Vision Cinema House: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ‘జో’ (JOE) వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్, తమ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అత్యంత ఉత్సాహంగా ప్రారంభించింది. ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈ తాజా ప్రాజెక్ట్ తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకోనుంది. నాణ్యమైన కథాబలం, ఉన్నతమైన నిర్మాణ విలువలకు పెద్ద పీట వేస్తున్న ఈ సంస్థ నుంచి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Read also-Vasudeva Sutham Song: మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’ నుంచి ‘ఏమైపోతుందో’ సాంగ్ రిలీజ్..
ఈ చిత్రంలో ప్రధాన పాత్రల కోసం ముగ్గురు విభిన్న సినీ నేపథ్యాలు కలిగిన ప్రతిభావంతులైన నటీనటులను ఎంపిక చేయడం విశేషం. ప్రముఖ నటుడు ఏగన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ వంటి ప్రాజెక్ట్‌లలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆయన, ఈ ద్విభాషా చిత్రంలో తన పాత్రతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘కోర్ట్’ (COURT) చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి శ్రీదేవి అపల్లా ఒక కీలక పాత్ర పోషించనున్నారు. ఇక, మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘మిన్నల్ మురళి’ (Minnal Murali) ఫేమ్ ఫెమినా జార్జ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు. ఈ ముగ్గురు విలక్షణ నటుల కలయిక ఈ సినిమా కథాంశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చనుంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంగీతం అందించే బాధ్యతను ప్రస్తుత సెన్సేషన్ అయిన సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ తీసుకున్నారు. ‘బేబీ’, ‘కోర్ట్’ చిత్రాలకు ఆయన అందించిన సంగీతం వరుసగా బ్లాక్ బస్టర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. యూత్‌ని విపరీతంగా ఆకట్టుకున్న విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, ఈ ద్విభాషా చిత్రానికి అతిపెద్ద బలంగా నిలవనుంది అనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి ‘ఆహా కళ్యాణం’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించనున్నారు. ఆయన టేకింగ్ ఈ కథాంశానికి సరికొత్త రూపాన్ని ఇవ్వనుంది.
Read also-Keerthy Suresh: యూనిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులైన కీర్తీ సురేశ్..
‘జో’ విజయం తర్వాత, విజన్ సినిమా హౌస్ నిర్మాతలు డా. డి. అరుళనందు, మాథ్యూయో అరుళనందు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల నిర్మాణానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. తెలుగు మరియు తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ కథను తీర్చిదిద్దుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఇతర కీలక వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.
