Kannappa: మంచు ఫ్యామిలీకి బ్రాహ్మణుల శాపం బాగా తగిలినట్టుంది. ఇంట్లో గొడవలు, థియేటర్లలో సినిమాలు.. ఇలా మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీకి మనశ్శాంతి లేకుండా పోయింది. ‘దేనికైనా రెడీ’ సినిమా టైమ్‌లో బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడి వారి ఆగ్రహానికి ఆ కుటుంబం కారణమైన విషయం తెలిసిందే. మోహన్ బాబు ఇంటి ముందు బ్రాహ్మణ సంఘాలు ధర్నా చేసేంత వరకు వ్యవహారం వెళ్లిందంటే.. ఏ స్థాయిలో ఆ ఫ్యామిలీ బ్రాహ్మణులను అవమానపరిచిందో అర్థం చేసుకోవచ్చు. పోలీసు కేసుల వరకు విషయం వెళ్లింది. అప్పటి నుంచి మంచు ఫ్యామిలీ అంటే బ్రాహ్మణ సంఘాలకు అస్సలు పడటం లేదు. పోని, బ్రహ్మ వంటి బ్రాహ్మణులను దూషించడం పాపం అని గ్రహించి, మంచు ఫ్యామిలీ అయినా కాస్త వెనక్కి తగ్గుతుందా? అంటే అదీ లేదు.
Also Read- Vijayabhanu: నిన్నటి మేటి నటీమణి విజయభాను ఇకలేరు
ఆ సినిమా తర్వాత బ్రాహ్మణుల విషయంలో మంచు ఫ్యామిలీ కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది. ఎందుకంటే, ఏ సినిమా అయినా బ్రాహ్మణోత్తముడు చేసే పూజతోనే ప్రారంభమవుతుంది. ఆఖరికి వాళ్లు అవమానించేలా చిత్రీకరించిన ‘దేనికైనా రెడీ’ సినిమా కూడా వాళ్లు పూజ చేస్తేనే మొదలైంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకోకుండా, కావాలని చేస్తున్నారో.. లేదంటే అలా జరుగుతుందో తెలియదు కానీ.. వారినే టార్గెట్ చేస్తున్నట్లుగా మంచు ఫ్యామిలీ హీరోల సినిమాలలో కొన్ని సన్నివేశాలుండటం విడ్డూరం. ఇప్పుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ‘కన్నప్ప’ సినిమాలోనూ బ్రాహ్మణులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి.
గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుకను పురస్కరించుకుని బ్రాహ్మణ సంఘాలు ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశాయి. కచ్చితంగా మోహన్ బాబును, కన్నప్ప టీమ్‌ను అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని ఇప్పటికే కోర్టుని ఆశ్రయించాము. కోర్టు సెంట్రల్ ఫిలిం బోర్డుకి ‘కన్నప్ప’ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్న సన్నివేశాలు తొలగించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా సెంట్రల్ ఫిలిం బోర్డు ఇప్పటివరకు ‘కన్నప్ప’ సినిమాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Also Read- Akhil Wedding: కొడుకులతో కలిసి కింగ్ నాగ్ ఏ పాటలకు డ్యాన్స్ చేశారో తెలుసా?
ముఖ్యంగా ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించి ‘పిలక గిలక’ అనే పోస్టర్ బ్రాహ్మణులను తీవ్రంగా కించపరిచే విధంగా ఉంది. బ్రాహ్మణుల పిలక ఎంత పవిత్రమైనదనేది మోహన్ బాబుకి ఎప్పటికీ తెలియదు. ఆయన తనేదో పెద్ద మనిషిని అని అనుకుంటూ ఉంటాడు కానీ, ఆయనకు ఏం తెలియదు. ఆయన సినిమాల్లో బ్రాహ్మణులను కించపరచడం అనేది చాలా కాలంగా కొనసాగుతుంది. గతంలోనూ మోహన్ బాబు అనేక సినిమాలలో బ్రాహ్మణులను కించపరిచే పాత్రల్లో నటించారు. హైదరాబాద్‌లో బ్రాహ్మణులపై మోహన్ బాబు, విష్ణు దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా విషయంలో మాట్లాడిన సినీ పెద్దలకు.. ‘కన్నప్ప’ సినిమాలోని దారుణ సన్నివేశాలు కనిపించడం లేదా? అని మేము ప్రశ్నిస్తున్నాం. ‘పిలక గిలక’ పోస్టర్‌పై సినిమా పెద్దలు మాట్లాడాలి. మోహన్ బాబు కుటుంబ సభ్యుల సినిమాల ప్రారంభోత్సవానికి పూజలు చేస్తుంది బ్రాహ్మణులు. ప్రతి సినిమా విజయానికి పూజలు నిర్వహిస్తుంది బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణులను కించపరుస్తూ సన్నివేశాలు తీయటం సినిమా వారికి ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన సమయం వచ్చింది. నిజంగా, సినిమా హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లకు దమ్ముంటే వారి కులాలకు సంబంధించిన సినిమాలు తియ్యగలరా? అని సవాల్ విసిరారు.
ప్రస్తుతం ఈ కాంట్రవర్సీ ఎటు వైపుకు దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది. కాగా, ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం టీమ్ అంతా ప్రమోషన్స్‌లో యమా బిజీగా ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు