స్వల్ప మెజార్టీతో చేజారిన ఎమ్మెల్సీ ఫలితం
బలం, బలగం ఉన్నప్పటికీ దక్కని ఫలితం
పోలింగ్ కు 20 రోజుల ముందే హెచ్చరించిన ‘స్వేచ్ఛ’
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఓటమితో అన్ని విధాల విమర్శలు
కరీంనగర్, స్వేచ్ఛ: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల(Grduate MLC), ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Teacher MLC Elections) కాంగ్రెస్(Congress) ఓటమికి సమన్వయ లేమి ప్రధాన కారణమని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ సరైన ప్లానింగ్ లేకపోవడం.. వారి మధ్య కో ఆర్డినేషన్(Coordination) లేకపోవడం వల్ల పార్టీ ఓటమి పాలైందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. నేరుగా ముఖ్యమంత్రి(CM Revanth Reddy) రంగంలోకి ప్రచారం చేసినా పార్టీ ఓడిపోవడం శ్రేణులకు మింగుడు పడటం లేదు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం, బలగం ఉన్నప్పటికీ పట్టభద్రుల ఓట్లను రాబట్టడంలో పార్టీ ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మొదటి ప్రాధాన్యతలో అంజిరెడ్డికి 75,675 ఓట్లు రాగా నరేందర్ రెడ్డికి -70,565 ఓట్లు రాగా ప్రసన్న హరికృష్ణకు -60,419 హరికృష్ణ ఎలిమినేషన్లో రెండవ ప్రాధాన్యంలో అంజిరెడ్డికి- 98,637 ఓట్లు రాగా నరేందర్ రెడ్డికి- 93,531 ఓట్లు వచ్చాయి. నిర్ధారిత ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ నరేందర్ రెడ్డి కంటే అంజి రెడ్డి 5,106 ఓట్లు అధిక్యం ఉండటంతో అంజి రెడ్డిని విజేతగా ప్రకటించారు. కేవలం 5వేల ఓట్లతో ఓటమి చెందడం కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యం తీరుకు నిదర్శనంగా కనిపిస్తున్నది.
‘నో’ ప్లానింగ్
సిట్టింగ్ స్థానాన్ని(Sitting seat) నిలబెట్టుకోవడం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద పనేమీ కాదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ అభ్యర్థిని ప్రకటించే విషయంలో పార్టీ ఆలస్యం చేసింది. ఓటమికి ఇది ఒక కారణం కాగా ఎలాంటి ప్లానింగ్ లేకుండానే ఎన్నికల బరిలోకి దిగడంతో ఓటమి పాలైందని తెలుస్తున్నది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, జిల్లాలకు చెందిన మంత్రులతోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కోరవడంతోనే కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్దగా యాక్టివ్ గా పనిచేయలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి నరేందర్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయినట్టు సమాచారం.
బలం బలగం ఉన్నప్పటికీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో జగిత్యాల కలుపుకొని 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నలుగురు, బీజేపీకి నలుగురు, బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా మెదక్ జిల్లాలోని 11 మంది ఎమ్మెల్యేలకు నాలుగురు కాంగ్రెస్, ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్కు ఐదుగురు, బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే ఉండగా బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. పెద్దపల్లి ఎంపీతో పాటు స్థానిక సంస్ఠల కోటాలో ఉన్న ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీకి బలబలగం ఉన్నప్పటికీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పొవడంతో నేతల మధ్య విభేదాలను స్పష్టం చూపిస్తుంది.
ముందే హెచ్చరించిన ‘స్వేచ్ఛ’
కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలను పోలింగ్ కు 20 రోజుల ముందుగానే ‘స్వేచ్ఛ’(Swetcha) హెచ్చరించింది. నేతలు ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయం లేదని వార్తలో నిజాన్ని నిర్భయంగా రాసింది. ముందుగా హెచ్చరించినా పెడచెవిన పెట్టిన నేతలు ఎన్నికల సమయంలో నేలవిడిచి సాము చేయడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేస్తారా? లేదంటే ఇదే పద్ధతిని కొనసాగిస్తారా? అన్నది వేచి చూడాలి.