Heavy Rains In Telangana For 5 Consecutive Days: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే ఛాన్సుందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అందుకు తగ్గట్టుగానే జూన్ ప్రారంభం నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరోపక్క పగటి పూట ఉష్ణోగ్రతలు 35 నుంచి 36 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. బుధవారం కోస్తా ఆంధ్ర , దానిని ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది.
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జూన్ నెలలో భారీ వర్షాలు కురిశాయి. రైతులు వ్యవసాయ పనులు ఇప్పటికే ప్రారంభించారు. గత నాలుగైదు రోజులుగా అక్కడక్కడ తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరికలను జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు శుక్రవారం నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పశ్చిమంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపారు. అలాగే గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే చాన్స్ ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Also Read: ఎక్స్ ట్రా..క్యాబినెట్
వ్యవసాయం, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని దీని ప్రభావంతో జులై నెల నుంచి తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు ఐఎండీ అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో వాతావరణం మేఘావృతమై ఉండనుంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున అత్యవసరమైతే తప్పా మిగతా సమయంలో ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.