seed
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Seed Scam: ల్యాబ్ టు ల్యాండ్ కల్టివేషన్- ఏజెన్సీ మొక్కజొన్న సాగులో సంచలనం

రైతులకు కాదు.. ఆర్గనైజర్లకే గిట్టుబాటు
రైతుల నుంచి మౌఖిక బాండింగ్
ఆర్గనైజర్ల కబంధ హస్తాల్లో ఆదివాసి రైతులు
బహుళజాతి మొక్కజొన్నతో రైతులకు నష్టమే..
వారిచ్చిన పెట్టుబడి కంటే తక్కువ దిగుబడి
మిగిలిన పైసలకు ప్రామిసరీ నోటు
పైసలిస్తావా.. సాగు చేస్తావా అని బెదిరింపులు
విచారణను వేగవంతం చేయాలన్న రైతులు


మహబూబాబాద్, స్వేచ్ఛ : విదేశీ కంపెనీల మొక్కజొన్న విత్తనాలతో ఆర్గనైజర్లు ల్యాబ్ టు ల్యాండ్ కల్టివేషన్ చేయిస్తున్నారు. విదేశీ కంపెనీలైన సిన్జెంటా, మాన్జెంట, హైటెక్, సీపీ కంపెనీల ఆర్గనైజర్లు యాజమాన్యాల ప్రోత్సాహంతో ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలతో పాటు ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వరంగల్ జిల్లా గూడెప్పాడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల మండలం‌తో పాటు మరికొన్ని మండలాల్లో ఆదివాసి, ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులతో బహుళ జాతి మొక్కజొన్న విత్తనాలను సాగు చేయిస్తున్నారు. గత పదేళ్లుగా ఇలాంటి సేద్యం చేస్తున్నప్పటికీ, నాలుగేళ్లుగా ఆర్గనైజర్లు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ మంది రైతులతో మొక్కజొన్న పంట సాగు చేయించేందుకు నడుం బిగించారు.

రైతులకు నష్టమే..
బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీ‌ల ఆర్గనైజర్లు తమ యాజమాన్యాల ప్రోత్సాహంతో ఆదివాసి రైతులతో మొక్కజొన్నను సేద్యం చేయిస్తున్నారు. వరి ద్వారా సరైన లాభాలు లేకపోవడంతో రైతులు కూడా ఆర్గనైజర్లు చెప్పే మాటలకు ఆకర్షితులై సేద్యం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే అదునుగా భావించిన ఆర్గనైజర్లు అటు యాజమాన్యాలతో ఓ అగ్రిమెంట్… రైతులతో మరో అగ్రిమెంట్ చేసుకొని రైతుల ఆర్థిక వ్యవస్థ పై దెబ్బ కొడుతున్నారని ఆదివాసి నవనిర్మాణ సేన నాయకులు ఆరోపిస్తున్నారు. బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల బాండ్ అగ్రిమెంట్‌తో వ్యవసాయం చేస్తే ఒక్కో ఎకరానికి రూ.లక్షా 20 వేలు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు సేద్యం చేసే పంట దిగుబడి యావరేజ్‌గా వచ్చినప్పటికీ ఒక టన్నుకు రూ.28 వేలు కంపెనీ ఆర్గనైజర్లు ధర అందిస్తున్నారని చెబుతున్నారు. ఎకరానికి నాలుగు టన్నుల చొప్పున పంట దిగుబడి వస్తే, అప్పటికే మరో ఎనిమిది వేల నష్టం వాటిల్లుతుందని రైతులు వివరిస్తున్నారు. కంపెనీ సూచనల ప్రకారం రైతులు 100% దిగుబడి వచ్చేలా పంట సేద్యం చేస్తే అప్పటికీ రైతులు నష్టపోయే పంటలే పండిస్తున్నట్లు ఆదివాసి కుల సంఘాల నాయకులు వివరిస్తున్నారు.


కార్పొరేట్ కబంధ హస్తాల్లో రైతులు
బహుళ జాతి మొక్కజొన్న కంపెనీ యాజమాన్యం ఆదేశాలతో ఆర్గనైజర్లు రైతుల నుంచి బాండ్ పేపర్ కాకుండా మౌఖిక బాండ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. రైతులు అప్పుగా తేలితే వాటికి ప్రామిసరీ నోటు ద్వారా అప్పు ఉన్నట్టు రాసుకుంటున్నారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటకు సరైన దిగుబడి రాకపోవడంతో వారికి ప్రతి ఏడు నష్టం వాటిల్లుతున్నది. కంపెనీ యాజమాన్యం నుంచి ఒక్కో రైతు లక్షా20 వేలు తీసుకొని పంట సేద్యం చేస్తే పంట చేతికి వచ్చాక వారికి 8వేలు అప్పు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. మౌఖికంగా బాండ్ అగ్రిమెంట్ చేసుకున్న రైతులు ఆర్గనైజర్‌లను తమ పంట దిగుబడి ఆదాయం తగ్గుతుందని అడిగే పరిస్థితి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్జాగా ప్రామిసరీ నోటు మీద అప్పు ఉన్నట్టు రైతుల నుంచి రాయించుకున్న ఆర్గనైజర్లు ఇంటి ముందుకొచ్చి డబ్బులు ఇస్తారా? లేదంటే వచ్చే ఏడాది పంట చేస్తారా? అంటూ రైతులను ఒత్తిడికి గురిచేసి వారి కబంధ హస్తాల్లో బందీలు చేసుకుంటున్నారని ఆదివాసి నవనిర్మాణ సేన నాయకులు వెల్లడిస్తున్నారు.

మాయమాటలు చెప్పి సాగు చేయించారు
బాండ్ వ్యవసాయం అని, ఎక్కువ దిగుబడి వస్తుందని మాకు మాయ మాటలు చెప్పారు. తీరా సాగు చేశాక దిగుబడి రాలేదు. ఆర్గనైజర్లను అడిగితే మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. పైగా మీకు మీడియా వాళ్లు ఇస్తారు వాళ్లనే అడుక్కోండి. అప్పులు కట్టండి.. అప్పుడు మీరు రోడ్డెక్కి ధర్నాలు చేసుకోండి అని బెదిరిస్తున్నారు. సింజెంట, మాన్సెంట, సీపీ, హై టెక్ కంపెనీలు మమ్మల్ని నిలువున ముంచారు. ప్రభుత్వం ఆర్గనైజర్ల పై క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేయాలి.    – పాయం రాంబాబు, యోగితనగర్, రైతు

న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారు
బాండ్ మొక్కజొన్న వ్యవసాయం చేసి నష్టపోయాం. ధర్నాలు చేస్తుంటే ఆర్గనైజర్లు.. అధికారులను, రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని మాకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ను కలిసి సమస్య చెప్పుకున్నాం. విచారణ పేరుతో కాలయాపన జరుగుతున్నది. ఆదివాసీలకు వ్యవసాయం చేయడం రాదని, తడులు సరిగా పెట్టక పంటలు ఎండిపోయాయని.. నేలలు సరిగా లేక దిగుబడులు తగ్గాయని అంటూ ఆర్గనైజర్లు అబద్ధాలు చెబుతున్నారు. క్రాసింగ్ కరెక్ట్‌గా చేయక పోవడం వల్ల పంట నష్టం జరిగిందని ఆర్గనైజర్లు.. కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికారులు కూడా ఆర్గనైజర్లు చెప్పిన అబద్ధాలనే నమ్ముతున్నారు. కలెక్టర్ దృష్టి సారిస్తే మాకు న్యాయం జరుగుతుంది. రైతులను బెదిరిస్తున్న ఆర్గనైజర్ల పై కేసులు పెట్టాలి.
 – నాగుల ప్రవీణ్, చిరుతపల్లి, రైతు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు