Telusukada OTT: సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘తెలుసుకదా’ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ రొమాంటిక్ డ్రామా, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో చూడలేకపోయిన ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్ ఆడియన్స్, ఓటీటీ లో చూసి ఆనందించవచ్చు.
కథాంశం
‘తెలుసుకదా’ సినిమా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఇక కథ విషయానికి వస్తే.. వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) అనే అనాథ యువకుడు కష్టపడి జీవితంలో పైకి ఎదుగుతాడు. అతనికి మంచి కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలనే కల ఉంటుంది. ఈ క్రమంలో కాలేజీలో రాగ (శ్రీనిధి శెట్టి) తో ప్రేమలో పడతాడు. అయితే కొన్ని కారణాల వల్ల రాగ అతనికి దూరమవుతుంది. ఆ తరువాత, వరుణ్ అంజలి (రాశీ ఖన్నా) ని ప్రేమించి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. వారి కాపురంలో అనుకోని సమస్య ఎదురవుతుంది. అంజలికి పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా, అంజలి సరోగసీ (Surrogacy) గురించి తెలుసుకుని వరుణ్‌ని ఒప్పిస్తుంది. సరోగసీ మదర్‌గా ముందుకు వచ్చిన డాక్టర్ రాగా కుమార్ మరెవరో కాదు.. వరుణ్ మాజీ ప్రేయసి రాగనే! ఇప్పుడు వరుణ్, అతని భార్య అంజలి, మాజీ ప్రియురాలు రాగ మధ్య ఈ సరోగసీ డ్రామా ఎలా నడుస్తుంది? పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనేది ఈ చిత్ర ప్రధాన కథాంశం.
సిద్ధు జొన్నలగడ్డ తనదైన శైలిలో వరుణ్ పాత్రను పండించారు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్లలో అతని నటన ఆకట్టుకుంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వైవా హర్ష కామెడీ ట్రాక్ ఫస్ట్ హాఫ్‌లో కొంత వినోదాన్ని పంచుతుంది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా ఎస్.ఎస్. తమన్ అందించిన సంగీతం, పాటలు నేపథ్య సంగీతం ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయి. జ్ఞాన శేఖర్ V.S. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా, విజువల్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. దర్శకురాలు నీరజ కోన ఒక సున్నితమైన అంశాన్ని ఎంచుకొని, ఎలాంటి ఫైట్స్, హింస లేకుండా ఒక సెన్సిబుల్ లవ్ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. ప్రధానంగా యూత్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ, మెచ్యూర్డ్ సంభాషణలతో కొన్ని సన్నివేశాలను బాగా రాసుకున్నారు.
ఓటీటీలో
థియేటర్లలో కొంత నెమ్మదిగా సాగిందనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఓటీటీలో చూసే ప్రేక్షకులకు ఇది మంచి ఛాయిస్ అవుతుంది. ఒక కొత్త కోణంలో చెప్పబడిన ప్రేమకథ, నటీనటుల పెర్ఫార్మెన్స్, అద్భుతమైన సాంకేతిక విలువలు ‘తెలుసుకదా’ను చూసేలా చేస్తాయి. ‘తెలుసుకదా’ ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర దక్షిణ భారత భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారు దీనిని ఒకసారి ప్రయత్నించవచ్చు.
Telusu Kada?!
The MOST RADICAL LOVE STORY #TelusuKada is now streaming on @NetflixIndia ❤🔥
Do not miss it 🤩#LoveU2 #UnapologeticallyRadical pic.twitter.com/h1z8ImUJm9
— People Media Factory (@peoplemediafcy) November 14, 2025
