Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par) ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే జూన్ 30న రిలీజై ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమీర్ ఖాన్.. షాకింగ్ విషయాలు బయటపెట్టారు. గతంలో తాను చేసిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ (Thugs of Hindostan) సినిమా గురించి ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమీర్ ఖాన్ ఏమన్నారంటే!
2018లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ మూవీ గురించి తాజాగా అమీర్ మాట్లాడుతూ బాలీవుడ్ అగ్ర కథానాయికలు.. ఈ చిత్రంలో నటించేందుకు నిరాకరించినట్లు ఆయన చెప్పారు. ‘దీపిక నో చెప్పింది. అలియా నో చెప్పింది. శ్రద్ధ కపూర్ కూడా నో చెప్పింది’ అని అతడు చెప్పుకొచ్చాడు. దీంతో వారితో చేయించాలని భావించిన పాత్ర కోసం ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh)ను తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే చిత్ర నిర్మాతలు అమీర్ కు జోడీగా ఫాతిమాను తీసుకోవడాన్ని తొలుత వ్యతిరేకించారు. ‘దంగల్’ చిత్రంలో అమీర్ కు కూతురుగా ఆమె నటించిన నేపథ్యంలో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆందోళన చెందారు.
చిత్ర నిర్మాతల అసంతృప్తి
‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ (Thugs of Hindostan) చిత్ర నిర్మాతలు ఆదిత్య చోప్రా, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య వ్యక్తం చేసిన భయాలను అమీర్ ఖాన్ కొట్టిపారేశారు. వారి అభిప్రాయాలతో ఏకీభవించలేనని చెప్పినట్లు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘తాము వేర్వేరు పాత్రలు పోషించే నటులం. నిజ జీవితంలో నేను తండ్రిని కాదు. ప్రేక్షకులు పరిణితిగా ఆలోచిస్తారన్న విషయాన్ని మనం నమ్మాలి’ అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. గత పాత్రల ఆధారంగా ప్రేక్షకులను తక్కువ అంచనా వేయడం అన్యాయమని పేర్కొన్నారు.
Also Read: Ranga Reddy district: పట్టాదారుడికి తెలియకుండానే భూ మార్పిడి!
సంతోషంగా లేను: అమీర్
అంతకుముందు రాజ్ షమానీ పాడ్ కాస్ట్ (Raj Shamani’s podcast)లో మాట్లాడుతూ అమీర్ ఖాన్.. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ గురించి మరికొన్ని కామెంట్స్ చేశారు. ఆ చిత్రం విడుదలకు ముందు తాను సంతోషంగా లేనని పేర్కొన్నారు. సినిమా విజయవంతం కాదని తాను ముందే కిరణ్ రావుతో చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రధాన తారాగణం ఉన్నప్పటికీ పెట్టిన ఖర్చులను తిరిగి ఈ చిత్రం పొందలేకపోయిందని పేర్కొన్నారు. అది చూసి తట్టుకోలేకపోయానని అన్నారు. కాగా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రాన్ని రూ. 310 కోట్లతో నిర్మించగా.. బాక్సాఫీస్ వద్ద అది రూ. 335 కోట్లు వసూలు చేసింది.