Manchu War: హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఇంటి వద్ద ఇటీవల పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తండ్రి మోహన్ బాబుకు ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల రంగ ప్రవేశంతో ఈ వివాదం కొద్ది రోజులు సర్దుమనగగా… తాజాగా మరోమారు రాజుకున్నట్లు కనిపిస్తోంది. జల్ పల్లి (Jalpally Mohan Babu House) లోని ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ఇంటి ముందు బైఠాయించిన మనోజ్..
మంగళవారం మరోమారు నార్సింగి పోలీసులను (Narsingi Police) ఆశ్రయించిన మంచు మనోజ్.. 150 తన ఇంట్లోకి చొరబడ్డారని ఆరోపించారు. తన కార్లతో పాటు వ్యక్తిగత వస్తువులను ఎత్తుకు పోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్న మంచు మనోజ్.. ఆయన ఇంటి గేటు వద్ద బైఠాయించారు. మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది ఇంటి లోపలికి అనుమతించకపోవడంతో ఆయన ఇంటి ముందే కూర్చున్నారు.
భారీగా పోలీసులు మోహరింపు
మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ బైఠాయించడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా దాదాపు 100 మంది పోలీసు సిబ్బంది జల్ పల్లి ఇంటి వద్దకు చేరుకున్నారు. అంతేకాకుండా మోహన్ ఇంటికి కిలో మీటర్ దూరంలో చెక్ పోస్ట్ ను సైతం ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఎవరిని ఇంటి వద్దకు అనుమతించడం లేదు. మరోవైపు మంచు మనోజ్ భార్య.. మౌనిక (Mounica) సైతం జల్ పల్లి నివాసానికి చేరుకున్నారు. దీంతో పరిస్థితులు ఎటువైపునకు దారి తీస్తాయోనన్న ఆందోళన నెలకొంది.
ఫిర్యాదుపై మనోజ్ ఏమన్నారంటే
నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందిస్తూ.. ‘‘నా ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారు. ముఖ్యమైన వస్తువులన్నిటిని పగలకొట్టి విధ్వంసం చేశారు. నా కూతురు బర్త్‌డే కొరకు నేను రాజస్థాన్‌కి వెళ్లగా, నా సోదరుడు విష్ణు మంచు నా ఇంటిని ధ్వంసం చేశాడు. నా ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై మా నాన్న మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయన నాతో మాట్లాడడానికి అందుబాటులోకి రాలేదు. నాకు న్యాయం చేయమని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశాను’’ అని చెప్పుకొచ్చారు. ఈ ఫిర్యాదు వారి ప్యామిలీపై మరోసారి టాలీవుడ్ వ్యాప్తంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Manchu Family Dispute: 150 మందితో నా ఇంటిపై దాడి చేయించింది అతడే.. ఫిర్యాదులో మంచు మనోజ్
వివాదం ఎందుకుంటే?
వాస్తవానికి ఈ వివాదం ఇప్పటిది కాదు. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వారి ఫ్యామిలీలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ పెళ్లి మంచు విష్ణుకి ఇష్టం లేదనేలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరి మధ్య బహిరంగంగానే గొడవ జరిగింది. ఆ గొడవను కూడా కవర్ చేసుకోవాలని చూశారు. కానీ ఆ తర్వాత స్పష్టంగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయనేది తేలిపోయింది. ఇటీవల మంచు ఫ్యామిలీ గొడవ బాగా ముదిరిపోయింది. మోహన్ బాబు ఫ్రస్ట్రేషన్‌తో మీడియాపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ తర్వాత సారీ చెబుతూ లేఖలు కూడా నడిచాయి.