Sankranthiki Vasthunam OTT: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా విక్టరీ వెంకటేష్‌కు మరోసారి ఊపిరిపోసింది. వెంకటేష్ పని అయిపోతుందని అనుకుంటున్న వాళ్లందరితో వావ్ అనిపించిన సినిమాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అంతేకాదు, రీజినల్ ఫిల్మ్ కేటగిరీలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా సరికొత్త హిస్టరీని నెలకొల్పింది. సంక్రాంతికి భారీ పోటీ మధ్య వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇండస్ట్రీలోని అందరికీ ఎంతో స్ఫూర్తిని నింపింది. బడ్జెట్, ప్రమోషన్స్.. ఇలా ప్రతి ఒక్కటీ అందరూ ఫాలో కావాల్సిన లెసన్‌గా అందరికీ దారి చూపించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలోకి వచ్చే ముందు ఎన్ని ట్విస్ట్‌లైతే నెలకొన్నాయో.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిందీ చిత్రం. అదేంటంటే..
Also Read- Senior Heroine: సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్
అటు ఓటీటీ, ఇటు టీవీ ప్రీమియర్
సంక్రాంతికి ఈ సినిమాకు పోటీగా వచ్చిన ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలు ఇప్పటికే ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. కానీ, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయంలో మాత్రం మేకర్స్ కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు. ఒకసారి టీవీ ప్రీమియర్ పూర్తయిన తర్వాతే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వస్తుందని అన్నారు. మరోసారి రివర్స్‌లో చెప్పారు. ఇవన్నీ కాదు అనీ, అటు ఓటీటీ, ఇటు టీవీ ప్రీమియర్‌గా మార్చి 1వ తేదీ, ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒకేసారి ప్రీమియర్‌గా జీ తెలుగు (Zee Telugu), జీ 5 (Zee5)లలో విడుదల చేశారు. ఇక ట్విస్ట్‌లన్నీ తొలగిపోయి, ఎట్టకేలకు ఓటీటీ, టీవీలలోకి వచ్చిందని అనుకునేలోపు, మరో షాక్ ఇచ్చారు మేకర్స్ అండ్ ఓటీటీ టీమ్.
థియేట్రికల్ నిడివి కంటే తక్కువ
అవును, ఈ సినిమా ఓటీటీలో ఒరిజినల్ కంటే 8 నిమిషాలు తక్కువగా ప్రదర్శించినట్లుగా తెలుస్తుంది. సినిమా ఒరిజినల్ నిడివి 2 గంటల 24 నిమిషాలైతే, ఓటీటీలో మాత్రం కేవలం 2 గంటల 16 నిమిషాలు మాత్రమే ప్రసారం చేయడంతో, ఈ సినిమా కోసం వేచి చూసిన వారంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఆ 8 నిమిషాల్లో ఏమేం సీన్లు లేపేశారో అనేలా అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. వాస్తవానికి, ఈ సినిమా ఓటీటీలోకి రాకముందు మరిన్ని కామెడీ సీన్లు యాడ్ చేయబోతున్నారనేలా వార్తలు వచ్చాయి. తీరా చూస్తే, ఉన్నదాంట్లోనే కోత విధించడంతో, ఇలా చేశారేంటి? అని జీ5 వీక్షకులు సైతం క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ కటింగ్‌కు కారణం ఏమిటనేది మాత్రం మేకర్స్ ఇంత వరకు తెలపలేదు. రాబోయే రోజుల్లో ఏదైనా ఈవెంట్‌లో తెలుపుతారేమో చూడాల్సి ఉంది. వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకుడు.