రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో నో మీల్స్
గిరిజన బిడ్డలకు అందని పౌష్టికాహారం
చందంపేట మండలం చుంచు తండాలో
ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల దీనగాథ
నల్లగొండ బ్యూరో, స్వేచ్ఛ: అది చందంపేట మండలం గన్నెర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చుంచు తండా. ఇక్కడ దాదాపు 50కి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ మొత్తం తండాకు ఒకేఒక్క స్కూల్ అది కూడా ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల. ఉన్నదీ ఒక్కటే తరగతి గది. ఇందులోనే అంగన్వాడీ సెంటర్ సైతం కొనసాగుతోంది. కొన్నిసార్లు గర్బిణీ కోసం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంగానూ ఈ తరగతి గదే ఉపయోగపడుతుంది. ఉన్న ఒక్క గదిలో ఓవైపు స్కూల్ పిల్లలు.. మరోవైపు అంగన్వాడీ పిల్లలు.. ఇక్కడి స్కూల్ మొత్తానికి ఒక్కడే టీచర్. ఆయన వస్తే.. స్కూల్ ఉన్నట్టు.. లేకుంటే బడికి సెలవులే.. ఇక్కడి అంగన్వాడీ కేంద్రంలోనూ ఒక్కరే టీచర్. ఈ కేంద్రానికి టీచరూ.. ఆయా మొత్తం ఆమె. ఈ చుంచుకాలనీ తండాలో 5వ తరగతి లోపు చదివే పిల్లలు దాదాపు 20 మందికి పైగానే ఉన్నారు. కానీ స్కూల్‌కి వచ్చేది మాత్రం ఒకటి తరగతికి చెందిన 11 మంది పిల్లలే. అదీ సారూ వస్తేనే.. లేకుంటే తల్లిదండ్రుల వెంట పనిలోకి వెళ్లాల్సిందే. ఇదే సమయంలో అంగన్వాడీ కేంద్రంలోనూ ఐదుగురు పిల్లలు మాత్రమే ఉండడం గమనార్హం. అయితే తండా పిల్లలు లేరని కాదండోయ్.. స్థానికంగా పనులు దొరక్క తల్లిదండ్రుల వెంట వలసవెళ్లడంతో ఇక్కడి అంగన్వాడీలోని పౌష్టికాహారం వారికి అందని ద్రాక్షగానే మారింది. ఇదిలావుంటే.. ఈనెల 22న(శనివారం) ‘స్వేచ్ఛ’ టీమ్ చుంచుతండాను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గ్రామంలోని ప్రభుత్వ గిరిజన పాఠశాలను విజిట్ చేయగా, అక్కడ ఉండాల్సిన ఏకోపాధ్యాయుడు సైతం చెప్పాపెట్టకుండా రాకపోవడంతో పిల్లలంతా మధ్యాహ్నాం వరకు తమ ఉపాధ్యాయుడి రాక కోసం ఎదురుచూపులు తప్పలేదు. పక్కనే ఉన్న అంగన్వాడీ టీచర్‌ను ఏకోపాధ్యాయుడు స్కూల్‌కు రాకపోవడంపై ఆరా తీస్తే.. మాకు చెప్పలేదని సమాధానం చెప్పారు. కనీసం సదరు ఉపాధ్యాయుడు అదే పాఠశాల తరగతి గదిలో నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్‌కు ఫోన్ నంబరు ఇయ్యకపోవడం గమనార్హం.
రెండేండ్లుగా బువ్వ పెట్టల్లే..
చుంచు తండాలోని దాదాపు 50 కుటుంబాలు పూర్తిగా నిరుపేద కుటుంబాలే. అందరి పరిస్థితి రెక్కాడితేగానీ డొక్కాడదు. పొద్దున లేచింది మొదలు పనికి వెళితేనే.. నోట్లోకి మూడు పుటల బువ్వ వెళుతుంది. అలా అని ఇక్కడ దొరికే పనులు వ్యవసాయ కూలీ పనులే. అవి అరకొరగా దొరికేవే. మూడు నెలలు పని దొరికితే.. మరో ఆర్నేళ్లు పస్తులు పండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలకైనా బువ్వ దొరుకుతుందని బడికి పంపుదామంటే.. ఇక్కడి ప్రభుత్వ బడిలో మధ్యాహ్నా భోజనానికి స్వస్తి చెప్పేశారు. అయితే ఈ ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలకు ఒక టీచర్‌తో పాటు ఆయాను కేటాయించారు. కారణమేంటో తెలియదు గానీ రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు మాత్రం భోజనం పెట్టడం లేదు. కనీసం ఈ స్కూల్‌లో బడి గంట.. తాగునీటి వసతి లేకపోవడం కొసమెరుపు. ప్రహారీ లేకపోవడానికి తోడు నిత్యం విషపురుగుల భయం వెంటాడుతోంది. దీంతో ఇక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడం మానేశారు. తమ వెంట కూలీ పనులకు తీసుకెళ్లడంతో పిల్లలకు మధ్యాహ్నా భోజనం పెట్టాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ఓపక్క ఐదురుగురు అంగన్వాడీ పిల్లలకు భోజనం పెడుతున్నా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రం భోజనం పెట్టకపోవడం గమనార్హం.
బువ్వ కోసమే హాస్టల్స్‌కు..
గన్నెర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చుంచుకాలనీ తండాలో మొత్తం 30 మంది విద్యార్థులు ఉంటారు. అయితే ఇక్కడ సరైన ఉపాధి లేక తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటారు. ఈ క్రమంలోనే పిల్లల పోషణ వారికి భారంగా మారుతోంది. దీంతో మూడో తరగతికి రాగానే పిల్లలను ప్రభుత్వ హాస్టల్స్‌లో చేర్పించి చదివిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా మూడు పూటలా పిల్లలకు తిండి దొరుకుతుండడమే. నిండా పదేండ్లు పూర్తికాని పిల్లలను సైతం గ్రామానికి 60 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో హాస్టల్స్‌లో చేర్పిస్తుండడం గమనార్హం. మునగనూరు, దేవరకొండ, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోని గురుకులాల్లో ఇక్కడి పిల్లలు ఆడపాదడపా చదువుతున్నారు. ఈ తండాకు చెందిన పిల్లలు పదో తరగతి దాటింది లేదంటే అతిశయోక్తి కాదు.
వలసలే వీరికి ప్రధాన ఉపాధి..
చుంచు తండాలో నేటికీ అభివృద్ది అందని ద్రాక్షగానే ఉంది. ఇక్కడ ప్రభుత్వం కట్టించిన ఇండ్లు, అక్కడక్కడా సీసీ రోడ్లు మినహా మరే సౌకర్యాలు కన్పించవు. కనీసం మురుగు కాల్వలు సైతం లేవు. అక్కడే మురుగునీరు, పెంట దిబ్బలు.. అపరిశుభ్ర వాతావరణంలో తండా మురికి కూపంలా కన్పిస్తోంది. ఇక్కడి ఏ ఇంటికీ ప్రహారీ ఉండదు. వీరి జీవనశైలి నేటికీ మారలేదు. దీంతో ఇక్కడ కొద్దిరోజుల పాటు దొరికే వ్యవసాయ కూలీ పనులు మినహా మరే ఉపాధి ఇక్కడ ఉండదు. దీనికితోడు అధికార యంత్రాంగం సైతం వీరిని వెలివేసిన తరహాలో చూస్తారే తప్ప వీళ్ల బతుకులు మార్చే ఏ ఒక్క ప్రయత్నమూ కన్పించదు. తండా మొత్తంలో ఒక్కరంటే.. ఒక్కరికీ స్వయం ఉపాధి అన్న మాటే విన్పించదు. ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ బియ్యం, పెన్షన్ పైసలు మినహా గత ప్రభుత్వం ఆదుకున్న పరిస్థితి లేదు. దీంతో ఈ తండా నుంచి కుటుంబాలకు కుటుంబాలు గుంటూరు, హైదరాబాద్ ప్రాంతాలకు అధికంగా వలస వెళుతుంటారు. ఈ క్రమంలోనే తమ పిల్లలను వెంట తీసుకెళుతుండడంతో పిల్లలు సైతం కూలీలుగానే తయారవుతున్నారు. మరీ ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చుంచు తండాలో గిరిజనుల బతుకు చిత్రం మార్చాల్సిన అవసరం ఉంది.