Telugu Film Chamber: సినీ కార్మికులు తమకు 30 శాతం వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తూ.. కొన్ని రోజులుగా షూటింగ్స్ బంద్ చేసిన విషయం తెలిసిందే. 30 శాతం వేతనాలు పెంచి ఇచ్చిన వారి సినిమాల షూటింగ్స్‌కు మాత్రమే వారు హాజరవుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఫెడరేషన్ ప్రతినిధులతో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో నిర్మాతలు నాలుగు ప్రతిపాదనలు ఫెడరేషన్ ముందు ఉంచగా, అందులో రెండింటికి ఫెడరేషన్ ఓకే చెప్పింది. మరో రెండు ప్రతిపాదనలను ఫెడరేషన్ సభ్యులతో చర్చించిన తర్వాత చెబుతామని వెల్లడించింది. ఇలా చర్చలు సఫలమై.. సమస్య ఓ కొలిక్కి వస్తుందనుకునే సమయంలో.. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఓ సంచలన ప్రకటనను విడుదల చేసింది. దీంతో, ఈ సమస్య ఇప్పట్లో ముగియడం కష్టమే అనేలా టాక్ మొదలైంది.
Also Read- The Paradise Film: ‘ది ప్యారడైజ్’లో రెండు జడలతో నేచురల్ స్టార్.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునిచ్చిన దృష్ట్యా.. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్లతో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు చర్చలు లేదా సంప్రదింపులు చేయకుండా ఉండాలని సూచించబడింది. ఈ నిబంధన ఫిలింఛాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు అమలులో ఉంటాయి. స్టూడియోలు, ఔట్‌డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ముందస్తు సమాచారం, స్పష్టమైన అనుమతి లేకుండా ఎలాంటి సేవలూ అందించకూడదు అనే కఠినమైన ఆదేశాలు జారీ చేయబడుతున్నాయి. నిర్మాతలు, స్టూడియో విభాగ సభ్యులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని పాటించాలి’’ అని పేర్కొంది.
ఫెడరేషన్ తీసుకున్న ఏక పక్ష సమ్మె కారణంగా రన్నింగ్‌లో ఉన్న ఎన్నో సినిమాలకు నష్టం వాటిల్లింది. అందుకే శాశ్వత పరిష్కారం వచ్చే వరకు నిర్మాతలంతా ఐకమత్యంతో ఉండి, ఎటువంటి షూటింగ్స్ చేయవద్దని స్ట్రాంగ్‌గా ప్రకటించింది తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్. మరో వైపు ఫెడరేషన్ మాత్రం 30 శాతం వేతనాలు పెంచాల్సిందేనని, ఏ రోజు వేతనాలు ఆ రోజే చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. గురువారం జరిగిన చర్చల అనంతరం మరో నాలుగైదు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందనేలా కో-ఆర్డినేషన్ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ లోపు ఎవరూ షూటింగ్స్ చేయవద్దని నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తెలియజేసింది.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌పై ఫిల్మ్ ఫెడరేషన్ సీరియస్
రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందనే దశలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. ఫెడరేషన్ సభ్యులపై కేసులు వేయడం దారుణమంటూ ఆయనపై మండి పడ్డారు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు. ‘‘సినీ కార్మికులంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత విశ్వప్రసాద్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మేము ఎక్కడా వారిని డిస్టర్బ్ చేయలేదు.. అలాగే డిమాండ్ చేయలేదు. పని కట్టుకుని మరీ మాపై కేసులు వేయడం బాధాకరం. నిర్మాత విశ్వప్రసాద్ సినిమాలైతే తీస్తున్నాడు కానీ, ఆయనకు సరైన ప్లానింగ్ లేదు. ఆయన మాపై వేసిన కేసులను మా లీగల్ టీమ్ చూసుకుంటుంది. రేపు, ఆ తర్వాత రోజు ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఛాంబర్ వరకు కార్మికులందరం ధర్నా చేయబోతున్నాం’’ అని అమ్మిరాజు పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు