- కేసీఆర్ పై మండిపడుతున్న కార్యకర్తలు
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన సమావేశంలో అధినేతపై ఫైర్
- లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఏకపక్ష నిర్ణయంపై ఆగ్రహం
- గెలిచే అభ్యర్థులను అంచనా వేయలేకపోయారని కేసీఆర్ పై నిరసన
- జాతీయ కాదు..రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటున్న క్యాడర్
- అధినేత వైఖరి ఇలాగే కొనసాగితే కష్టమే అంటున్న కార్యకర్తలు
- ఏకపక్ష నిర్ణయాలు తగ్గించుకోవాలని సలహాలు
BRS cader fires on kcr responsibility on failure of parliament election:
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన భారత రాష్ట్ర సమితి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించింది. పార్టీ ఏర్పాటైన తర్వాత తొలిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో పార్టీని పటిష్టపరిచి మరింతగా బలోపేతం చేయడంపై అధినేత కెసిఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగానే పార్టీ నాయకులతో కెసిఆర్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో కేసీఆర్ కు కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనట్లు సమాచారం. పార్టీని ఏం చేయదలుచుకున్నారు? మా పరిస్థితి ఏమిటి? ఇకనైనా అందరి సలహాలు తీసుకోండి. లేకుంటే పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని దాదాపు కేసీఆర్ కు ఆ పార్టీ క్యాడర్ ఏకంగా మాస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. మళ్లీ పార్టీకి పునర్వైభవం వస్తుంది అని కేసీఆర్ చెప్పే మాటలు ఏ ఒక్క కార్యకర్తా విశ్వసించడం లేదు. ఇక ముందు కేసీఆర్ సమావేశాలకు సైతం వెళ్లకూడదని క్యాడర్ లో మరికొందరు కార్యకర్తలు నిర్ణయించుకున్నారట. ఉన్న కొద్ది పాటి ఎమ్మెల్యేలలో మరో అరడజను నేతలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
అనాలోచిత నిర్ణయాలు
గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్టమెంట్ ఎన్నికలలో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకోవడాన్ని బీఆర్ఎస్ క్యాడర్ తట్టుకోలేకపోతోంది.కెసిఆర్ పాల్గొన్న రోడ్ షోలు, బహిరంగ సభలకు భారీగా జనం తరలివచ్చారు. కానీ, ఆ స్థాయిలో ఓట్లు రాకపోవడానికి బీఆర్ఎస్ క్యాడర్ తీవ్రంగా పరిగణిస్తోంది. కనీసం అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓటింగ్ శాతం లోక్ సభలో వచ్చి వుంటే కనీసం ఐదు నుంచి ఆరు స్థానాలు అయినా దక్కివుండేవని క్యాడర్ నిలదీస్తున్నారు. . తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గులాబీ పార్టీ బొక్కబోర్లా పడి కనీసం బోణీ కూడా చేయలేకపోవడానికి కారణం అభ్యర్థలు ఎంపికే అని కింది స్థాయి క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కొంప ముంచాయని అంటున్నారు కార్యకర్తలు.
జాతీయ ఆశలు గల్లంతు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమాత్రం ఊహించలేదు. కచ్చితంగా తాము హ్యాట్రిక్ కొడతామని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. దీంతో జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ సహా అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఒక దశలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ పేరుతో కూటమి కట్టడానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అధినేతలతో చర్చలు జరిపారు. అయితే అనేక కారణాలతో ఈ కూటమి ఏర్పాటు వర్క్ అవుట్ కాలేదు. అది వేరే సంగతి.
మరికొందరు సిద్ధంగా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా గులాబీ నాయకులు పార్టీని వీడటం మొదలెట్టారు. గేట్లు ఓపెన్ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటన చేయడంతో వలసలు మరింత జోరందుకున్నాయి. వరంగల్ నియోజకవర్గానికి కడియం కావ్యకు బీఫామ్ ఇస్తే చివరి క్షణంలో పోటీ చేయడం లేదంటూ కడియం కావ్య రాజకీయంగా యూ టర్న్ తీసుకున్నారు. అంతిమంగా కాంగ్రెస్ టికెట్‌పై అదే వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కడియం కావ్య విజయం సాధించారు. గులాబీ పార్టీ దయనీయ పరిస్థితికి ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు. ఇటువంటి పరిస్థితి వస్తుందని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నడూ ఊహించి ఉండరు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో రానున్న కాలంలో వలసలు మరింత జోరందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.