీ, వాళ్ల ఇంట్లో వాళ్లు గానీ కోసుకుని తింటుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్క కంకి కూడా ఎవరూ కోసుకోరు. కారణం అవి తింటే పక్షవాతం వస్తుందని, అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయని స్థానికులే అంటున్నారు.

రైతుల ఆందోళనతో విషయం వెలుగులోకి

ఈసారి మొక్కజొన్న పొత్తుకు గింజలు రాకపోవడంతో ఏజెంట్లు పంట కొనలేదు. నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతుల ఆందోళన చేయడంతో మ్యాటర్ అంతా బయటకు వచ్చింది. సంప్రదాయ విత్తనాల తయారీ రైతుల చేతి నుంచి ఎప్పుడో ఎంఎన్సీల చేతిలోకి వెళ్లిపోయింది. గతంలో రైతులు విత్తును దాచుకునే వారు. కానీ ఇప్పుడు కంపెనీలు అమ్మినవే కొనే పరిస్థితి వచ్చింది. అయితే, చాలా కంపెనీలు డైరెక్ట్‌గా రంగంలోకి దిగకుండా దొంగచాటుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. జీవ వైవిధ్యాన్ని ప్రభావితం చేసేలా ఏ ప్రయోగం చేసినా సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలని బయోలాజికల్ డైవర్సిటీ చట్టం 2002 చెబుతున్నది. అంతే కాదు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలో జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రూవల్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ అప్రూవల్స్ కూడా అవసరమే. ఇవేవీ తీసుకోకుండా చేస్తే బయో పైరసీ కిందికే వస్తుంది. నిజానికి విత్తనోత్పత్తి కోసమే సాగు చేస్తున్నప్పుడు తక్కువ దిగుబడి వస్తుంది. ఇందులో పాలినేషన్ అంటే సరైన కీటకాలు లేకపోవడంతో పరాగ సంపర్కం సరిగా జరగకపోవడం, మోతాదుకు మించి పెస్టిసైడ్స్ వాడడంతో దిగుబడి రాకపోవడం వంటివి జరిగి ఉండవచ్చని వ్యవసాయ నిపుణులు అంటున్న మాట.

దీని వెనుక ఉన్నదెవరు?

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సీడ్ ఆర్గనైజర్ ఎవరు? ఏ కంపెనీ కోసం పని చేస్తున్నారన్నది తేలాలంటున్నారు. ఇల్లీగల్ జీఎం అయితే పర్యావరణానికి ప్రమాదమని గుర్తు చేస్తున్నారు. ఇది విత్తన చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా విత్తనాల కోసమే పంటలు సాగు చేయిస్తుంటే రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు రైతులకు పక్కాగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి రిజిస్ట్రేషన్ లేకుండా, కాంట్రాక్ట్ లేకుండా ఆర్గనైజర్స్ రంగంలోకి దిగుతుంటారు. అటు విత్తన కంపెనీలు కూడా డైరెక్ట్ గా రైతులతో డీల్ చేయవు. మధ్యవర్తులను రంగంలోకి దింపుతాయి. బయోడైవర్సిటీ చట్టం ప్రకారం ఉల్లంఘనలు రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా ఉంటుంది.

Just In

01

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?