Naveen Polishetty: సంక్రాంతి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించారు. నవీన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. భారీ అంచనాలతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల భారీ వసూళ్లతో సంచలనం సృష్టించి, సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతున్న సందర్భంగా మేకర్స్ థ్యాంక్యూ మీట్ (Anaganaga Oka Raju Thank You Meet)ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read- Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!
మా అభిమానులకు త్వరలోనే ట్రీట్..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఈ సినిమా సక్సెస్‌తో చాలా ఆనందంగా ఉంది. ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత ఆ స్థాయి తృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇదే. ఈ సంక్రాంతికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా విషయంలో మీడియా నుంచి వచ్చిన అపారమైన మద్దతుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీలోని నిర్మాతలెందరో ఈ సినిమా ఆడాలని కోరుకున్నారు. అందరి ఆశీస్సులతోనే ఈ స్థాయి విజయం లభించింది. అలాగే మా అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతగానో మద్దతు తెలుపుతున్నారు. ఆ అభిమానులందరికీ సరైన ట్రీట్ త్వరలోనే ఉంటుంది.
Also Read- IMDB 2026: ఐఎండిబి 2026లో మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..
బాగా ఒత్తిడికి లోనయ్యా..
ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ.. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ తగినన్ని థియేటర్లను మాకు కేటాయించి ఎంతో అండగా నిలిచినందుకు వారికి ధన్యవాదాలు. అందుకే రెండు రోజుల్లోనే రూ.41 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది. నన్ను, నవీన్‌ని నమ్మి మా కోసం థియేటర్లు ఉంచిన డిస్ట్రిబ్యూటర్లకు కృతఙ్ఞతలు. సంక్రాంతి సమయంలో సినిమా విడుదల చేసి హిట్ కొట్టడం నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకమైన విజయంలో భాగమై, తన పూర్తి మద్దతు ఇచ్చిన నవీన్‌కి థ్యాంక్స్. ఏడాది పాటు వేరే సినిమాలు ఒప్పుకోకుండా.. మా సినిమాకు పూర్తి సమయం కేటాయించిన మీనాక్షి చౌదరికి కృతఙ్ఞతలు. స్క్రిప్ట్ పరంగా నాకు ఎలాంటి సందేహాలు ఉన్నా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయితో చర్చించేవాడిని. ఈ సినిమా విజయం సాధిస్తే.. మా బ్యానర్‌లో దర్శకురాలిగా పరిచయం చేస్తానని ఆమెకు మాట కూడా ఇచ్చాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందే ఈ సినిమా చూసి, బాగుందని చెప్పారు. ఆయన స్టాంప్ పడటంతో.. విడుదలకు ముందే నాకెంతో ధైర్యం వచ్చింది. కానీ విడుదలకు రెండు రోజులు ముందు మాత్రం బాగా ఒత్తిడికి లోనయ్యాను. ఆ సమయంలో మా బాబాయ్ రాధాకృష్ణ నాకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. పదేళ్లుగా నా సినీ ప్రయాణంలో వెన్నెముకగా నిలిచిన సుధీర్‌కి, అలాగే నేనున్నానని భరోసా ఇచ్చిన మా వ్యాపార భాగస్వామి రామ్‌కు ప్రత్యేక కృతఙ్ఞతలు. ఈ సినిమాకు పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆరేళ్ళ తర్వాత ప్రేక్షకులు నాకు మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందించారు. ఇలాగే ఈ చిత్రాన్ని ఆదరిస్తూ.. మరింత పెద్ద విజయాన్ని అందిస్తారని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

