లేఖపై తేల్చేసిన కవిత
ఫలించని రాయబారాలు
తానే రాశానని స్పష్టం
ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పా
నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీలేదు
ఎవరిపైనా ద్వేషం లేదు
కేసీఆర్ చుట్టూ దయ్యాలతోనే నష్టం
లేఖ లీకుపై చర్చ జరగాల్సిందే
పార్టీలోని కోవర్టులను పక్కనబెట్టాలి
ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌లో ‘వార్’సత్వం కంటిన్యూ
అన్నకు బీఆర్ఎస్.. చెల్లికి టీబీఆర్ఎస్?
కేటీఆర్ అన్నింటా ఫెయిల్ అయిన భావనలో కవిత?
నాయకత్వ లక్షణాల్లో తనకూ సగ భాగం అంటూ హింట్స్!
ఆనాడే చెప్పిన స్వేచ్ఛ
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్:
Kavitha: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె రాసింది కాదని, ఫేక్ అంటూ పెద్దఎత్తున బీఆర్ఎస్ వర్గాలు తిప్పికొట్టాయి. కానీ, అమెరికా టూర్ ముగించుకుని నగరానికి చేరుకున్న కవిత, మీడియాతో మాట్లాడుతూ లేఖపై క్లారిటీ ఇచ్చారు. ‘నేను కేసీఆర్‌కు లేఖ రాశాను. రెండు వారాల క్రితమే రాశాను. నా అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియజేశాను. ఈ లేఖ ఎలా లీక్ అయిందో తెలియడం లేదు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలియదు’ అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసిందన్నారు. రెండు వారాల క్రితం తాను కేసీఆర్‌కు లేఖ రాశానని, గతంలో కూడా లేఖ ద్వారా అనేక సార్లు అభిప్రాయాలు పంచుకున్నానని గుర్తు చేశారు. తాను ఏదైనా లేఖ ద్వారానే చెప్తానని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని తాను ఇటీవలే చెప్పానన్నారు. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్నవే చెప్పానని వెల్లడించారు. ఇందులో తనకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ద్వేషం లేదని, అలాగే ఎవరిపైనా ప్రేమ కూడా లేదని పేర్కొన్నారు.
Read Also- Kavitha: కేసీఆర్ దేవుడే కానీ.. ఉసూరుమనిపించిన కవిత..!
లేఖ బయటకు ఎలా వచ్చింది?
తమ పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని కవిత అన్నారు. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. వారి వల్ల నష్టం జరుగుతున్నదని మండిపడ్డారు. కేసీఆర్ కూతురైన తాను రాసిన లేఖనే బయటికు వచ్చిందటే ఇతరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. తాను కేసీఆర్‌కు లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదని తెలిపారు. లేఖ బహిర్గతం కావడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబురపడుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు కేసీఆరేనని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుందని, పార్టీ కూడా మందుకెళ్తుందని తెలిపారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పది కాలాల పాటు చల్లగా ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి, వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు.
ఘన స్వాగతం
మరోవైపు, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత వస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జాగృతి సభ్యులు ఘన స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చారు. ప్లకార్డులు, కవిత ఫొటోలను చేతబట్టి వెల్‌కమ్ చెప్పారు. కవిత జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేటీఆర్‌తో విభేదాల కారణంగానే ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం ఊపందుకున్నది. అంతేకాదు, కేటీఆర్‌కు బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి), కవితకు టీబీఆర్ఎస్(తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి) అనే వాదన తెరపైకి వచ్చింది. సామాజిక తెలంగాణ లక్ష్యం అంటూ కవిత పేరుతో ఉన్న ప్లకార్డుల ఉద్దేశం ఇదేనన్న ప్రచారం జరుగుతున్నది. మరోవైపు, కవిత లేఖ ఫేక్ అంటూ బీఆర్ఎస్ వర్గాలు చెబుతూ వస్తుండగా, ఇదే విషయాన్ని ఆమె ద్వారా చెప్పించేందుకు రాయబారాలు సాగినట్టు సమాచారం. దానికి ఆమె ససేమిరా అని, మీడియా ముఖంగానే తానే రాశానని స్పష్టం చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.
Read Also- Kavitha: కవిత లేఖ తర్వాత కీలక పరిణామం.. తేల్చేసిన కేసీఆర్.. కొత్త పార్టీ పక్కా!?