– గుట్టంతా బయటపెట్టిన ప్రణీత్ రావు
– ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్
– లీడర్లు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్, వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్
– సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీఎస్పీ, ఎస్పీలకు చేరవేత
– ప్రభుత్వం మారగానే పై అధికారుల ఆదేశాల మేరకు డేటా ధ్వంసం
– ప్రణీత్ రావు కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్
– నాటి ఎస్ఐబీ ఎస్పీ, డీఎస్పీల విచారణకు సిద్ధం
– మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దాకా వెళ్తారా?
Praneeth Rao Phone Tapping case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రణీత్ రావు అరెస్ట్‌తో అసలు గుట్టంతా బయటకు వస్తోంది. పోలీసులకు ప్రణీత్ కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని అంగీకరించినట్టు సమాచారం. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకే ఇచ్చానని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ప్రణీత్ రావు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
తనపై ఉన్న ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబీ చీఫ్‌కి సమాచారం ఇచ్చానని, కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు అంగీకరించాడు. చాలామంది అధికారులు, లీడర్లు, వాట్సాప్‌లపై నిఘా పెట్టినట్టు పోలీసులకు ప్రణీత్ చెప్పినట్టుగా సమాచారం. అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకు సమాచారాన్ని ధ్వంసం చేశానని, సెల్ ఫోన్లు, హార్డ్ డిస్కులు, వేల సంఖ్యలో పత్రాలను ధ్వంసం చేసినట్టుగా చెప్పాడు.
ప్రణీత్ రావును మరోసారి విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారం రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్‌తో పాటు ఎస్పీ, డీఎస్పీలను విచారించేందుకు రంగం సిద్ధమౌతోంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ప్రణీత్ అన్నీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ పాలనలో ప్రభాకర్ రావు రిటైర్ అయినా కూడా పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాజీనామా చేశారు. ఈయన ఆదేశాలతోనే ప్రణీత్ ఇంతకు తెగించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు కావడంతో దర్యాప్తుపై ఉత్కంఠ నెలకొంది. ప్రభాకర్ రావు దాకా అధికారులు వెళ్తారా? ఒకవేళ వెళ్తే, నెక్స్ట్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, ప్రణీత్ ప్రమోషన్‌పైనా వివాదం కొనసాగుతోంది. లాబీయింగ్ చేసి డీఎస్పీగా ప్రమోట్ అయ్యాడని ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. కేసీఆర్ ప్రభుత్వంలో దొడ్డిదారిన యాక్సిలరేటెడ్ ప్రమోషన్ పొందిన నలుగురు అధికారుల్లో ప్రనీత్ ఉన్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి మావోయిస్టులకు చెందిన ఆపరేషన్స్‌లో పాల్గొన్న వారికే యాక్సిలరేటెడ్ ప్రమోషన్లు ఇస్తుంటారు. కానీ, ప్రణీత్ రావు అలాంటి ఆపరేషన్స్‌లో పాల్గొనకపోయినా డీఎస్పీగా ప్రమోట్ అయ్యాడు. దీనిపై విచారణ జరపాల్సిందిగా గంగాధర్ అనే పోలీస్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపైనా పోలీసులు దృష్టి సారించారు.