వందల కోట్ల ప్రజాధనం వెచ్చించి.. రాజసం ఒలికేలా కట్టిన ప్రజాస్వామ్య సౌధమది! హైదరాబాద్ నగరానికే మరో ఐకానిక్ భవంతిగా నాటి పాలకులు చెప్పుకొన్న నిర్మాణమది! ప్రారంభించి రెండేళ్లే అవుతున్నది! అప్పుడే దాని డొల్లతనం మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నది! ఎప్పుడు ఊడిపడతాయో తెలియని పెచ్చులు.. పై నుంచి నీళ్ల లీకేజీలు.. ఎక్కడికక్కడ పగుళ్లు! ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్టు తయారైంది.. కొత్త సచివాలయం పరిస్థితి! మొన్నటికి మొన్న ఫాల్స్ సీలింగ్ ఊడిపడగా.. తాజాగా ఐదో అంతస్తులో ఎలివేషన్ నుంచి పెచ్చులు ఊడిపడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. సమస్య వెలుగులోకి వచ్చిన వెంటనే ఏర్పాటు చేసిన అంతర్గత విచారణలో నివ్వెరబోయే నిజాలు బయటపడటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో సర్కార్ ఉన్నది.
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు.. వారిని కలుసుకునేందుకు వచ్చే ప్రజలు.. ఇలా నిత్యం వేల మంది సంచరించే సెక్రటేరియట్ సుస్థిరత, భద్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల ఫాల్స్ సీలింగ్ పెచ్చులు ఊడిన ఘటనపై ఇంజినీర్లతో అంతర్గత విచారణ చేసిన సాధారణ పరిపాలన శాఖకు నివ్వెరబోయే నిజాలు తెలిశాయి. సెక్రటేరియట్ భవన నిర్మాణంలో చాలా చోట్ల నాణ్యత విషయంలో కాంప్రమైజ్ అయ్యారని, ముఖ్యంగా తొందరగా పూర్తి చేయాలనే రాజకీయ ఒత్తిడితో నిర్మాణ భద్రతను పట్టించుకోలేదని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. పిల్లర్లు, స్లాబుల్లో కొంతమేర నాణ్యత ఉన్నా, గోడలు, భవనం అందంగా కనిపించేందుకు చేసిన డిజైన్లు అత్యంత లోపాలతో ఉన్నాయని అధికారులు అంటున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాంటి మెటీరియల్‌తో డిజైన్లు తయారు చేసి, వాటిని అమర్చేందుకు నట్లు, బోల్టులను వాడారని, వర్షాకాలంలో నీటితో నాని అవి ప్రస్తుతం ఊడిపోయే దశకు వచ్చాయని అంతర్గత విచారణ బృందం తేల్చిందని విశ్వసనీయంగా తెలిసింది. చాలా చోట్ల పిల్లర్లకు సపోర్టింగ్‌గా పెట్టిన నిర్మాణాల్లో, గోడల్లో పగుళ్లు వచ్చాయిని, ప్లంబింగ్ సిస్టమ్‌ను సరిగ్గా ఏర్పాటు చేయని కారణంగా వాటర్ లీకేజీలు సైతం పెరిగాయని అధికారులు అంటున్నారు. నిర్మాణ సంస్థ అయిన షాపూజీ పల్లోంజీ ప్రతనిధులను పిలిపించిన ఉన్నతాధికారులు గుర్తించిన అన్ని లోపాల మరమత్తులను వెంటనే చేయాలని ఆదేశించారు. 2019 నుంచి 2023 మధ్య నిర్మాణం అయిన సచివాలయం, 2023 ఏప్రిల్ 30న ప్రారంభమైంది. రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఇన్ని లోపాలు బయటపడ్డాయని అధికారులు వాపోతున్నారు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థే అన్ని రిపేర్లు చేయాలని అధికారులు ఆదేశించారు.
ఎవరినీ సంతృప్తి పరచలేకపోతున్న కొత్త సచివాలయం
ఇంత పెద్ద నిర్మాణం ఎవరినీ సంతృప్తి పరచలేకపోవటం మరో ఎత్తు. శాఖలు, ఉద్యోగులు, అధికారులు, మంత్రులు, సీఎం కార్యాలయాల కూర్పు రూములవారీగా సరిగా లేదనేది మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయంగా కనిపిస్తోంది. సచివాలయం అంటేనే ఫైళ్లు అని, అవి పెట్టేందుకు ముందస్తు ప్రణాళిక ఏమీ లేకుండా చేశారని పలువురు అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఇప్పుడు తాత్కాలిక సర్దుబాటు కోసం మళ్లీ ఐరన్ బీరువాలు, వుడ్ రాక్‌లు వాడాల్సి వస్తున్నదని అంటున్నారు. పాత సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్రటరీ నుంచి పై స్థాయి అధికారులకు ఓ మాదిరి రూములు ఉండేవి. ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఏకంగా డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారులకు లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో రూములు కేటాయించారు. అవి అగ్గిపెట్టెలను తలపిస్తున్నాయి. బాత్ రూములు వాడాలంటే అందరూ పోలోమని ఏ మూలకో వెళ్లాల్సిన పరిస్థితి. లోపల సమస్యలు ఇలా ఉంటే బయట సరైన పార్కింగ్ సదుపాయం లేదు. ఉన్న పార్కింగ్ సరిపోవట్లేదు. డ్రైవర్లకు నిలువ నీడలేదు. పనుల కోసం వచ్చే విజిటర్స్ మెయిన్ గేట్ దగ్గర ఎర్రటి ఎండలో వేచిచూడాల్సి వస్తున్నది. ఈ సమస్యలను పరిష్కరించటం అంత ఈజీ కాదని అధికారులు అంటున్నారు.
దేనికీ లేని జవాబుదారీతనం
2019లో శంకుస్థాపన సమయంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణ వ్యయం 650 నుంచి 700 కోట్లుగా ప్రచారం జరిగింది. అప్పటి ప్రభుత్వం, ఆర్అండ్‌బీ మంత్రి కూడా పలుమార్లు అదే విషయాన్ని చెప్పారు. కానీ ఆ తర్వాత అంచనా వ్యయం అమాంతం పెరిగినట్లు సమాచారం. ఏకంగా మరో 600 కోట్ల రూపాయలు క్రమంగా నిర్మాణ అంచనాలు పెంచారని తెలుస్తున్నది. అంటే మొత్తం వ్యయం 1300 నుంచి 1500 కోట్లు అయి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. అయితే ఎంతగా వెతికినా ఇందుక సంబంధించిన ఫైళ్లు, ఆధారాలు ఎక్కడా కనిపించటంలేదని సమాచారం. తొలి అంచనాలకు, ఆ తర్వాత అమాంతం పెరిగిన బడ్జెట్‌కు పొంతన లేదు. పైగా కేటాయింపులకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు గానీ, మంత్రివర్గ ఆమోదం కానీ ఉన్న దాఖలాలు కనిపించటం లేదని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. సెక్రటేరియట్ కమ్యూనికేషన్ వ్యవస్థ, కంప్యూటర్లు, కేబులింగ్‌లో కూడా భారీ అవకతవకలు జరిగాయనే ప్రచారం కూడా జరుగుతున్నది. కనీస జవాబుదారీతనం లేకుండానే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని ఒక అధికారి చెప్పారు. అందుకే తదుపరి విచారణ ఎలా జరుగుతుంది? బాధ్యులుగా ప్రభుత్వం ఎవరిని చేస్తుందో ప్రస్తుతానికి తెలియదని ఆయన అంటున్నారు. తమ పరిధిలో భాగంగా ఇంజినీర్లు, ఐటీ విభాగం, కాంట్రాక్టర్ ప్రతినిధులతో విచారణ జరుగుతున్నదని, తుది నివేదికను ప్రభుత్వానికి అందించిన తర్వాత పైవారి నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు.