Adilabad Lok Sabha MP Election is The Focus of Major Parties
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Malkajgiri : పార్టీల గురి.. మల్కాజ్‌గిరి..!

– సిట్టింగ్ సీటుపై పట్టుకు కాంగ్రెస్ వ్యూహాలు
– బోణీ కొట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ యత్నాలు
– అభివృద్ధి నినాదంతో హస్తం ప్రచారం
– లోకల్ నినాదాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్
– మోదీ ఇమేజ్‌తో ముందుకెళుతున్న బీజేపీ
– ప్రచారంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్
– ఇప్పటికే పూర్తయిన మోదీ రోడ్ షో
– కాంగ్రెస్- బీజేపీ మధ్యే ప్రధాన పోటీ..


Malkajgiri political news(Telangana politics): దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నియోజక వర్గంగా, అనేక భాషలు, సంస్కృతుల ప్రజలు నివసించే మినీ ఇండియాగా పేరు సంపాదించుకున్న మల్కాజ్‌గిరి స్థానాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈ లోక్‌సభా స్థానం మీద పట్టుసాధించేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుండగా, ఈటల రాజేందర్‌ను బరిలో దించి బీసీ నినాదంతో ఇక్కడ పాగా వేయాలని కమలదళం ఆరాటపడుతోంది. గత ఎన్నికల్లో రాజధానిలో అన్ని సీట్లూ గెలుచుకున్న బీఆర్ఎస్ ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుని గత ఎన్నికల్లో ఓడినా, హైదరాబాద్ నగరం మీద తన పట్టు తగ్గలేదని నిరూపించుకునేందుకు గులాబీ దళం ప్రణాళికలు రచిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో భాగమైన ఈ ఎంపీ సీటు పరిధిలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పలు రక్షణ రంగ సంస్థలు, అనేక ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్థావరాలతోపాటు విద్య, పారిశ్రామిక, ఐటీ రంగాలకు చెందిన విభాగాలు, అనేక ప్రఖ్యాతి చెందిన వర్సిటీలూ ఈ నియోజక వర్గ పరిధిలో ఉన్నాయి. ఆర్థికంగా తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతమైన ఈ స్థానంలో 38 లక్షలమంది ఓటర్లున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్, తర్వాత టీడీపీ, 2019లో కాంగ్రెస్ తరపున నేటి సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందగా, ఈసారైనా బోణీ కొట్టాలని బీఆర్ఎస్, బీజేపీ తపన పడుతున్నాయి.


హస్తం అంచనాలు

కాంగ్రెస్ విషయానికొస్తే.. ఈ పార్టీ ఈ సీటును ఎట్టిపరిస్థితిలోనూ కైవశం చేసుకోవలని ప్రణాళికలు రచిస్తోంది. సీఎం రేవంత్ ఇప్పటికే ఈ స్థానం మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గట్టి పట్టున్న మాజీమంత్రి పట్నం మహేందర్రెడ్డి భార్య, వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిని బరిలో దింపి, ఎమ్మెల్యే, కార్పొరేటర్, బూత్ లెవల్‌లో ప్రచారం చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ సీటును గెలిపించే బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌కు లేకపోవటం, కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ అనే ప్రచారం జరగటం ప్రతికూలాంశాలు. అయితే, ఈ సీటులోని లక్షలాది సీమాంధ్ర టీడీపీ సానుభూతిపరులు, మాజీ టీడీపీ నేతలు మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరటం, సీఎం రేవంత్ రెడ్డికి ఆయా వర్గాల నేతలతో పరిచయాలుండటం, ఈ సీటుకు పోలింగ్ జరిగే రోజునే కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుండటంతో అక్కడ కాంగ్రెస్ ఓట్లు పెరిగే అవకాశం, మాజీ ఎమ్మెల్యే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌లో చేరటంతో పెద్ద సంఖ్యలో బీసీ ఓట్లు కాంగ్రెస్‌కు పడే అవకాశం కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చే అంశాలు. పైగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే తమ ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమనే భావన నెలకొని ఉండటం, విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు చురుగ్గా ఈ స్థానంలో ప్రచారానికి పూనుకోకపోవటం కూడా కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలుగా మారనున్నాయి.

లోకల్ నినాదంతో బీఆర్ఎస్

బీఆర్ఎస్ హవా బలంగా ఉన్న 2014, 2019 ఎన్నికల్లోనూ ఈ సీటును గులాబీ పార్టీ సాధించలేకపోయింది. అయితే, ఈసారి విపక్ష పార్టీగా దీనిని కైవసం చేసుకోవాలని గట్టిగా పనిచేస్తోంది. దీనికోసం ఉప్పల్ నియోజక వర్గపు నేత రాగిడి లక్ష్మారెడ్డిని తన అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులిద్దరూ నాన్ లోకల్ అనీ, తాను మాత్రమే లోకల్ అనే ప్రచారంతో లక్ష్మారెడ్డి సాగిపోతున్నారు. గత పదేళ్ల కాలంలో ఈ స్థానంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ తమ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన గుర్తుచేస్తున్నారు. అయితే, పాతికేళ్ల పాటు కాంగ్రెస్ నేతగా ఉన్న లక్ష్మారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీటును ఆశించి భంగపడి, బీఆర్ఎస్‌లో చేరటం, గులాబీ నేతలెవరూ ఈయనను ఓన్ చేసుకోలేకపోవటం, ప్రజాప్రతినిధిగా ఎన్నడూ గెలిచిన అనుభవం లేకపోవటం వ్యక్తిగతంగా ఈయనకు మైనస్‌ పాయింట్లు. కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటికొస్తున్న వాస్తవాలు కూడా ఈయనకు తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ రెడ్డి వర్గపు అభ్యర్థిని బరిలో దించినందున, ఆ వర్గపు ఓట్లను చీల్చటమే లక్ష్యంగా లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ బరిలో దించిందనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని సీట్లనూ గెలుచుకోవటమే గాక 9.5 లక్షల ఓట్లు సాధించటమే గాక 3.5 లక్షల మెజారిటీ రావటంతో ఈసారి ఈ సీటును గెలుచుకోగలిగితే, మళ్లీ గ్రేటర్ ఎన్నికల నాటికి పార్టీకి కొంత జోష్ వస్తుందని, పైగా సీఎం సిట్టింగ్ సీటు గెలిచామని చెప్పుకోవచ్చని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది.

బీజేపీ భారీ వ్యూహం

ఇక బీజేపీ కూడా మల్కాజ్‌గిరి సీటును సాధించేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనే మోదీ నినాదంతో ఈ ప్రాంతంలో పెద్దసంఖ్యలో ఉన్న ఉత్తరాది హిందీ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మోదీ ఇక్కడ రోడ్ షో నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించగా, రానున్న రోజుల్లో మరింతమంది సీనియర్ నేతలను ప్రచారానికి దింపనున్నారు. కాంగ్రెస్, బీజేపీలు అగ్రకులాల వారికే సీటిచ్చాయనీ, తాను బీసీ అభ్యర్థినని ఇక్కడ రాజేందర్ చేస్తున్న ప్రచారం, మాజీ బీఆర్ఎస్ నేతగా ఆయనకున్న పరిచయాలు, బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితి కారణంగా ఇక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారటం, పక్కనున్న ఏపీలో టీడీపీ-జనసేనలతో బీజేపీ పొత్తు ప్రభావం బీజేపీకి ఇక్కడ కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ సీటు పరిధిలోని 7 స్థానాలకూ కలిపి బీజేపీకి కనీసం నాలుగున్నర లక్షల ఓట్లు కూడా రాకపోవటం పెద్ద మైనస్. అయితే, జాతీయ ప్రాధాన్యతల ఆధారంగా జరిగే ఎన్నికల్లో మోదీ, రామాలయ ప్రభావం, పెద్దసంఖ్యలో ఉన్న హిందీ ఓటర్ల మద్దతుతో గెలవగలనని బీజేపీ అంచనాలు వేసుకుంటోంది.

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?