Smriti Wedding: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ ల పెళ్లి వాయిదా పడటంపై తొలిసారిగా పలాష్ సోదరి, గాయని పాలక్ ముచ్ఛల్ స్పందించారు. ఊహించని ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కారణంగా పెళ్లి వేడుక ఆలస్యం కావడంతో రెండు కుటుంబాలు సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాయని ఆమె తెలిపారు. నవంబర్ 23న జరగాల్సిన ఈ వివాహం, స్మృతి తండ్రి, పలాష్ వరుస రోజుల్లో ఆసుపత్రిలో చేరడంతో వాయిదా పడింది.
ఏం జరిగింది?
స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ ల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే, పెళ్లి రోజున ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ అనూహ్య పరిణామం కారణంగా వివాహాన్ని వాయిదా వేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీనిపై స్మృతి మేనేజర్ ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత, వధువు పలాష్ ముచ్ఛల్ కూడా అనారోగ్యానికి గురై స్మృతి స్వస్థలమైన సాంగ్లీలోని ఒక ఆసుపత్రిలో చేరారు. తరువాత మెరుగైన చికిత్స కోసం అతన్ని ముంబైకి తరలించారు. అదృష్టవశాత్తూ, శ్రీనివాస్, పలాష్ ఇద్దరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి కోలుకుంటున్నారు.
పాలక్ ఏమన్నారంటే..
తన సోదరుడు పలాష్, స్మృతి మంధాన పెళ్లి వాయిదాపై పాలక్ ముచ్ఛల్, ఫిల్మ్‌ఫేర్‌తో మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు. ఈ పరిస్థితిని కుటుంబాలు ఎలా ఎదుర్కొంటున్నాయని అడిగినప్పుడు, ఆమె ఇలా అన్నారు.. “కుటుంబాలు చాలా కష్టమైన సమయాన్ని అనుభవించాయని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పినట్లే, ఈ సమయంలో మేము సానుకూలతను నమ్మాలనుకుంటున్నాము, మేము చేయగలిగినంత సానుకూలతను వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మేము బలంగా ఉండటానికి కూడా ప్రయత్నిస్తున్నాము.” అంటూ రాసుకొచ్చారు.
సోషల్ మీడియాలో స్పందన
వివాహం వాయిదా పడిన తర్వాత, స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పెళ్లికి సంబంధించిన అన్ని పోస్ట్‌లను తొలగించారు. దీంతో ఈ జంట గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా, పలాష్ మోసం చేశాడనే పుకార్లు కూడా వ్యాపించాయి. అయితే, స్మృతి సోదరుడు శ్రవణ్, పెళ్లి ఇంకా వాయిదాలోనే ఉందని, డిసెంబర్ 7న వివాహం అనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కుటుంబాలు ఇప్పటివరకు కొత్త పెళ్లి తేదీని ప్రకటించనప్పటికీ, పాలక్, పలాష్ తల్లి అమిత ముచ్ఛల్ కూడా త్వరలోనే పెళ్లి జరుగుతుందని ధృవీకరించారు. పలాష్‌కు స్మృతి తండ్రితో చాలా అనుబంధం ఉందని, ఆయన కోలుకునే వరకు పెళ్లి వాయిదా వేయాలని నిర్ణయించుకుంది పలాష్ అని అమిత తెలిపారు. ఈ కష్ట సమయాన్ని సానుకూలతతో మరియు బలంగా ఎదుర్కొంటామని పాలక్ ముచ్ఛల్ వెల్లడించారు.

