CP Radhakrishnan As The New Governor of Telangana : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో, అధిష్టానాన్ని ఒప్పంచి గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళిసై సౌందరరాజన్. ఈమె చెన్నై లేదా పుదుచ్చేరి నుంచి బీజేపీ తరఫున పోటీ చేయొచ్చని అంటున్నారు. అయితే, తమిళిసై రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ గవర్నర్ పోస్టులోకి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయన పనిచేయనున్నారు.
తమిళిసై రాజీనామాకు ఆమోద ముద్ర
తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ క్రమంలోనే సీపీ రాధాకృష్ణన్ ను నియమించారు. ఆయన ఓవైపు జార్ఖండ్ గవర్నర్‌గా కొనసాగుతూనే, తెలంగాణ తాత్కాలిక గవర్నర్‌గా వ్యవహరించనున్నారు. అలాగే, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కొనసాగుతారు.
ఎవరీ సీపీ రాధాకృష్ణన్?
సీపీ రాధాకృష్ణన్ ఒకప్పుడు బీజేపీ సీనియర్ లీడర్. తమిళనాడులో పుట్టారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. కానీ, 2004, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. గతేడాది ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
సీఎం అరెస్ట్‌లో కీలక పాత్ర పోషించారా?
సీపీ రాధాకృష్ణన్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ అరెస్ట్ అయ్యారు. దీని వెనుక గవర్నర్ పాత్ర ఉందని హేమంత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. దీనిపై సీపీ వివరణ ఇచ్చారు. ఇందులో రాజ్ భవన్‌కు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. అలాంటి వ్యక్తిని తెలంగాణకు తాత్కాలిక గవర్నర్‌గా నియమించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తిస్థాయి గవర్నర్ ఓకే అయ్యేదాకా ఈయనే ఉంటారు. అసలే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల్లో గవర్నర్లను ఇన్వాల్వ్ చేయిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీపీ రాధాకృష్ణన్ రాక, తర్వాతి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.