Rashmika Mandanna: ‘ఛలో’ చిత్రంతో తెలుగు పరిశ్రమకు రష్మికా మందన్నా పరిచయమైంది. హీరో నాగశౌర్య, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. అందం, అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత వరుసగా ఛాన్స్‌లు అందిపుచ్చుకుంది. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, వారసుడు’ ఇలా వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. నేషనల్ క్రష్‌గా ఈ అమ్మడిని పిలవడం మొదలు పెట్టారు. ఈ క్రేజ్‌తో అటు బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ‘యానిమల్’ మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప-2’ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీగా వసూళ్లను రాబట్టింది. ఇటీవల బాలీవుడ్ హిట్ ‘చావా’లోనే హీరోయిన్‌గా నటించింది. ఇలా హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతోన్న నేషనల్ క్రష్‌కు చేతినిండా మూవీస్‌తో బిజీబిజీగా మారిపోయింది.
అటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ భామపై ట్రోలింగ్స్ మొదలు అయ్యాయి. అయితే రష్మికాకు అండగా నిలిచింది సీనియర్ నటి. ఆమెవరో కాదు.. సినీ నటి రమ్య. కన్నడలో రిలీజైన ‘అభి’ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తెలుగు, తమిళం, కన్నడ మూవీస్‌లో యాక్ట్ చేసింది. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రమ్య హాజరైంది. ఈ క్రమంలోనే రష్మికాపై చేస్తున్న ట్రోలింగ్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ మహిళను అలా కించపరచడం సరైన విషయం కాదని తెలిపింది. అందరూ మానవత్వంగా వ్యహరించాలని, ఆడపిల్లల మనస్సు సున్నితంగా ఉంటుందని అన్నారు. అమ్మాయిలను ఏమన్నా తిరిగి మాట్లాడరని, అయితే అమ్మాయిలపై ఇలా ట్రోలింగ్స్ చేయడం కామన్ అయిపోయిందని, వీటికి దూరంగా ఉండాలని వెల్లడించింది. అయితే రష్మికాకు రమ్య అండగా నిలవడంతో సోషల్ మీడియా వేదికగా ఆమెపై మండిపడుతున్నారు. దీంతో రమ్యపై కూడా ట్రోలింగ్స్ చేయడం మొదలు పెట్టారు.
అయితే రష్మికా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తనది హైదరాబాద్ అని చెప్పడంతో ఇది కన్నడ వర్గాలలో ఆగ్రహానికి గురి చేసింది. కన్నడలో తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ హైదరాబాద్ అని పేరు చెప్పుకోవడంతో మండిపడుతున్నారు. ఇక బెంగళూరు వేదికగా జరుగుతోన్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనడానికి రష్మిక అంగీకరించలేదని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ ఆరోపించారు. రష్మికాకు తగిన గుణపాఠం చెప్పాలని, కెరీర్‌ను ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని మండిపడ్డారు. ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ మూవీతో రష్మికా తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టిందని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావాలని గతంలో ఎన్నోసార్లు చెప్పిన.. వచ్చేంత తీరిక, టైం తనకు లేదని చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక అప్పటి నుంచి రష్మికాపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి.