- 8-9 తేదీలలో చేపప్రసాదం పంపిణీ ఏర్పాట్లు
- ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో వచ్చే ఆస్త్మా రోగులు
- పంపిణీకి 3.5 క్వింటాళ్ల ప్రసాదం సిద్ధం
- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు
- దేశవ్యాప్తంగా ఒక రోజు ముందుగానే చేరుకునే పేషెంట్లు
- చేప ప్రసాదానికి 172 ఏళ్ల చరిత్ర
- కొరమేను చేప పిల్లలకు డిమాండ్
- శాఖాహారులకు ప్రత్యేకంగా బెల్లంతో ప్రసాదం పంపిణీ
Fish Prasadam ready to distribute Asthma patients:
జూన్ 8 శుక్రవారం మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు బత్తిని సోదరులు. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు దూద్‌బౌలిలోని ఆయన స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం 8వ తేదీ సాయంత్రం దూద్‌బౌలిలోని స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ ప్రారంభమవుతుంది.
ఆర్ అండ్ బీ ప్రత్యేక ఏర్పాట్లు
రెండేళ్లు కరోనా ప్రభావంతో పంపిణీ చేయలేదు. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాలనుంచి కూడా ఈ ప్రసాదానికి వస్తుంటారు ఆస్తమా రోగులు. అయితే ఈ సారి భారీగా ఆస్తమా పేషెంట్లు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. చేపమందు పంపిణీ కోసం ఆర్ అండ్ బీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రద్దీని తట్టుకునే విధంగా క్యూలైన్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. పోలీసు యంత్రాంగం కూడా పేషెంట్లను కంట్రోల్ చేసేలా ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
చేప ప్రసాదం @ 172 ఏళ్లు
చేప ప్రసాదానికి 172 ఏళ్ల చరిత్ర ఉందని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ స్వగహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు.ఇంటి బావిలోని నీటితోనే ఈ చేప ప్రసాదాన్ని తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వీకుల నుంచి ఈ బావిలోని నీటినే వాడుతున్నారు. ఇప్పటికీ ఈ బావిలో నీరు సమృద్ధిగా ఉంది.
3.5 క్వింటాళ్ల ప్రసాదం
మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన చేప ప్రసాదం ప్రస్తుతం 3.5 క్వింటాళ్లకు చేరిందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. మొన్నటి వరకు చేప మందుగా ప్రాచుర్యం పొందగా.. ప్రస్తుతం చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ సైతం చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు…మూడు రకాలు…చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదాలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30,45 రోజుల్లో కార్తె మందును వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే సత్ఫలితాలిస్తుందని చెబుతున్నారు.
ప్రసాదానికి రెండు గంటల ముందు..
మృగశిర కార్తె ప్రారంభం కాగానే మనకి వినిపించే మాట చేపలు. ఈ కార్తెకు చేపలకు ఎంతో అనుబంధం ఉంది. అలాగే ఈ చేపలతో ఉబ్బసం జబ్బుకు మందు కూడా ఉందనేది మనందరికీ తెలిసిందే. అయితే అసలు ఈ చేపమందు మొదట ఎక్కడ వేశారు. ఏ సంవత్సరంలో వేశారు. అసలు ఎలా వచ్చింది. అనే విషయాలు చాలా మందికి తెలియదు.
రెండు గంటలకు ముందుగా.. చేప ప్రసాదం స్వీకరించే ముందు రెండు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించరాదని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చేప ప్రసాదం స్వీకరించిన అనంతరం గంటన్నర వరకు కూడా ఆహారం, నీరు తీసుకోకూడదు.
1847 లో తొలిసారి..
ఈ మందును మొదట 1847లో తయారు చేశారు. అప్పట్లో ఓ సాధువు దేశపర్యటన చేస్తూ హైదరాబాద్ పాతబస్తీకి వచ్చారు. ఆ ప్రాంతంలో సంచరిస్తుండగా బత్తిని వీరన్నగౌడ్ ఆయనకు ఆశ్రయం కల్పించారు. ఆ సమయంలోనే చేప మందు తయారు చేశారు. ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తే నీకు అన్ని విధాలా మంచి జరుగుతుందని చెప్పి తయారు చేసే విధానం ఆయనకు వివరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బత్తిని కుటుంబ సభ్యులు ఈ మందును పంపిణీ చేస్తున్నారు. మందులో పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు, ఇతర వనమూలికలు ఉంటాయి.
కొరమేను చేప పిల్లలతో మందు పంపిణీ
చిన్న సైజు కొరమేను పిల్లలను ఈ చేపమందు పంపిణీకి ఉపయోగిస్తారు. వేయడానికి కొద్ది గంటల ముందు దీనిని తయారు చేసి బతికి ఉన్న కొరమేను చేప పిల్ల నోటిలో ఉంచి దానిని ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు నీటి ద్వారా వేస్తారు. దాంతో అది జీర్ణాశ్రయంలో మెల్లగా కరగడంతో పాటు గొంతు ద్వారా వెళ్లినప్పడు స్వరపేటికను కూడా శుద్ధి చేస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కాగా దీనిని మొదట పాలబస్తీలో పంపిణీ చేసే వారు. తరువాత క్రమంలో జనం ఎక్కువ కావడంతో నాంపల్లికి మార్చారు.
శాఖాహారులకు ప్రత్యేకం
అలాగే బెల్లంతో కలిపి కూడా అందిస్తారు. కాగా దీనిపై అనేక మంది పలు ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. ఇది అసలు మందే కాదన్నారు. దీనిలో సైన్స్ లేదన్నారు. ఆఖరికి కొందరు ప్రజలను మోసం చేస్తున్నారని కోర్టుకు వెళ్లారు. దాంతో కోర్టులో వీరి తరుపు న్యాయవాదుల వాదనలను విన్న తరువాత దీనిని మందు అనొద్దని ప్రసాదం అని పిలవాలని సూచించింది. అప్పటి నుంచి చేప ప్రసాదంగా పిలుస్తున్నారు. ఏది ఏమైనా వ్యాధి గ్రస్తులకు జబ్బు తగ్గితే అదే పదివేలు అంటారు నమ్మకస్తులు.