Danger Bells, Increasing Pollution In Greater Hyderabad
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyd Danger Bells : కాలుష్యం, అంతా నిర్లక్ష్యం

– హైదరాబాద్‌లో మోగుతున్న డేంజర్‌ బెల్స్‌
– నానాటికీ పెరుగుతున్న వాయు, జల, ధ్వని కాలుష్యం
– కాలుష్య కాసారాలుగా శివారు ప్రాంత చెరువులు
– ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల కంటే 14 రెట్లు అధికం
– పట్టించుకోకపోతే ఢిల్లీ పరిస్థితే
– పట్టించుకోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు


Danger Bells, Increasing Pollution In Greater Hyderabad: మన భాగ్యనగరం ఏటికేడు మసిబారిపోతోంది. దక్షిణాదిలోని మెట్రో నగరాల్లో అత్యధిక వాయుకాలుష్య నగరంగా హైదరాబాద్ నిలిచింది. గ్రీన్ పీస్ సంస్థ తాజా అధ్యయనంలో ఏటికేడు హైదరాబాద్‌లో వాయుకాలుష్యం పెరుగుతూ పోతోందని, బెంగళూరు, చెన్నై, కొచ్చి నగరాలతో పోలిస్తే భాగ్యనగరంపు కాలుష్యం రెండున్నర రెట్లు అధికమని తేల్చింది. ఇక.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ప్రమాణాల కంటే ఏకంగా 14 రెట్లు అధిక వాయుకాలుష్యం నమోదవుతోంది. అటు.. వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లోనూ మన భాగ్యనగరం.. కాలుష్య నగరంగా నమోదవటం పర్యావరణ ప్రేమికులను ఆందోళన పరుస్తోంది.

సమస్యకు కారణాలెన్నో!


హైదరాబాద్ నగరంలో 70 లక్షలకు పైగా వాహనాలు రోజూ రోడ్డెక్కుతున్నాయి. దీంతో రోజూ ఉదయం 8.30 గంటలకే వాయు కాలుష్యం 158 ఏక్యూఐకి చేరుతోందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. బంజారాహిల్స్‌లో వాయుకాలుష్యం 127 ఏక్యూఐ, కేపీహెచ్‌బీలో 124, పాతనగరం జూపార్కు ప్రాంతంలో 144, సైదాబాద్‌లో 110 ఏక్యూఐకి చేరింది. పారిశ్రామికవాడలున్న మల్లాపూర్‌, నాచారం, బాలానగర్‌, పటాన్‌చెరు, పాశమైలారం, చర్లపల్లి ప్రాంతాల్లో వాయు కాలుష్యం అనూహ్యంగా పెరిగిపోతోంది. నగరంలో రోజుకు 7వేల మెట్రిక్‌ టన్నుల చెత్త విడుదల అవుతోంది. ఈ చెత్త వల్ల కూడా కాలుష్యం పెరిగిపోవటంతో బాటు నగర శివార్లలో డంపింగ్‌ యార్డు నుంచి తీవ్ర దుర్గంధం వెలువడుతోంది. వీటికి తోడు పరిశ్రమల ఉద్గారాలు, భవన నిర్మాణ కార్యకలాపాల మూలంగా గాలిలో నైట్రోజన్‌ డై ఆక్స్‌డ్‌ బాగా పెరుగుతోంది. వాయు కాలుష్యంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాలున్నాయి. వాయుకాలుష్యం విషయంలో ఆర్థిక రాజధాని ముంబయినీ దాటటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇదిలాగే కొనసాగితే వచ్చే పదేళ్లలో నగరం జనావాసంగా ఉండటం కష్టమేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అత్యధిక స్థాయికి పరిశ్రమల కాలుష్యం

నగర శివార్లలోని పటాన్‌‌చెరు, పాశమైలారం, మియాపూర్‌, కాజుపల్లి, ఐడీఏ బొల్లారం, బాచుపల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, మల్లాపూర్‌, నాచారం, మౌలాలీ, చర్లపల్లి ప్రాంతాల్లోని కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు బయటకు తరలిస్తామని గతంలో అనేక సార్లు ప్రభుత్వాలు హామీలిచ్చినా ఇంకా పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేదు. దీంతో శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి వాయుకాలుష్యం వ్యాపించి, గాలి నాణ్యత నానాటికీ తగ్గుతూ పోతోంది. మరోవైపు రసాయనిక పరిశ్రమల వల్ల భూగర్భ జలాలు కలుషితమవటంతో బాటు పారిశ్రామిక వ్యర్థ జలాలు, హుసేన్‌ సాగర్‌, మూసీ నదుల్లో కలిసి అవి కాలుష్య కాసారాలుగా మారాయి. భూగర్భ జలాల కాలుష్యంతో బోరు నీరు కూడా పసుపు పచ్చగా మారి దుర్వాసన వస్తోంది.

ఫిర్యాదులున్నా.. చర్యలేవీ

వాయు కాలుష్యం మీద లెక్కకు మించిన ఫిర్యాదులు వస్తున్నా.. కాలుష్య నియంత్రణ మండలి వాటిని పరిష్కరించలేని స్థితిలో ఉంది. మండలిలోని మానిటరింగ్ టీమ్‌, క్విక్‌ రియాక్షన్ టీమ్‌, రీజనల్‌ ఆఫీసర్లు, టాస్క్‌ ఫోర్స్ టీమ్‌లు వెళ్లి గాలి నాణ్యతను పర్యవేక్షిస్తున్నా.. నియమాలను ఉల్లంఘిస్తున్న పరిశ్రమల మీద తీసుకున్న చర్యలను వేళ్లమీద లెక్కబెట్టవచ్చు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులతో నిర్వీర్యం అయిన మండలిని ప్రక్షాళన చేయాలని గత నాలుగైదళ్లుగా జనం మొత్తుకుంటున్నా.. గత సర్కారు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల కొద్దిగా కాలుష్య మండలి పనితీరు మారింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన మల్లాపూర్‌, జీడిమెట్ల, గడ్డపోతారం, బొంతపల్లి, పటాన్‌ చెరు, తక్కళపల్లి, వాడపల్లి, పిట్టంపల్లి, గుమ్మడిదల, చౌటుప్పల్‌, నందనం, కుషాయిగూడ, చెట్లగౌరారం, మణుగూరు, హయత్‌ నగర్‌, బీబీనగర్‌, బొమ్మలరామారం, మేడ్చల్‌ దేవాపూర్‌, మారేపల్లి, ఇస్నాపూర్‌, మహేంద్రనగర్‌, పాల్వంచ, దుండిగల్‌, కవాడిపల్లి, నారాయణగిరి, చిలకమర్రి, పెద్దకాపర్తి ప్రాంతాల పరిశ్రమల్లో పీసీబీ అధికారులు నిరంతర తనిఖీలు చేస్తున్నారు.

పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు

ఫార్మా పరిశ్రమలు రాత్రివేళ వదిలే వాయువులతో శివారు ప్రాంత ప్రజలు శ్వాసకోశ వ్యాధుల పాలవుతున్నారు. కళ్లు, ముక్కు మండుతూ తరచూ జనం ఇబ్బందులు పడుతున్నారు. వీటివల్ల లంగ్ కేన్సర్ సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు నెక్లెస్‌ రోడ్డుపై వాయుకాలుష్యం పెరిగిందనీ, హుసేన్ సాగర్‌ నీటిలో మల కోలిఫారమ్‌తో సహా బ్యాక్టీరియా, హానికరమైన వ్యర్థాలు పెరిగాయని పీసీబీ తేల్చి చెప్పింది. తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి చొరవ తీసుకొని మూసీ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టినా కాలుష్యం తగ్గడం లేదు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు