Prasanth Varma: ‘హనుమాన్’ (HanuMan) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ (Prasanth Varma), అనూహ్యంగా తన కెరీర్‌లోనే అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ (PVCU) ను ప్రకటించి, వరుస ప్రాజెక్టులతో దూసుకుపోవాలని ప్లాన్ చేసుకున్న సమయంలో, ఆయనపై ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్‌పై కూడా అనుమానాలు మొదలయ్యాయి.
Also Read- Mana Shankara Vara Prasad Garu: ఐటమ్ సాంగ్ చేస్తున్నది ఎవరో తెలుసా? ఇందులోనూ అనిల్ మార్కే!
అసలేం జరిగింది?
‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలపై విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఫిర్యాదులో నిర్మాత నిరంజన్ రెడ్డి పేర్కొన్నదాని ప్రకారం, ప్రశాంత్ వర్మ తమ వద్ద రూ. 10 కోట్లకు పైగా అడ్వాన్స్ తీసుకుని, ‘అధీర, మహాకాళి, జై హనుమాన్’ వంటి తమ బ్యానర్‌లో చేయాల్సిన ప్రాజెక్టులను వేరే సంస్థలతో ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, దీనివల్ల తాము భారీగా నష్టపోయామని, అందువల్ల రూ. 200 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లారు. దీనిపై దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా గట్టిగానే స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అబద్ధమని కొట్టిపారేశారు. హనుమాన్ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చినా, తమ అగ్రిమెంట్ ప్రకారం రావాల్సిన లాభాల వాటా తనకు ఇవ్వకుండా, కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నిర్మాతపై ఆయన ఎదురు ఆరోపణలు చేశారు. తాను ఐదు సినిమాలు చేస్తానని ఎక్కడా కమిట్‌మెంట్ ఇవ్వలేదని, నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ అంతా ‘హనుమాన్’ సినిమా ద్వారా తనకు దక్కాల్సిన షేర్ కిందే లెక్క అని ప్రశాంత్ వర్మ తన లేఖలో స్పష్టం చేశారు.
Also Read- Mithra Mandali OTT: థియేటర్లలో మెప్పించలేకపోయింది కానీ.. ఓటీటీలో!
‘జై హనుమాన్’పై అనుమానాలు
ప్రస్తుతం ఈ వివాదం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ పరిశీలనలో ఉంది. ఈ గొడవ కారణంగా ప్రశాంత్ వర్మ కమిట్ అయిన ఇతర ప్రాజెక్టులతో పాటు, PVCUలో అత్యంత కీలకమైన ‘జై హనుమాన్’ సినిమా భవిష్యత్తుపైనా ఆందోళన నెలకొంది. ‘జై హనుమాన్’ (Jai Hanuman)లో పవర్ ఫుల్ హనుమాన్ పాత్రలో రిషబ్ శెట్టి కనిపించబోతున్నారనే ప్రకటన వచ్చినప్పటి నుంచి అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే, ఈ మధ్యకాలంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడం, పైగా నిర్మాతతో వివాదం తలెత్తడంతో, ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, అనుకున్న సమయానికి విడుదల అవుతుందో లేదో అనే సందేహాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడువని చెబుతూ, మీడియా సంస్థలు కూడా ఛాంబర్ నిర్ణయం వచ్చేవరకు ఊహాగానాలను ప్రచురించవద్దని విజ్ఞప్తి చేశారు. మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుంది, ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రాజెక్టులను, ముఖ్యంగా ‘జై హనుమాన్’ను ఎప్పుడు ప్రారంభిస్తారో, ఎప్పుడు అప్డేట్ ఇస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
