- కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి నియామకం
- ఒకప్పుడు తెలంగాణకే తలమానికంగా నిలచిన సింగరేణి సంస్థ
- ప్రస్తుతం నష్టాల ఊబిలో కూరుకుపోయిన కంపెనీ
- బీఆర్ఎస్ హయాం నుంచే నష్టాలబాట పట్టిన సింగరేణి
- బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రూ.5 వేల కోట్లకు పైగా అప్పులు
- నాటి ప్రభుత్వ అనాలోచిత విధానాలతో సంస్థ అప్పులపాలు
- సింగరేణి సమస్యలు పరిష్కరిస్తారని కిషన్ రెడ్డిపై గంపెడు ఆశలు
- బొగ్గు గనుల శాఖ మంత్రులుగా గతంలో దాసరి నారాయణరావు, కేసీఆర్
Central coal mining minister kishan reddy to solve the problems of Singareni:
మోదీ 3.0 మంత్రివర్గంలో తెలంగాణకు రెండు కీలక పదవులు దక్కాయి. అందులో ఒకటి ఇండిపెండెంట్ క్యాబెనెట్ ర్యాంకు కలిగిన శాఖ కావడం గమనార్హం. కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే బొగ్గు, గనుల శాఖను కిషన్ రెడ్డికి కేటాయిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు. దేశ అభివృద్ధిలో బొగ్గు ఉత్పత్తి కీలకం. కేంద్రానికి ఆదాయం సమకూర్చే శాఖ. పైగా సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థ తెలంగాణలో కొనసాగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డికి ఈ శాఖను కేటాయించడం రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుందని బీజేపీ శ్రేణఉలు భావిస్తున్నాయి. గతంలో ఈ శాఖను దాసరి నారాయణరావు కూడా నిర్వహించారు. అనంతరం కేసీఆర్ కూడా బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. తాజాగా ఈ శాఖ కిషన్ రెడ్డిని వరించింది. అయితే తెలంగాణలో సింగరేణి సంస్థ దాదాపు బీఆర్ఎస్ హయాం నుంచి నష్టాలబాట పట్టింది. ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చి మళ్లీ సింగరేణిని రాష్ట్రానికే గర్వకారణంగా తీర్చిదిద్దే బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉంది.
వమ్ము చేసిన బీఆర్ఎస్
తెలంగాణ ఏర్పడితే ఓపెన్ కాస్టులే ఉండవని , భూగర్భ గనుల సంఖ్యను భారీగా పెంచి సింగరేణిలో తెలంగాణ ప్రాంత వాసులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని బీఆర్ఎస్ పదేళ్ల క్రితం తమ ఎన్నికల ప్రచారంలో ఇష్టారీతిన వాగ్దానాలు చేసేసింది. సొంత రాష్ట్రం ఏర్పడి సింగరేణికి పూర్వ వైభవం వస్తుందని ఆశపడ్డ కార్మికులకు తీవ్ర నిరాశే మిగిలింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓసీపీల సంఖ్య తగ్గకపోవడమేగాక కొత్తగా భూగర్భ గనులు రాలేదు. పైగా నూతన యాంత్రీకరణ మొదలయింది. దాని ఫలితంగా 2013లో 61 వేల 778 మంది ఉన్న కార్మికుల సంఖ్య ప్రస్తుతానికి 39 వేల 748కి తగ్గిపోయింది. కొత్త కొలువుల మాట దేవుడెరుగు.. పదేళ్లలో ఉన్న కార్మికులే తగ్గిపోయారు! రాష్ట్రం సిద్ధించిన తర్వాత సింగరేణి పరిస్థితి తలకిందులైంది! కొత్త గనుల ప్రస్తావన లేకపోవడం, బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలంలో పెడుతుండడంతో సింగరేణి మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అప్పట్లో 56 భూగర్భ గనులు ఉండగా అవి 29కి తగ్గిపోయాయి. కొత్త గనులు రాకపోతే సంస్థ మనుగడ కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా తగిన న్యాయం చేస్తారని సింగరేణి కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మరింత అప్పుల్లోకి..
ప్రత్యేక తెలంగాణ వచ్చాక సింగరేణి సంస్థ మరింత అప్పుల్లో కూరుకుపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత 3 వేల 540 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది సింగరేణి సంస్థకు. అప్పటికి లాభాలలో ఉన్న సింగరేణి సంస్థ బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రూ.5 వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది. దీనికి తోడు జెన్ కో, ట్రాన్స్ కో విద్యుత్ సంస్థల నుంచి రూ.27 వేల కోట్ల బకాయిలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. లాభాల్లో ఉన్న సంస్థ అప్పుల్లోకి వెళ్లడంతో కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తెలంగాణ ఏర్పడగానే కొత్తగా కనీసం 15 అండర్‌గ్రౌండ్ గనులను ఏర్పాటు చేసి, కొత్తగా లక్ష ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పదేళ్ల కాలంలో మణుగూరు ప్రాంతంలోని కొండాపూర్ లో మాత్రమే భూగర్భ గనిని ఏర్పాటు చేశారు. అలాగే ఇందారం ఓసీపీ, భూపాలపల్లిలో ఓసీపీ-3లను ఏర్పాటు చేశారు. కేవలం ఒక భూగర్భ గని, రెండు ఓపీపీలు మాత్రమే సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది.
కేంద్రంపైనే కోటి ఆశలు
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ పై సింగరేణి కార్మికులు కోటి ఆశలతో ఉన్నారు. దానికి తోడు తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డి ని కీలక బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమించడంపై కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నష్టాలలో ఉన్న సింగరేణిని లాభాల బాట పట్టించాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు చేయూతనివ్వాలని, ఈ ప్రాంతాలలో మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ప్రతి కార్మికుడికీ సొంతింటి కల నిజం చేసేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించే బాధ్యతను కూడా మోదీ సర్కార్ తీసుకుంటుందనే ఆశతో ఉన్నారు