- నిధుల లేమి.. నిలకడ లేని నిర్ణయాలు
- బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఐటీడీఏలు
- కాంగ్రెస్ హయాంలోనూ అదే పరిస్థితి
- సరిగ్గా పనిచేయని 29 శాఖలు.. ఆదివాసీలకు తీవ్ర అన్యాయం
- అధికారులు లేక పనులన్నీ పెండింగ్
- తాత్కాలిక బాధ్యతలు కొందరికి అప్పగించినా నో యూజ్
ITDA: గిరిజనుల బతుకు బండిని సరైన మార్గంలో నడిపించేందుకు ఏర్పాటు చేసినవే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఐటీడీఏ)లు. వీటి ఏర్పాటు చారిత్రక ఘట్టం. కానీ, ప్రత్యేక రాష్ట్రంలో వీటి నిర్వహణపై నిర్లక్ష్యం ఆవరించింది. కనీసం జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఐటీడీఏల్లో ఏర్పడింది. చివరకు ఏ లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారో మర్చిపోయే దుస్థితికి ఇవి వచ్చాయి. నిధుల లేమి, నిలకడ లేని నిర్ణయాలతో బీఆర్ఎస్ (BRS) హయాంలో ఐటీడీఏల పరిస్థితి దారుణంగా తయారైంది.
29 శాఖలు నిర్విరామంగా పనిచేస్తున్నాయా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో దాదాపు ఉన్న ఐటీడీఏల్లో మొత్తం 29 శాఖల్లో అధికారులు పనిచేసేవారు. ఆదివాసీ ప్రజలు, రైతుల సంక్షేమం కోసం వీరు కృషి చేసేవారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత రోజురోజుకు ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయంలతో పాటు ఉద్యోగ కల్పన సైతం కుంటుబడింది. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ పాపం అనే విమర్శలు ఉన్నాయి. ఆదివాసీల భద్రత, ఉపాధి, ఉద్యోగాలు, మౌలిక వసతుల కల్పనలో ఐటీడీఏ పీఓపీకి అధికారాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీటి ప్రాధాన్యత లోపించింది. 29 శాఖలు సరైన రీతిలో పనిచేయకపోవడంతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయా సంఘాలు అంటున్నాయి.
Read Also- Police Complaint: ‘పోలీస్ కంప్లెయింట్’.. రాకింగ్ లుక్‌లో వరలక్ష్మి శరత్ కుమార్..
44 మందికి 18 మందే..
ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏని పరిశీలిస్తే, అక్కడ అధికారులు, ఉద్యోగులు మొత్తం 44 మందికి పైగా ఉండాలి. కానీ, 18 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గిరజనాభావృద్ధి ముందుకు సాగడం లేదు. ఆర్థిక స్వావలంబన వంటి సంక్షేమ పథకాల అమలు కుంటుపడిందని గిరిజన సంఘాలు అంటున్నాయి. సీఎం గిరి వికాసను అయితే పట్టించుకే నాథుడే లేడు. కొన్ని పోస్టుల్లో కింది స్థాయి అధికారులే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నా, రోజులు గడుస్తున్నాయే గానీ పని జరగడం లేదు. ఇది గిరిజనాభావృద్ధికి గొడ్డలి పెట్టుగా మారుతున్నది. ఇప్పటికైనా పాలకులు ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మిగిలిన మూడు చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని, పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నదని, వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అంటున్నాయి.
వైద్య సేవల్లోనూ నిర్లక్ష్యం
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గిరిజన ప్రాంతాల్లో వైద్యం విషయంలో జరిగిన నిర్లక్ష్యం, మౌలిక వసతుల కల్పనలో జరిగిన అలసత్వంపై తర్వాతి కథనంలో చూద్దాం.
Read Also- Naa Anveshana: ఆ ప్రశ్న ఒక్కటి చాలు.. భయ్యా సన్నీ యాదవ్ బొక్కలన్నీ బయటపడతాయ్!