Telangana: ఏపీ ఫార్మూలాను తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలకు హింట్ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితోనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే కూటమి ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం. అందుకే బనకచర్లపై బీజేపీ నేతలు ఆచితూచీ స్పందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీపై మాత్రం కూటమితో పోటీ చేస్తారా? లేకుంటే టీడీపీ, జనసేన పోటీకి దూరంగా ఉండి పరోక్షంగా బీజేపీకి మద్దతు ప్రకటిస్తాయా? అనేది మాత్రం సస్పెన్స్.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో సక్సెస్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కూటమితో సక్సెస్ అయ్యారు. అదే ఫార్మూలాను రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉపయోగించాలని భావిస్తున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ ఉంది. గెలుపోటములను ప్రభావం చేయగలదు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితం కాలేదని, ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా వారిని బలోపేతం చేయాలనే ఆశయంతో స్థాపించబడిందని వెల్లడించారు.
నాయకత్వ లేమీతో కొట్టుమిట్టాడుతూ
రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి నిలకడ లేని నాయకత్వ లేమీతో కొట్టుమిట్టాడుతున్నది. క్యాడర్ ఉన్నప్పటికీ నడిపించేవారు లేరు. దీంతో తెలంగాణలో పార్టీ బలహీనపడింది. రాష్ట్ర విభజన సమయంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో 15 అసెంబ్లీ స్థానాలను, మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలోనూ విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 2 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత తెలంగాణలో ఉన్న నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో పార్టీని నడిపించేవారు లేక చతికిల్లపడింది. అన్నింటిని అధిగమించి తెలంగాణలో సత్తాచాటుతామని పార్టీ అధినేత ఇప్పటికే తెలంగాణలోని ముఖ్య నేతలకు చెప్పినట్లు సమాచారం. పరిస్థితులను బట్టి పార్టీని తెలంగాణలో పటిష్టం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణపై ఆధిపత్యం చేలాయించవచ్చని
టీడీపీకి గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పటిష్టమైన నాయకత్వం ఉంది. పార్టీ క్యాడర్ ఉంది. అంతేకాదు ఉమ్మడి పది తెలంగాణ జిల్లాల్లోనూ పార్టీకి క్యాడర్ ఉంది. ఈ మధ్యకాలంలో బీజేపీకి సైతం ఓటు బ్యాంకు పెరుగుతుంది. మొన్న జరిగిన అసెంబ్లీ స్థానాల్లో 8 ఎమ్మెల్యే, 8 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కూటమితో ముందుకు వెళ్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవచ్చని, తెలంగాణపైనా తమ ఆధిపత్యం చేలాయించవచ్చని చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఏపీలో సక్సెస్ అయిన విధంగానే తెలంగాణలోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితో ముందుకెళ్తారని సమాచారం. అందుకే కూటమిపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే టీడీపీ నేతలకు చంద్రబాబు కూటమి ఏర్పాటు చేస్తామని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని పార్టీ వర్గాలకు హింట్ ఇచ్చినట్లు తెలిసింది.
Also Read: Anganwadi: సొంత భవనాలేని అంగన్‌వాడీలు.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం బహిర్గతం!
కేంద్ర నాయకత్వం హింట్ ఇచ్చారా!
ఏపీలో కూటమి ఉండడంతోనే చంద్రబాబు నిర్మించబోతున్న బనకచర్ల ప్రాజెక్టుపై బీజేపీ నాయకులు ఆచితూచీ వ్యహరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. బనకచర్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేయడంతో పాటు మీడియా ముందు ప్రాజెక్టు నిర్మాణంతో జరిగే నష్టంతో పాటు అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతున్నాయి. అసెంబ్లీ వేదికగా చర్చలకు సై అంటే సై అంటున్నాయి. కానీ, బీజేపీ మాత్రం నామ్ కే వస్తేగా స్పందిస్తుంది. ఒకరిద్దరు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఎవరు ఏపీ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టడం లేదు. ప్రాజెక్టును అడ్డుకుంటామని స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో వారికి సైతం కూటమి ఏర్పాటుపై కేంద్ర నాయకత్వం హింట్ ఇచ్చారా అనేది చర్చనీయాంశమైంది. ఏది ఏమైనప్పటికీ కూటమి ఏర్పడితే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండికొడుతుందా? లేక బీఆర్ఎస్ ఓటు బ్యాంకు గండికొడుతుందా? అనేది చూడాలి.