Political cine celebrities tribute to Ramoji rao death:
మీడియా మెఘల్, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు తుదిశ్వాస విడిచారు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు, బుల్లితెర వినోదం ఏదైనా సరే తెలుగు మీడియా రంగంపై చెరగని ముద్రవేశారు ఆయన . 88 ఏళ్ల వయస్సులో గుండెసంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతికి రాజకీయ సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
మీడియాలో సరికొత్త ప్రమాణాలు : ప్రధాని మోదీ
రామోజీ రావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రామోజీ రావు కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. ‘‘రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. పాత్రికేయ, సినీ రంగంపై చెరగని ముద్రవేశారు. మీడియాలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు’’ అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.
తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత కల్పించిన ఘనత: సీఎం రేవంత్ రెడ్డి
ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశించారు.
క్రమశిక్షణ, సమయపాలన, నిబద్దతకు నిర్వచనం: వెంకయ్య నాయుడు
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అస్తమయంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అని.. అడుగుపెట్టిన అన్ని రంగాల్లో సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
సామాన్య కుటుంబంలో పుట్టిన అసామాన్యుడు: చంద్రబాబు నాయుడు
రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల ఆస్తి అని.. ఆయన మరణం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అన్నారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని పేర్కొన్నారు.
మేరు పర్వతం దివికేగింది: చిరంజీవి
రామోజీరావు మృతిపై సినీనటులు చిరంజీవి సంతాపం తెలిపారు.‘‘ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికెగిసింది’’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడారు: పవన్ కళ్యాణ్
రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆకస్మిక మృతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన రామోజీ మృతి తెలుగు సమాజానికి తీరని లోటుగా అభివర్ణించారు. “అక్షర యోధుడు రామోజీరావు తుది శ్వాస విడిచారని తెలిసి చాలా బాధ కలుగుతోంది.ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనం. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ జనచైతన్యాన్ని కలిగించారు. వర్తమాన రాజకీయాలు, పాలన తీరుతెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించడమే కాదు.. ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేయడం రామోజీరావు దక్షతకు నిదర్శనం. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. పత్రికాధిపతిగా కాకుండా సినీ నిర్మాతగా, స్డూడియో నిర్వాహకులుగా వ్యపారవేత్తగా బహుముఖంగా విజయాలు సాధించారు. రామోజీ ఫిల్మిసిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను వేదికగా చేశారు. మీడియా మొఘల్‌గా రామోజీరావు అలుపెరగని పోరాటం చేశారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్లడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. అక్షర యోధుడు రామోజీరావు అస్తమయం తెలుగు ప్రజలందరికీ కలచి వేస్తోంది. ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలి