– జులై 7నుంచి గోల్కొండ బోనాలు షురూ
– పలు శాఖల అధికారులతో మంత్రి సమీక్ష
– సమన్వయంతో పనిచేయాలని సూచన
– ఘనంగా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం
– జులై 27న అధికారిక సెలవు
Ashadam Bonala Festivels In Hyderabad Have Been Finalized: ఆషాడమాసంలో హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరగనున్న బోనాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది.దీనిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణా సంస్థలో పలువురు ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఆర్టీసీ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. బోనాల సందర్భంగా ఆయా ఆలయాల వద్ద చేయాల్సిన ఏర్పాట్లు, బోనాలతో వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి, ప్రజా ప్రతినిధులు అధికారులకు సూచనలు చేశారు. బోనాలు జరిగే తేదీలనూ అధికారికంగా ప్రకటించారు.
తేదీలివే..
ఆషాడ మాసంలో వచ్చే బోనాల పండుగ నాలుగు ఆదివారాల్లో సాగుతుందనేది తెలిసిన విషయమే. కాగా, ఈ ఏడాది జులై 7న తొలి ఆదివారం గోల్కొండలోని శ్రీ ఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ మొదటి పూజ జరిగిన తర్వాత రెండవ వారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు, మూడవ వారం లాల్‌దర్వాజ మహంకాళి బోనాలు జరగుతాయి. ఆషాడ మాసంలో చివరిరోజున మళ్లీ గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. జూలై 7 నుంచి నెల రోజుల పాటు తమ తమ కుటుంబ సంప్రదాయాలను బట్టి ప్రతి గురువారం, ఆదివారం భక్తులు బోనాలు సమర్పిస్తారు. తెలంగాణ అధికారిక పండుగగా గుర్తింపు పొందిన బోనాల సందర్భంగా జులై 27న సెలవుగానూ ప్రభుత్వం ప్రకటించింది.
సమన్వయం కీలకం
బోనాలకు ఆయా దేవాలయాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, పోలీసులు శాంతి భద్రతలు, క్యూలైన్ల ఏర్పాట్ల వద్ద గట్టి నిఘా పెట్టాలని, ఆయా ఆలయాల మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. భక్తులకు తాగునీరు వంటి సదుపాయాల కల్పనను జీహెచ్ఎంసీకి అప్పగించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రితో బాటు హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సుమారు 150 ఏళ్ల చరిత్ర గల బోనాల పండుగను గతంలో కంటే ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, దీనికి అన్ని శాఖలూ కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.