- చట్టానికి విరుద్ధంగా ఔటర్ బయట హల్‌చల్?
- లోపలి కూల్చివేతలపై హర్షం.. బయటి పనులకు బద్నాం
- దుండిగల్‌లో హడావుడి ప్రజల సమస్య తీర్చేందుకు కాదు
- ప్రైవేట్ బిల్డర్స్‌కు వత్తాసు పలికేందుకే?
- ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు కోసం ప్రణీత్ అంటిలాలో కూల్చివేతలు
- తర్వాత ప్రైవేట్ సెటిల్మెంట్‌లో ఓఆర్ఆర్ అవతల తలదూర్చిన హైడ్రా
- స్థానిక సిబ్బంది తీరుతో నీరుగారిపోతున్న ప్రధాన ఉద్దేశం
- ఇప్పటికే బడాబాబుల జోలికి వెళ్లడం లేదని విమర్శలు
- హైడ్రా పేరుతో డ్రామాలాడుతున్న వారికి చెక్ పెట్టేదెలా?
మేడ్చల్, స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం
HYDRAA: ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తసుకొచ్చిందో అప్పటి నుంచి ఆక్రమణదారుల వెన్నులో వణుకు మొదలైంది. చివరకు హైడ్రా అంటే హడల్ అనేలా పరిస్థితి మారింది. కానీ, అదే హడల్‌ను క్యాచ్ చేసుకుని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు జోరందుకున్నాయి. హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ తరచూ హెచ్చరిస్తున్నా, పెడచెవిన పెడుతున్నారు. అయితే, మంగళవారం మధ్యాహ్నం మల్లంపేట్ ఓఆర్ఆర్ బయట ఉండే కేవీఆర్ వ్యాలీకి హైడ్రా టీం రావడం కలకలం రేపింది. లోకల్ పోలీసుల సహాయంతో 40 మంది ఒకేసారి రంగంలోకి దిగారు. అంతకు ముందు బాచుపల్లిలోని ప్రణీత్ అంటిలా విల్లాల వాళ్లు రోడ్డుకు అడ్డంగా గొడ కట్టారని కూల్చివేశారు. దీంతో స్థానిక బాచుపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నారు. కానీ, విల్లా ఓనర్లు వెంటనే కంచె కట్టుకోగా హైడ్రా పట్టించుకున్నది లేదు. ఇప్పుడు అదే హైడ్రా టీం చట్టానికి విరుద్ధంగా ఓఆర్ఆర్ బయటకు వెళ్లి చెడ్డ పేరు మూట కట్టుకునేలా చేస్తున్నది. ఓ చిన్న మూలకు ఉండే ప్లాట్ కోసం రోడ్డు లేదని ఓపెన్ ప్లాట్‌ను క్లీన్ చేసి వెళ్లారు. నిజానికి కేవీఆర్ వ్యాలీలో అనేక పార్క్‌లు కబ్జా అయ్యాయి. తన పేరు మీద లేని భూములను సైతం అమ్మేశాడు రియల్ వ్యాపారి. దీంతోపాటు పక్కనే ఉన్న భూములను పార్క్‌గా చూపించి చేతులు దులుపుకున్నాడు. 2005లో లే అవుట్ చేసిన వాళ్లు 1978లో లే అవుట్ చేసినట్లు సృష్టించి దందాలు చేశారు. అలాంటి ఎన్నో లొసుగులు ఉన్న ఆ లే అవుట్‌లో ఎవరికీ అడ్డు లేని రోడ్డుపై హైడ్రాకు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని ఆరా తీస్తే ప్రైవేట్ సెటిల్మెంట్ అంటూ అనుమానాలు వస్తున్నాయి.
రియల్ వ్యాపారులకు వత్తాసు
నాలా కబ్జా, డ్రైనేజీ సమస్య, వరదలకు అడ్డు వేస్తే చట్టానికి విరుద్ధంగా హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వచ్చినా సంతోషిస్తారు. కానీ, ఓ ప్రైవేట్ బిల్డర్ కోసం రావడం ఏంటనే ప్రశ్న వినిపిస్తున్నది. కాయితీ బిల్డర్ రాజేందర్ రెడ్డికి, పక్కనే ఉండే మరో బిల్డర్ మధ్య చాలాకాలంగా రోడ్డు సమస్య ఉన్నది. దీనితో హైడ్రాకు సంబంధం లేకున్నా ఫిర్యాదులు చేస్తే, ఇద్దరు వెళ్లి క్లియర్‌గా చెప్పి వచ్చారు. ప్రైవేట్ భూమిలో రోడ్డు ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్లకు ప్రత్యామ్నాయంగా వేరే రోడ్డు ఉందని తెలిపారు. అయితే, హైడ్రా పేరు చెప్పి ఆ ప్లాట్ రోడ్డు కోసం 3000 స్క్వేర్ ఫీట్ అపార్ట్‌మెంట్ ఇవ్వాలని అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఇరువురు ఒప్పుకున్నారు. మంగళవారం రోజున మళ్లీ అవుట్రేట్‌గా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీనిపై సాయంత్రం 7 గంటలకు కూర్చుని మాట్లాడాలనుకున్నారు. అంతలోనే హైడ్రాతో రాజేందర్ రెడ్డి హడావుడి చేశాడు. అయితే, హైడ్రా టీం 15 నిమిషాల్లోనే అక్కడకు వచ్చి వెళ్లింది. ఆ తర్వాత రాజేందర్ రెడ్డి మరో జేసీబీ తీసుకొచ్చి హైడ్రా వాళ్లే పనులు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి చుట్టూ గోడను కూల్చివేయించాడు. అన్నీ తెలుసుకున్న స్థానికులు హైడ్రా ఇలా కూడా పనికొస్తుందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలతో హైడ్రా ముఖ్య ఉద్దేశం మసకబారే ప్రమాదం లేకపోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీసుకున్నా, ఆయన అనుచరులు హైడ్రా పేరుతో దందాలు చేస్తున్నారనే ఆరోపణలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
Read Also- Kamalapur Pedda Lake: చారిత్రాత్మక చెరువుకు కష్టం.. పట్టించుకొని అధికారులు
బడా బాబులపై చర్యలకు వెనుకంజ
ఓఆర్ఆర్ లోపల ఉన్న చాలా చెరువుల్లో బడా బాబులు ఇంకా యాక్టివిటీ కొనసాగిస్తున్నారు. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టర్ సంస్థ అయిన ఐకాం ఆయుధాల తయారీ కంపెనీ కూడా చెరువులోనే నాలాకు అడ్డంగా ఉన్నది. దానిపై చర్యలు లేవు. బాచుపల్లిలో వాసవిపై హైకోర్టులో కేసు కోనసాగుతున్నది. ఇలా చెప్పుకుంటూ వెళితే బడాబాబులకు ఒక రూల్, మిడిల్ క్లాస్ ప్రజలకు మరో రూల్ అనేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Also- Amrapali Kata: ఆమ్రపాలి ఈజ్ బ్యాక్.. మేడం వచ్చేస్తున్నారహో!