EX apcc chief Dharmapuri Srinivas health condition critical tentions in congress:
కాంగ్రెస్ సీనియర్ నాయకులు డి.శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం సాయంత్రం చేరారు. ఆయనను మూత్ర సంబంధిత సమస్య వల్ల ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన తనయుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. తన తండ్రి ప్రస్తుతం ఐసీయులో ఉన్నారని..ఆయన కోసం ప్రార్థించాలని సోషల్ మీడియా వేదికగా డి ఎస్ అభిమానులను, అనుచరులను కోరారు. ఇటీవల కొంతకాలంగా శ్రీనివాస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఐసియులో ఉండగా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వైఎస్-డీఎస్ హిట్ కాంబినేషన్
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన డీ శ్రీనివాస్.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే.. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక రాజకీయాల్లో కూడా ప్రస్తుతం ఆయన క్రియాశీలంగా లేరనే చెప్పాలి. కాగా.. ఇందుకు ఆరోగ్య సమస్యలే కారణంగా తెలుస్తోంది.
2004 నాటికి నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు డి.శ్రీనివాస్ (డీఎస్) ఏపీసీసీ చీఫ్ అయ్యారు. వైఎస్-డీఎస్ జోడీ అద్భుత సమన్వయంతో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది. తర్వాత వైఎస్ సీఎం కాగా, డీఎస్ మంత్రి అయ్యారు. మధ్యలో కేశవరావు వంటి పీసీసీ అధ్యక్షుడు అయినా.. 2008 నాటికి డీఎస్ మరోసారి పీసీసీ పగ్గాలను చేపట్టారు. మళ్లీ వైఎస్-డీఎస్ జోడీ కాంగ్రెస్ ను గెలిపించింది. డబుల్ హిట్ సాధించింది.