adms scam
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Adms Scam: స్కీం పేరుతో స్కాం! రూ.40వేల కోట్లు టార్గెట్; బయటపడ్డ ఏడీఎంఎస్ బండారం

పేరుకు మాత్రమే బైక్‌ బిజినెస్‌
తెర వెనుక మల్టీ లెవల్ మార్కెటింగ్‌
ఏడీఎంఎస్.. పెద్ద బోగస్!
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ బండారం


రూ.15 వేలు కడితే ఐడీ కార్డ్
ఇద్దరిని జాయిన్ చేస్తే రూ.10వేల ప్రాఫిట్
వారు మరికొందరిని చేర్చితే అదనపు డబ్బు
వేలల్లో మొదలై వేల కోట్లలో సాగుతున్న దందా
టార్గెట్ అందుకునేందుకు కొత్తగా రూ.8వేల ఆఫర్
మొదట్లో బాగానే ఉన్నా.. పోను పోను ప్రమాదమే
ఊరూ పేరు లేని కంపెనీని నమ్మితే ఇల్లంతా గుల్లే
ఏడీఎంఎస్ బాగోతంపై స్వేచ్ఛ స్టింగ్ ఆపరేషన్

నువ్వో ముగ్గురికి సాయం చేయి.. ఆ ముగ్గుర్ని మరో ముగ్గురి చొప్పున సాయం చేయమని చెప్పు. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా స్టోరీ ఇది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో సాగే దందాలు కూడా అచ్చం ఇలాగే ఉంటాయి. ముందు డబ్బు కట్టి నువ్వు జాయిన్ అవ్వు. తర్వాత ఇద్దరినో ముగ్గురినో జాయిన్ చేయించు. వారి ద్వారా మిగిలినవారికి వల వెయ్. ఇలా చైన్ సిస్టమ్ ద్వారా డబ్బులు కట్టించుకోవడం. పెద్ద మొత్తంలో జమ అయ్యాక జెండా పీకేయడం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న తంతే. ఈ-బైక్స్ పేరుతో దందా చేస్తున్న ఏడీఎంఎస్ కూడా అంతే. స్వేచ్ఛ స్టింగ్ ఆపరేషన్‌లో ఈ సంస్థ బండారం మొత్తం బయటపడింది.


స్వేచ్ఛ స్పెషల్ డెస్క్: వారం స్కీములు, నెలల లాటరీలు అంటూ గతంలో మోసగాళ్లు గ్రామాలపై పడేవారు. ముందు మాయ మాటలతో డబ్బులు కట్టించుకునేవారు. తర్వాత పెద్దమొత్తంలో  జమ అవ్వగానే ఆ సొమ్ముతో ఉడాయించేవారు. ప్రస్తుతం రోజులు మారాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు అంతా హై లెవెల్ మార్కెటింగ్ మోసాల ట్రెండ్ నడుస్తున్నది. తక్కువ మొత్తంలో ఎక్కువ డబ్బు సంపాదన, కూర్చున్న చోటే కాళ్లు కదపకుండా కాసుల వర్షం అంటూ ఏదో ఒక స్కీం పేరుతో స్కాములకు తెర తీస్తున్నారు కేటుగాళ్లు. కర్ణాటక కేంద్రంగా నడుస్తున్నట్టు చెబుతున్న ఏడీఎంఎస్ కంపెనీ కూడా అంతే. వేలు కట్టండి కోట్లు సంపాదించండి జనాన్ని జనాన్ని ముంచే పనిలో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తున్న ఈ కంపెనీ, వేలాది మంది నుంచి డబ్బులు వసూలు చేస్తున్నది. ముందు నువ్వు డబ్బు కట్టు, ఆ తర్వాత మరో ఇద్దరితో కట్టించు, కమీషన్‌ కొట్టు అంటూ ఇప్పటికే కోట్లలో దండుకుంది. ఇలా ఏకంగా 40 వేల కోట్లు కొల్లగొట్టడానికి మాస్టర్ ప్లాన్ వేసినట్టు స్వేచ్ఛ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది.

పైకి బైక్‌ల కంపెనీ.. తెర వెనుక మార్కెటింగ్ దోపిడీ

ఏడీఎంఎస్ కంపెనీ ఈ-బైకులు అమ్ముతుంటుంది. మాములుగా బైక్‌ను అమ్మాలనుకునేవారు, దాని ఫీచర్స్ ఏంటి? మైలేజ్ ఎంత, పికప్ ఎలా ఉంటుందో చెబుతారు. అదే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఎంతసేపు చార్జ్‌ చేస్తే ఎంత దూరం వెళ్తుందో వివరిస్తారు. కానీ, ఏడీఎంఎస్ రూటే సపరేటు. ఎవరైనా బైక్ కోసం వెళ్తే, ముందుగా ఓ రూ.15 వేలు కట్టమని చెబుతారు. అంత మొత్తం దేనికని అంటే బుకింగ్ అమౌంట్‌ అంటారు. పెద్ద పెద్ద కంపెనీలే రూ.500కు బైక్‌ను బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అలాంటింది ఊరూపేరు లేని ఏడీఎంఎస్ మాత్రం ఏకంగా రూ.15 వేలు వసూలు చేస్తున్నది.

రెండు రకాల ఆఫర్లు

బైక్ కొనడానికి వెళ్లినవారు రూ.15 వేలు కట్టాక ఏడీఎంఎస్ ప్రతినిధులు రెండు రకాల ఆఫర్లు ప్రకటిస్తారు. ఒకటి బైక్ కొనుగోలు చేసే ప్రాసెస్ అయితే, ఇంకొకటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్లాన్. రూ.15 వేలు కట్టండి, మరో ఇద్దరితో అదే రూ.15 వేల చొప్పున కట్టించండి. రూ.10వేల కమీషన్ పట్టిండి అంటూ కమిట్ చేయిస్తారు. తాము ఇప్పటికే కోట్లలో సంపాదించామని కొందరితో క్లాసులు తీసుకుని, వచ్చినవారి బ్రెయిన్ వాష్ చేసి కమిట్ అయ్యేలా చేస్తారు. ఏడీఎంఎస్ మల్టీ లెవల్‌ మోసంపై స్వేచ్ఛ స్టింగ్ ఆపరేషన్ చేసింది. సోషల్ మీడియాలో తిరుగుతున్న నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంది.

స్వేచ్ఛ స్టింగ్ ఆపరేషన్‌తో గుట్టంతా బయటకు

ఏడీఎంఎస్ గుట్టంతా బయటపెట్టేందుకు స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఓ ఏజెంట్‌ను సంప్రదించగా, ఓ హోటల్‌లో జరిగే మీటింగ్‌కు రావాలన్నారు. అందులో పాల్గొనేందుకు రూ.2,600 కట్టాలని చెప్పారు. మీటింగ్‌కు వెళ్లాక ఓ 75 మంది మరో 200 మందిని ఎలా చేర్చుకోవాలో మోటివేషన్‌ స్పీచ్‌లు ఇచ్చారు. ఒక్కొక్కరు నెలకు రూ.15 లక్షలు సంపాదించుకోవచ్చని మాయ మాటలు చెప్పారు. అవి విన్న ఎవరైనా మోటివేట్ అవ్వకుండా ఉండలేరు. రూ.15 వేలు అయితే ఎక్కువ మంది చేరడం లేదని రూ.8వేల స్కీం ను కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం డబ్బులు కడుతున్నారు, చేరుతున్నారు, తిరిగి డబ్బులు వస్తున్నాయి. ప్రస్తుతం బాగానే ఉన్నా అసలు సినిమా ముందుంటుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి మోసాలెన్నో వెలుగు చూశాయి. వందల కోట్లు వసూలయ్యే వరకు ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతుంది ఈ వ్యాపారం. ఓ స్టేజ్‌కు వెళ్లాక ఉన్నదంతా పట్టుకుని ఉడాయిస్తారు. అప్పుడు కింది లెవల్‌లో ఉన్న వేలాది మంది సామాన్యులు నిండా మునిగిపోతారు. ఆ సమయంలో కొత్తగా డబ్బులు కట్టిన వారు ఎవరిని నిలదీస్తారు? కంపెనీని అడుగుతారా? లేక మీరు చేర్పించిన వారిని అడుగుతారా? ఇప్పుడు కూడా కంపెనీ బోర్డు తిప్పేస్తే పరిస్థితి ఏంటి? లీగల్‌గా కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తే దిక్కేంటి? నష్టపోయిన వారికి డబ్బును చెల్లించేది ఎవరు? కోట్లలో సంపాదించామన్న వారు కట్టిస్తారా? చేర్పించిన వారు తిరిగి ఇస్తారా? అసలు బైక్‌ల పేరుతో వ్యాపారం మొదలు పెట్టిన కంపెనీ, వాటిని అమ్మకుండా ఈ చైన్ మార్కెంటింగ్ వ్యాపారం ఎందుకు చేస్తుంది? జనాల నుంచి డబ్బులు వసూలు చేసి, వారినే మార్కెటింగ్ ఏజెంట్లుగా మార్చి, వారి నుంచే డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నది? ఇందులో ఎవరి డబ్బుతో ఎవరు వ్యాపారం చేస్తున్నారు? ఎవరు బకరాలుగా మారుతున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు అందరూ తమకు తాము వేసుకోవాలి. అప్పుడే మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.

Just In

01

TG Electricity: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం హైక్.. వివరాలు ఇలా..?

Bigg Boss Telugu 9: ఈ రోజే బిగ్‌ బాస్ 9 గ్రాండ్ లాంఛ్.. ఫైనల్ లిస్ట్ అదేనా లేక అంతా తూచ్ అంటారా?

Ganesh immersion 2025: రెండో రోజు కొనసాగుతున్న నిమజ్జనం.. సాగర తీరాన కిక్కిరిస్తున్న జన సంద్రం

Telugu Heroine: అర్థరాత్రి కారులో అలాంటి పని.. దొరికిపోయిన బోల్డ్ బ్యూటీ?

KTR: సిరిసిల్ల జేఎన్టీయూ లో సమస్యల పై కేటీఆర్ సీరియస్