MS Umesh: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు ‘మైసూరు’ శ్రీకాంతయ్య ఉమేష్ ఆదివారం దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఉమేష్ ఇటీవలే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు. ఐదు దశాబ్దాలకుపైగా సాగిన తన సినీ ప్రయాణంలో ఆయన 350కి పైగా చిత్రాల్లో నటించారు.
1945 ఏప్రిల్ 24న మైసూరులో పుట్టిన ఉమేష్, నాలుగేళ్ల వయసులోనే నాటకాల్లో నటించడం ప్రారంభించారు. మాస్టర్ కె. హిరణ్నయ్య థియేటర్ గ్రూప్‌లో చిన్నపాత్రతో మొదలుపెట్టి, తర్వాత గుబ్బి వీరన్న నాటక బృందంలో చేరి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1960లో వచ్చిన ‘మక్కళ రాజ్య’ సినిమాతో ఆయనకు పెద్ద బ్రేక్ వచ్చింది.
అయితే ఆ తర్వాత కొంతకాలం ఆయన కెరీర్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. సినిమా ఆఫర్లు రాకపోవడంతో మళ్లీ నాటక రంగానికే వెళ్ళాల్సి వచ్చింది. 1977లో వచ్చిన ‘కథా సంగమ’ సినిమాతో ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు. అది ఆయనకు మలుపు . అప్పటి నుంచి ఆయన ప్రయాణం ఆగలేదు.
‘నగర హోలే’ (1978), ‘గురు శిష్యరు’ (1981), ‘అనుపమ’ (1981), ‘కామణ బిల్లు’ (1983), ‘వెంకట్ ఇన్ సంకట’ (2007) లాంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. తన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో అభిమానుల మన్ననలు పొందిన ఉమేష్ మరణం కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.

