Lishalliny kanaran: మలయాళ సినీ ఇండస్ట్రీలో యువ నటి లీశల్లిని కనరన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎవరో కాదు మాజీ మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత. ప్రస్తుతం ఈమె పై జరిగిన వేధింపుల ఘటన సంచలనంగా మారింది.
మలేషియాలోని సెలంగోర్‌లోని ఓ ఆలయంలో జరిగిన ఈ ఘటన గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లీశల్లిని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 21న ఆమె సెపాంగ్‌లోని ఓ ఆలయానికి వెళ్లింది. అక్కడ ఓ పూజారి, ఆమెకు పవిత్ర జలంతో అనుగ్రహం చేస్తానని చెప్పి, ఒంటరిగా ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత, అనుచితంగా తాకడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటన ఆమెను మానసికంగా కుంగదీసిందని, ఆ సమయంలో భయంతో ఏమీ చేయలేకపోయానని ఆమె తెలిపింది.ఈ ఘటన తర్వాత, లీశల్లిని తన తల్లికి విషయం చెప్పగా, వారు జూలై 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆలయానికి వెళ్లినప్పుడు పూజారి అక్కడ లేనట్లు తెలిసింది. గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు ఉన్నప్పటికీ, ఆలయ నిర్వాహకులు చర్యలు తీసుకోకపోవడం ఆమెను మరింత ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది.
అయితే, లీశల్లిని ధైర్యంగా ముందుకొచ్చి తన అనుభవాన్ని బయటకి చెప్పడం, ఇలాంటి సంఘటనలపై చర్చను తీవ్రతరం చేసింది. సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఆలయ నిర్వహణపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.