Naga Chaitanya: శోభితనే నా బలం.. నా లైఫ్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఆమెకే! అని అన్నారు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. గత ఏడాది డిసెంబర్‌లో నాగ చైతన్య, శోభిత పెళ్లిబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. నాగ చైతన్యకు ఇది రెండో పెళ్లి. సమంతతో విడాకుల అనంతరం రెండేళ్ల పాటు శోభితతో ప్రేమలో ఉన్న నాగ చైతన్య.. ఆ ప్రేమని ఇరు కుటుంబాల వారికి చెప్పి, ఒప్పించి.. వారి అంగీకారంతో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అతి తక్కువ మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఎక్కడ కలిశారా? అని వారి ప్రేమ రివీల్ అయినప్పటి నుంచి అంతా అనుకుంటూనే ఉన్నారు. తాజాగా ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతిబాబు’ షో కు హాజరైన నాగ చైతన్య.. శోభితతో ప్రేమ ఎలా మొదలైందో వివరంగా వివరించారు.
Also Read- Gatha Vaibhava: పవన్ కళ్యాణ్ అద్భుతమైన మాట చెప్పారు.. అందుకే తెలుగు నేర్చుకుని వచ్చానన్న హీరో!
ప్రేమకి సోషల్ మీడియానే కారణం
అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బికె షో తరహాలో సెలబ్రిటీ టాక్ షోగా మొదలైన ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతిబాబు’ సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది. ప్రతి వారం ఒక కొత్త సెలబ్రిటీని ఇంటర్వ్యూలో చేస్తూ, ఎన్నో ఆసక్తికర విషయాలను జగపతిబాబు రాబడుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి టాక్ షోకు వెళ్లని వారు కూడా ఈ షోకు గెస్ట్‌లుగా వస్తుండటం విశేషం. ఇక ఈ షోకు వచ్చిన నాగ చైతన్య ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరీ ముఖ్యంగా జగపతిబాబుని ఆయన పిలిచిన తీరు కూడా హైలెట్ అయిందంటే.. ఈ షో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక శోభితతో ప్రేమ వ్యవహారం గురించి జగపతిబాబు అడగగానే.. చైతూ ఆలోచించకుండా అసలేం జరిగిందే చెప్పేశారు. శోభితతో ప్రేమకి సోషల్ మీడియానే కారణం అని క్లారిటీ ఇచ్చేశాడీ యువ సామ్రాట్. అదేంటో ఆయన మాటల్లోనే..
శోభిత లేకుండా ఉండలేను
‘‘ఇప్పుడు నా వైఫ్ అయిన శోభితను మొదట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కలుస్తానని అసలెప్పుడూ ఊహించలేదు. నేనొకసారి క్లౌడ్ కిచెన్ షోయు గురించి ఓ పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్‌కు ఆమె ఓ ఎమోజీతో కామెంట్ చేసింది. ఆ కామెంట్‌కు నేను రిప్లై ఇచ్చాను. అలా మా ఇద్దరి మధ్య చాటింగ్ ద్వారా స్నేహం మొదలైంది. ఆ స్నేహం క్రమక్రమంగా ఇష్టంగా, ప్రేమగా మారింది. అలా మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత తరుచూ కలుసుకునే వాళ్లం, ఫోన్లలో మాట్లాడుకునే వాళ్లం’’ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. నువ్వు ఏది లేకుండా జీవించలేవు.. అని జగపతిబాబు ప్రశ్నించగా.. ‘‘నా భార్య శోభిత లేకుండా ఉండలేను’ అని అన్నారు నాగచైతన్య. ‘‘ఆమే నా బలం. ఇకపై నా జీవితంలో ఎక్కువగా ఇంపార్టెన్స్ శోభితకే ఇస్తాను’’ అని చైతూ ఇచ్చిన ఆన్సర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ‘తండేల్’ తర్వాత ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
