Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస పరాజయాలతో సతమతమవుతున్న వేళ, ఆయన అభిమానులు తమ ఆవేదనను, ఆశలను వెలిబుచ్చుతున్నారు. యశ్వంత్ అనే ఒక “డై హార్డ్ ఫ్యాన్”, విజయ్ తదుపరి చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కు రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం ఒక లేఖ మాత్రమే కాదు, వేలాది మంది ‘రౌడీ’ అభిమానుల గుండె చప్పుడు అంటూ ఆయన రాసిన నోట్ ఇప్పడు విజయ్ దేవరకొండ అభిమానులను కదిలిస్తుంది. గత ఏడేళ్లుగా విజయ్ కెరీర్ లో విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా ఉన్నాయని ఆ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. “సినిమా వస్తుందంటే చాలు మా స్నేహితులకు, చుట్టుపక్కల వారికి మన హీరో మాస్టర్ పీస్ ఇస్తున్నాడని గర్వంగా చెప్పేవాళ్ళం. కానీ ఫలితం తేడా వస్తుంటే సమాజం మమ్మల్ని ఎగతాళి చేస్తోంది. మేము పడుతున్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు” అంటూ తన బాధను వెళ్ళగక్కాడు.
Read also-Barabar Premista: యాటిట్యూడ్ స్టార్ ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ మళ్లీ వస్తున్నాడు.. ఎప్పుడంటే?
రాహుల్ సాంకృత్యన్ పైనే భారీ ఆశలు
టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ వంటి విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యన్ పై అభిమానులు కొండంత నమ్మకం పెట్టుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న పీరియడ్ డ్రామా విజయ్ కు సరైన కమ్ బ్యాక్ ఇస్తుందని వారు భావిస్తున్నారు. “మీ కథా గమనంపై మాకు నమ్మకం ఉంది, వింటేజ్ విజయ్ దేవరకొండను మీరు మళ్ళీ వెండితెరపై ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నాం” అని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ సినిమా విషయంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదని యశ్వంత్ కొన్ని కీలక సూచనలు కూడా చేశాడు. షూటింగ్ పూర్తయ్యాక ఎడిటింగ్ బాధ్యతలను ఇతరులకు వదిలేయకుండా, విజయ్, దర్శకుడు దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు. పేపర్ మీద రాసుకున్న కథలో ఉన్న మ్యాజిక్ స్క్రీన్ మీద మిస్ కాకూడదని విజ్ఞప్తి చేశారు.
Read also-David Reddy: మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్.. రాకింగ్ యాక్షన్ ఎప్పుడంటే?
మరోసారి అవి చూసుకోండి..
గత చిత్రాల మాదిరిగా అప్డేట్స్ లో ఆలస్యం, పాటల విడుదల ఆలస్యం వంటివి జరగకుండా ప్రమోషన్ల విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు. “ఇది మాకు కేవలం సినిమా కాదు.. మా ఆత్మగౌరవం. థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు మీ విజన్ కు సెల్యూట్ చేసేలా సినిమా ఉండాలి. ఆ ఒక్క సక్సెస్ కోసం మేము ఆకలితో ఎదురుచూస్తున్నాం” అంటూ ఆ అభిమాని తన లేఖను ముగించాడు. విజయ్ దేవరకొండ తన పంథా మార్చుకుని భారీ హిట్ కొట్టాలని కోరుకుంటున్న అభిమానుల ఆవేదనను ఈ లేఖ స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. మరి రాహుల్ సాంకృత్యన్ ఈ భారీ అంచనాలను అందుకుంటారో లేదో చూడాలి మరి. రాహుల్ గత సినిమాలు చూసుకుంటే టేకింగ్ లో అసలు కాంప్రమైజ్ అయ్యే వారుగా కనిపించరు. అదే తరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
Dear Director @Rahul_Sankrityn
A few words to you, on behalf of all @TheDeverakonda fans, I hope you read our emotions in it. pic.twitter.com/bKzI77hTXv— Bobby (@yashcuts_) January 21, 2026

