- జూన్ 1 అర్థరాత్రితో హైదరాబాద్ కు బ్రేకప్ చెప్పనున్న ఏపీ సర్కార్
- పదేళ్లు పూర్తవుతున్నా నెరవేరని విభజన హామీలు
- బీజేపీ తీరుతో రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం
- ఏపీకి ప్యాకేజీతో సరిపెట్టిన బీజేపీ ప్రభుత్వం
- నాడు సీఎం హోదాలో ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు
- ప్రత్యేక హోదా విషయాన్ని పట్టించుకోని జగన్
- ఏపీ రాజధాని అంశంపై స్పష్టత లేని రెండు ప్రాంతీయ పార్టీలు
- ఎన్నికల కోడ్ ఉన్నందున నిర్ణయాలు పెండింగ్
June 1 midnight onwards AP not having any rights on Hyderabad :
సరిగ్గా పదేళ్ల క్రితం పెద్దలు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగేలా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడే సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు నిర్మించుకుంది. అయితే అనధికారికంగా అమరావతి ఆ రాష్ట్ర రాజధానిగా కొనసాగుతునే ఉన్నావిభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తోంది. ఈ పదేళ్ల గడువు జూన్ 1 అర్థరాత్రితో ముగియనుండగా ఆంధ్రప్రదేశ్ కు ఇకపై రాజధానిగా హైదరాబాద్ ఉండదు. ఇప్పటినుంచి పూర్తిగా తెలంగాణకు మాత్రమే రాజధానిగా హైదరాబాద్ కొనసాగనుంది.
విభజన హామీలన్నీ పెండింగ్ లోనే..
ఉమ్మడి రా జధానిగా హైదరాబాద్‌పై ఏపీకి ఎలాంటి అజమాయిషీ లేకపోయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అనేక సమస్యలపై కేంద్ర హోంశాఖ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉన్నది. కొన్ని విదాదాలు కోర్టు పరిధిలో ఉండగా మరికొన్ని రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపుల దశలో ఉన్నా యి. ఆస్తులు, అప్పుల విభజనతోపాటు కొన్ని డిపార్టుమెంట్ల హెడ్ క్వార్టర్ నిర్వచనంతో బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్ల పంపిణీ జరగాల్సి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ఆమోద సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని ఆ నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు ఇవ్వాలని నాటి రాజ్యసభలో బిజెపి నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు.
ప్రత్యేక రాష్ట్రంపై చేతులెత్తేశారు
విభజన తరువాతి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు లేవు. అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. 2014కు ముందు ప్రణాళికా సంఘం సిఫార్సులతో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేవలం 70 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. నాటి ఏపీ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబునాయుడు ఈ ప్యాకేజీకి అంగీకరించారు. అయితే ఈ ప్యాకేజీ వలన జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ అనే సంగతి అర్థం కావడానికి చంద్రబాబుకు రెండేళ్లు పట్టింది. అలా ప్యాకేజీ పేరుతో దగా చేసిన వారితోనే మళ్లీ తెలుగు దేశం పార్టీ, జనసేన కలిసి ఎన్‌డిఎ కూటమిగా పోటీ చేయటం ఓ రాజకీయ విషాదం. అప్పట్లోప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు, దీక్షలు చేశారు. తనకు 25 మంది లోక్‌సభ సభ్యులను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రకటించారు. 22 మంది వైఎస్‌ఆర్ పార్టీ తరపున లోక్‌సభ సభ్యులుగా గెలుపొందారు. ప్రత్యేక హోదా సాధనలో పూర్తి వైఫల్యం చెంది, తమ వల్లకాదని చేతులు ఎత్తేశారు.
కారకులెవరు?
ఈ పదేళ్లలో ఏపీ అభివృద్ధికి దోహదపడే విభజన చట్ట పరమైన అంశాల అమలు జరగలేదన్నది వాస్తవం. పారిశ్రామికాభివృద్ధి లేక పూర్తిగా ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో పెరిగిపోయింది. విభజన చట్ట హామీలు అమలు జరగక పోవటానికి నరేంద్రమోడీ ప్రభుత్వంతో పాటు గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు కూడా కారకులే.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సైతం ప్రత్యేక హోదా గురించి గానీ, విభజన హామీల గురించి గానీ ఎన్టీఏ కూటమి అగ్రనేతలు మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ నుంచి ఎలాంటి స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. అలాగే వైఎస్ జగన్ కూడా ఈ విషయాలను సున్నితంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ‘ఇండియా’ వేదిక, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు అమలు చేస్తామని స్పష్టంగా ప్రకటించింది. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దటానికి ప్రజాభిప్రాయం కూడగట్టడం అవసరం. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పౌరసమాజం ద్వారా ఈ కృషిని చేయవలసిన అవసరమున్నది.