SSMB 29: దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) నుంచి సినిమా వస్తుంది అంటే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తారు. అలాంటిది అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఉన్నాడు అంటే ఈ సినిమాకు ఏ రేంజ్ లో హైప్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. అందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్నారు. షూటింగ్ కూడా మొదలై పలు షెడ్యూల్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా నుంచి మాత్రం ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. హీరో, హీరోయిన్, దర్శకుడు తప్పితే, ఈ సినిమా గురించి ఏ సమాచారం ఇవ్వకుండా దర్శకుడు జాగ్రత్త పడుతున్నాడు. రాజమౌళి గతంలో తీసిన సినిమాలు అన్నింటిలోనూ పాతవారినే ఎక్కువగా రిపీట్ చేస్తుంటారు. సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్(Senthil Kumar) ఇలా చేసిన వారితోనే చేస్తుంటారు. అయితే ఈ సారి కొత్తవారితో సినిమా మొత్తం పూర్తి చేస్తారన్న వార్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ నోరు విప్పారు. తాను ఈ సినిమాను చేయడం లేదని తెలిపారు. అంతే కాకుండా కొత్తవారితో ఈ సినిమా తీస్తున్నారని తెలిపారు. దీంతో కొత్తవారితో సినిమా తీయడం, సినిమా గురించి వివరాలు తెలపక పోవడంతో ఏం జరుగుతోందని సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Also read- Vikarabad District police: జీరో ఎఫ్‌ఐఆర్ కేసులపై నిర్లక్ష్యం తగదు.. నారాయణ రెడ్డి
దర్శకుడు రాజమౌళి తాను తీసిన అన్ని సినిమాల్లోనూ ఒకే టీం ను కొనసాగిస్తూ ఉంటారు. రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్ఆర్’ లకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. రాజమౌళి కూడా సెంథిల్ పనితీరును ప్రశంసిస్తూ పలు సందర్భాల్లో మాట్లాడారు. దీంతో మళ్లీ అదే కాంబో రిపీటవుతుందని అందరూ ఊహించారు. సెంథిల్ మాటలతో ఈ సినిమాలో అందరూ కొత్తవారే ఉండబోతున్నారని అందరికీ క్లారిటీ వచ్చింది. కాగా ఎస్‌ఎస్‌ఎంబీ 29కి ఎవరెవరు పనిచేస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Also read- RTC Employees Union: ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి ఇవ్వాలి.. ఎంప్లాయీస్ యూనియన్
ఇప్పటికే ఎస్‌ఎస్‌ఎంబీ 29 సంబంధించి పలు షెడ్యూళ్ల షూటింగ్ జరిగిపోయింది. తాజాగా ఒడిశాలో జరిగిన షూటింగ్ తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాజమౌళి షూటింగ్ జరిగేటపుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారని సమాచారం. ఈ సినిమా కొన్ని షాట్స్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లనున్నారట. ఈ షాట్స్ చిత్రీకరణ కెన్యాలో జరగాల్సి ఉండగా లొకేషన్ మార్చినట్లు టాక్. ఎత్తైన కొండ ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు ఉండగా అందుకు దక్షిణాఫ్రికా వెళ్లారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా అంచనాలు మించి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా తెలుగు వారి సత్తాను చాటుతుందని భావిస్తున్నారు.